'సైకిల్'పై సుప్రీంకోర్టుకు అఖిలేశ్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా గుర్తింపుతోపాటు, ఎన్నికల గుర్తైన 'సైకిల్'ను సైతం సొంతం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. వాటిని నిలుపుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సైకిల్ గుర్తుపైకానీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షస్థానంపైగానీ తమ వాదనలు వినకుండా ముందస్తు ఆదేశాలు జారీచేయరాదంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు అఖిలేశ్ తరఫున ఆయన బాబాయి రాంగోపాల్ యాదవ్ న్యాయవాదులతోకలిసి మంగళవారం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. (అఖిలేశ్‌కే ‘సైకిల్’ )
ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ములాయం సింగ్‌యాదవ్ హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అఖిలేశ్ వర్గం ఈ చర్యకు ఉపక్రమించింది. సైకిల్ గుర్తుకోసం చిన్నపాటి యుద్ధయం చేసి, భంగపడ్డ ములాయం.. ఎన్నికల్లో కొడుకుకు వ్యతిరేకంగా పోటీచేస్తారా? లేక కూడా ఉండి ఆశీర్వాదాలు ఇస్తారా? అనేది ఇంకా తేలాల్సిఉంది. ఇదిలాఉంటే, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది.
తొలిదశకు నోటిఫికేషన్ జారీ
ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలకు మంగళవారం నోటిషికేషన్ విడుదలైంది. 15 జిల్లాల్లోని 73 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జనవరి 24. ఉపసంహరణ గడువు జనవరి 27. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న తొలిదశలో అత్యధిక స్థానాలు ముస్లిం ప్రాబల్యం ఉన్నవేకావడం గమనార్హం. వాటిలో ముజఫర్‌నగర్, మీరట్, షమ్లి, హాపుర్, అలీగఢ్, బులంద్ షహర్ ఆగ్రా, మథుర లాంటి ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి. తొలిదశ పోలింగ్ దృష్ట్యా ములాయం.. అఖిలేశ్‌పై వేసిన 'ముస్లిం వ్యతిరేక' ముద్ర ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.