అప్పుడు వాడి వయసు రెండేళ్లు: ములాయం
ఒకవైపు ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ యాదవే ఉంటాడని ప్రకటించినా, పార్టీ మీద ఆధిపత్యాన్ని వదులుకోడానికి మాత్రం పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ ససేమిరా అంటున్నారు. తాను ఎమర్జెన్సీ సమయంలో పార్టీని స్థాపించానని, అప్పటికి అఖిలేష్ వయసు కేవలం రెండేళ్లేనని చెప్పారు. వివాదాల్లో పడొద్దని మాత్రమే తాను వైరివర్గానికి చెప్పానని, పార్టీ ఐకమత్యంగా ఉండాలన్నదే తన ధ్యేయమని లక్నోలో తన ఇంటి వద్ద గుమిగూడిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా తనదేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం తానెంతగానో కష్టపడ్డానని, తమ్ముడు శివపాల్ యాదవ్ తనకు అండగా ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు కేవలం ఒక్క వ్యక్తితోనే తమకు ఇబ్బందులు వచ్చాయన్నారు. రాంగోపాల్ యాదవ్ ప్రతిపక్షాలతో చేతులు కలిపి, కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పార్టీ పేరును గానీ, గుర్తును గానీ ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదన్నారు. పార్టీని ఒక్కతాటిపై నడపాలన్నదే తన ఉద్దేశమని ములాయం అన్నారు.