దేశానికి యూపీ దిక్సూచి కాదు
రెండో మాట
బీజేపీ ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని రాష్ట్రాల్లో సాధించిన విజయాలు దక్షిణ భారత రాష్ట్రాలకు ఎంతమాత్రం ‘దిక్సూచి’ కాజాలవు. ఎనభై నాలుగు ఎంపీ సీట్లతో పార్లమెంటును శాసించే ఏ యూపీ రాజకీయమూ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు వాస్తవంగా ప్రాతినిధ్యం వహించ లేదు. రాజకీయ ప్రయోజనాలను బట్టి రాష్ట్రాలను, ప్రజలనూ చీలుబాటల వైపు నడిపించే రాజకీయాలకు యూపీ కేంద్ర స్థానంగా జరిగే ప్రక్రియలకు దక్షిణాది రాష్ట్రాలు ఏ వర్గ, కుల, మత రాజకీయ పాలనా శక్తులకు బలి కాకూడదు.
‘‘జాతీయ స్థాయిలో గత 30 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాల శకం, ద్వైపాక్షిక పాలనాయుగ రాజకీయ వ్యవస్థ అనంతరం మొదటిసారిగా భారతదేశ రాజ కీయాలలో మరోసారి ఏకపక్ష పాలనకు తలుపులు తెరుచుకుంటున్నట్టుగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే ఇంతకూ బీజేపీ మరో కాంగ్రెస్ రూపంలో అవతరించబోతున్నదా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల తీర్పు ఆ ప్రశ్నకు సమాధానం కాబోతోంది’’. – నిస్తుల హెబ్బార్, ‘హిందూ’ విశ్లేషకుడు
ఈ రూపంలో ఈ ప్రశ్న వేయడంలో (బీజేపీ మరొక కాంగ్రెస్‌గా అవతరిం చబోతోందా) నానా అర్థాలకు చోటు కల్పిస్తున్నట్టయింది. ఇంతవరకు పాలకు లుగా ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్–బీజేపీలు అనుసరిస్తూ వచ్చిన విధాన నిర్ణయాలు, ఎత్తుగడలు, ఎన్నికలలో గెలవడమే విజయ చిహ్నంగా భావించి పన్నిన వ్యూహాలు భారత ప్రజలను ఎంత సులభంగా మోసగించవచ్చో నిరూపిస్తూ వచ్చాయి. అలాగే అదే వరలో ఈదులాడుతూ పరిమిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా అవహేళన చేయటంలో ఈ రెండు పార్టీలకు భిన్నంగా ఉండగలవనుకున్న ప్రధాన ప్రతిపక్షాలు.. (వామ పక్షాలు సహా) అనైక్యత, అనవగాహనవల్ల దేశ ప్రజాబాహుళ్యానికి ప్రజాపం థాలో సునిశితమైన మార్గాన్ని చూపడంలో, నిర్దేశించటంలో విఫలమవుతూనే ఉన్నాయి. చివరికి బిహార్ ఎన్నికలలో బీజేపీ పొందిన శృంగ భంగానికి దారి చూపిన సమష్టి ప్రయోగంగా తలెత్తిన ‘మహా ఐక్యసంఘటన’ నుంచి కూడా పాఠాలు నేర్చుకోని ప్రతిపక్షాలు నేటి ఎన్నికలలో విఫలమయ్యాయి.
అభివృద్ధి దేవతా వస్త్రం
‘ప్రజాస్వామ్యాన్ని’ కూడా రక్షించాలనుకొని కాపాడడానికి తగిన వ్యూహ రచన చేసుకొనలేక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రాజ్యాంగం నిర్దేశించిన ‘సెక్యులర్, సోషలిస్టు, ప్రజా(గణ)తంత్ర వ్యవస్థ’ను కాపాడు కొనడంలో సైద్ధాంతిక పునాదుల్నే నిర్వీర్యం చేసుకున్నాయి. ఇది సమష్టిగా ప్రతిపక్షాలు చేసుకున్న రాజకీయ ఆత్మహత్య, ప్రజాస్వామ్య పరిరక్షణలో పరి మిత పరిధిలోనే అయినా రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన కనీసపు విలువల్ని పరిరక్షించడంలో ఇవి విఫలమవుతూ, అవకాశవాద రాజకీయాలకు, ఆచరణకు సన్నిహితమైపోయాయి. బహుశా అందుకనే రాజ్యాంగ నిర్మాతలలో ఉద్దండులైన డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్టు ‘‘ఇండి యాలో ప్రజాస్వామ్యం అనేది పైపై అద్దిన మెరుగు పూత మాత్రమే. భారత గ్రామీణ వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్యవర్గ పునాదులపై నిర్మితమై ఉన్నం దునే దేశానికి అందిన పైపై జిలుగుల మెరుగుపూతగానే ఉండిపోయింది’’. కనుకనే ప్రధాని మోదీ గుజరాత్ ఘోర కలి అనంతరం 2014 జనరల్ ఎన్ని కల్లో.. ‘గుజరాత్ మోడల్’ గురించి ‘దేవతా వస్త్రాల కథ’ల్లాంటి గాథలు విని పించసాగారు, ప్రజల్ని నమ్మబలికించారు. కానీ ఈ ‘అభివృద్ధి నమూనా’ రేపు ఎలా ఉండబోతోందో చెప్ప లేదు.
దీన్ని ప్రశ్నిస్తూ ప్రసిద్ధ ఆర్థిక విశ్లేషకుడు ఈ అభివృద్ధి నమూనా ఎలాం టిదో మూడేళ్ల నాడే ఇలా చెప్పారు: ‘మోదీ చెప్పే అభివృద్ధి నమూనా... ఆచ రణలో కాంగ్రెస్–యూపీఏ ప్రభుత్వం చేపట్టిన నయా–ఉదారవాద అభివృద్ధి నమూనాకు కేవలం నకలు మాత్రమేగానీ మరోటి కాదు. ప్రజల ఆదా యాల్ని, వారి కష్టార్జితమైన సంపదను కాస్తా సంపన్న వర్గాలకు బదిలీ చేసే ‘అభివృద్ధి నమూనా’ ఇది’’ (ఫ్రంట్‌లైన్ 4.4.2014). దేశ భవిష్యత్తును అంబానీ, ఆదానీ కుబేర వర్గాలు శాసిస్తున్న ‘అభివృద్ధి’ ఇది.
నల్లధనం లెక్కలు చూపరేం?
కనుకనే ‘దొందూ దొందే’ అన్నట్టు పిండితార్థంలో కాంగ్రెస్–బీజేపీల విధానాలు తారతమ్యాల శాతంలో తేడాపాడాలే గానీ కొన్ని మౌలిక విధా నాలలో, ఆచరణలో వీటిమధ్య గణనీయమైన తేడాల్ని చూపడానికి ప్రయ త్నించడం ఆత్మవంచన అవుతుంది. కనుకనే తొలి ప్రధాని పండిట్ నెహ్రూ విధాన నిర్ణయాలలో కాంగ్రెస్ నిశిత వైఖరిని అనుసరించలేక పోవడానికి కారణం ‘ఆదినుంచీ కాంగ్రెస్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆరెస్సెస్) శక్తులు ఉనికిలో ఉంటూనే ఉండటం’ అని. ఆ ప్రభావం నేటి బీజేపీ మెజారిటీ పాలనలో కూడా తిష్టవేసి కొనసాగుతోంది. ఆకస్మికంగా అసెంబ్లీ ఎన్నికల ముందు భారత ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన నగదు లావాదేవీలను అకస్మాత్తుగా నిల్పివేస్తూ పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేసి ‘కల్లుకోసం వచ్చి ముంత’ దాచుకున్న దొంగలా ఎన్నికలలో లబ్ధి పొందడానికి కరెన్సీ రద్దును ఏకపక్షంగా నిర్ణయించడానికి మోదీ సిద్ధపడ్డారు. దీన్ని కొందరు ఆరెస్సెస్ పెద్దలు బీజేపీ మూలాలనే దెబ్బతీసే చర్యగా వర్ణించవలసి వచ్చింది. ఎన్ని కలలో ప్రచారం కోసం దొంగ డబ్బును, పన్ను ఎగవేతదార్లను బయటికి లాగడానికే తన నిర్ణయమని మోదీ చెప్పుకున్నా, ఈ క్షణం దాకా బీజేపీ ప్రభుత్వంగానీ, రిజర్వుబ్యాంకుగానీ నోట్లు రద్దు వల్ల బ్యాంకులకు దొరికిన, భయపడిన బ్లాక్‌మనీ ఎంతో ఇతమిత్థంగా ప్రజలకు లెక్క చెప్పలేదు, చూపలేదు. కాగా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందూ నెలల తరబడి (ఈరోజుకీ) న్యాయబద్ధమైన, తమ కష్టార్జితమైన నగదు కోసం గంటల తరబడి నిలబడవలసి వచ్చి నందున క్యూలలోనే 150 మంది కస్టమర్లు కుప్పకూలి ప్రాణాలు వదిలితే వారికి విచారాన్నిగానీ, వారి కుటుంబాలకు ఆర్ద్రతతో క్షమాపణగానీ చెప్పిన ఉదాహరణ ఈ క్షణందాకా లేదు.
ఈ కరడుగట్టిన తత్వం నుంచి పుట్టుకొచ్చిందే–ప్రజాబాహుళ్యంపట్ల నాయకత్వం అధికార స్థాయిలో పేరుకున్న నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం నుంచి దూసుకువచ్చిందే ప్రజలను ‘గొర్రెల మంద’గా భావించే అహంకార ధోరణి, ప్రచారంలో ‘అహింస’ ఒక పోజుగా, ఆచరణలో ‘హింస’ను ఆశ్రయించే తత్వం వెర్రితలలు వేసి సమాజంలో అశాంతిని అధికార స్థాయిలోనే ప్రోత్సహించడం జరుగుతోంది. ఇందుకు నిదర్శనం– ఎన్నికలలో కుల, మత, వర్గ ధోరణులు, రాజకీయాల ప్రస్తావన పూర్తిగా నిషేధమనీ, ఇందుకు విరుద్ధంగా రాజకీయపక్షాలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించినా, బీజేపీ నాయకత్వం ‘కులప్రస్తావన’ మాత్రం ఎక్కడా ఎన్నికలలో చేయరాదని చెప్పిందేగానీ, ‘మత’ ప్రస్తావనలు మాత్రం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మానుకోలేదు. పైగా ఓటర్ల ముందు ‘శ్మశాన వాటిక’లను, ‘బొందలగడ్డ’ ప్రస్తావనలను బీజేపీ నాయకత్వం చేసింది.
పాలకపార్టీలు రెండూ సమఉజ్జీలే..!
బీజేపీ ఉత్తరప్రదేశ్, తదితర కొన్ని రాష్ట్రాల్లో సాధించిన విజయాలు దక్షిణ భారత రాష్ట్రాలకు ఎంతమాత్రం ‘దిక్సూచి’ కాజాలవు. 84 పార్లమెంట్ సీట్లతో పార్లమెంటును శాసించే ఏ యూపీ రాజకీయమూ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేదు. రాజకీయ ప్రయోజనాలను బట్టి రాష్ట్రా లను, ప్రజలనూ చీలుబాటల వైపు నడిపించే రాజకీయాలకు యూపీ కేంద్ర స్థానంగా జరిగే ప్రక్రియలకు దక్షిణాది రాష్ట్రాలు ఏ వర్గ, కుల, మత రాజకీయ పాలనా శక్తులకు బలి కాకూడదు. గాలి నినాదాలు, కపట హామీలూ ఇప్పటికే ప్రజల అనుభవంలోకి వచ్చాయి. కొన్ని మంచి చట్టాలకు (విద్యా, శాస్త్ర, సాంకేతిక, సమాచార హక్కు చట్టాలు, శాస్త్రీయ, మానవీయ శాస్త్ర పరిశో ధనలు, గ్రంథాలు వగైరా) క్రమంగా తిలోదకాలివ్వడానికి శరవేగాన సిద్ధమ వుతున్నారని గ్రహించాలి. ఇప్పటికే ఢిల్లీ, జవహర్‌లాల్ నెహ్రూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో దళిత, మైనారిటీల విద్యార్థులపైన, అధ్యాపకుల పైన దాడులు, వేధింపులు విద్యా వ్యవస్థ ఉనికిపైనే తీవ్ర ప్రభావం కల్గిస్తు న్నాయి. రోహిత్ దళితుడైనా, అతను దళితుడేనని కలెక్టర్ నిరూపణ పత్రం సమర్పించినా, అతను దళితుడు కాదని పనిగట్టుకుని నిరూపించే ప్రయత్నా నికే మోదీ ప్రభుత్వం ‘అంకురార్పణ’ చేసింది. కన్హయ్య (ఢిల్లీ)పై వేధింపులు సరే సరి. చట్ట సభలలో, జనాభాలో నూటికి 50 మందిగా ఉన్న మహిళలకు ప్రాతినిధ్య ప్రతిపత్తిని ఎగ్గొట్టడంలో, వాయిదాలు వేయడంలో కాంగ్రెస్‌తో బీజేపీ సమఉజ్జీగానే ఉంది.
అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికలలో విజయాలను, ప్రగతిని భారత లౌకిక వ్యవస్థా పరిరక్షణవైపు బీజేపీ మొగ్గగా పొరబాటున కూడా భావించి ప్రమత్తలై ఉండరాదు. తాజా ఫలితాల సందర్భంగా కూడా నిర్దిష్ట ఎజెండాను కాకుండా 2022 నాటికి (2019 ఎన్నికలపై ఆశతో) ‘నవ భారతం’ సృష్టిస్తా నని, అందుకోసం ‘కలలు కనమని’ పేద, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి ‘నవ భారత నిర్మాణానికి’ నేటి పాక్షిక ఎన్నికల్లో ‘పునాది పడిందని’ తనకు తానే కితాబిచ్చుకొన్నారు. ఎందుకని యూపీమీద అన్ని ఆశలు ఆయన పెంచుకున్నారు? దేశ రాజకీయాల దశా దిశలను యూపీ ఫలితాలే నిర్ణయించి, శాసిస్తాయని ఆయనే ఎలా ప్రకటించుకోగలిగారు? ఒకప్పుడు, సుప్రసిద్ధ దౌత్య వ్యవహర్త, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ విశిష్ట సభ్యుడు సర్దార్ కేఎం ఫనిక్కర్ (1956) యూపీ గురించి ఇలా వ్యంగ్యంగా చమత్కరించారు: ‘‘ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఉత్తరప్రదేశ్ (యూపీ)’’. ఈ విషయాన్ని మరికొంత విస్తరిస్తూ మరొక మాజీ భారత దౌత్య వ్యవహర్తలలో ఒకరు, విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన టీఎన్ కౌర్ గత పరిణామాల్ని గుర్తుచేస్తూ– ‘‘రాజకీయంగా బ్రిటిష్ పాలకులు భార తదేశంలో జాతీయతా స్ఫూర్తిని, జాతీయతను పెరగనివ్వకుండా తుంచేయ డానికి నిరంకుశంగా ప్రయత్నించారు. హిందువులను, ముస్లింలను, సిక్కు లను పరస్పరం చెట్టాపట్టాలు కట్టుకుని ముందుకుసాగి పరాయి పాలకుల నుంచి రాజకీయాధికారాన్ని గుంజుకోకుండా అడ్డుకోడానికి ప్రయ త్నించారు’’. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగానే స్వతంత్ర భారత పాలనా వ్యవస్థకు వచ్చిన రాజకీయ నాయకులు కూడా, దేశ ప్రజలు అశేష త్యాగాల ద్వారా రూపొందించుకున్న రాజ్యాంగం నిర్దేశించిన సెక్యులర్, ప్రజా స్వామిక, సోషలిస్టు వ్యవస్థా నిర్మాణానికి తూట్లు పొడుస్తూ వచ్చారు. అందుకు వీలుగా, వాలుగా యూపీలోని 86 పార్లమెంట్ స్థానాలను చేజిక్కించుకుని పదవుల రక్షణకు యూపీని ‘హబ్’గా మలచుకుంటున్నారు. అందుకే దేశ దశా దిశాగతిని యూపీ మాత్రమే నిర్ణయించాలని దక్షిణ భారతానికి సూచనప్రాయంగా తెలుపుతున్నారు. కానీ దక్షిణ భారతం దశా దిశాగతికి యూపీ ‘దిక్సూచి’ కానేరదని కూడా గ్రహించగల్గాలి!!
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in