వాగ్దానాలు మరిస్తే కీలెరిగి వాత
రెండో మాట
మాజీ ఈసీ శేషన్ లాంటి నిక్కచ్చి మనుషులు అన్ని కాలాలలోను కనిపించరు. కుల, మత ప్రసక్తి ఎన్నికలలో, ప్రచార సభల్లో, ఓటింగ్ కేంద్రాలలో వినపడ్డానికి వీల్లేదని శేషన్ కొరడా ఝళిపించాల్సి వచ్చింది. ఒక సందర్భంలో బీజేపీ కొన్నిచోట్ల మత ప్రస్తావన చేసినప్పుడు శేషన్ ‘మీ పార్టీకి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో’ జవాబు చెప్పాలన్నారు. ‘సెక్యులర్ వ్యవస్థ రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగం మీద మీరు ప్రతిజ్ఞ చేశారు. దాన్ని ఉల్లంఘించినందున మీ (బీజేపీ) గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదు’ అని ప్రశ్నించారు.
‘మానవ జీవితం, సామాజిక జీవితం కదలిక లేని నీరువంటిది కాదు. స్తంభించేది కాదు. స్పందిస్తూ నిరంతరం చైతన్యంతోనే ఉంటుంది. చట్టం కూడా ఎన్నడూ నిస్తేజంగా ఉండదు. ఉండకూడదు. భవిష్యత్తుతో పరుగు పందెం వేసుకున్న భారతదేశం ప్రజాబాహుళ్యానికి శతాబ్దాల పాటు మానవ హక్కులను హరించిన వలస సామ్రాజ్య ప్రభుత్వాన్ని సాగనంపి, చైతన్యవంతమైన విలువలతో నూతన ఉషోదయాన్ని ఆవిష్కరించుకుంది. చైతన్యవంతమైన ఈ పరివర్తనా దశ సామ్రాజ్య వాద ప్రభుత్వం నెలకొల్పిన దురన్యాయాలను అంతమొందించి స్వరాజ్య న్యాయాన్ని అట్టడుగు వర్గాల జన్మహక్కుగా ప్రకటించగలగాలి. స్వతంత్ర భారతంలోని సంపన్న భద్ర పురుషులు, వేలు విడిచిన వలస పాలనావశేషాల నుంచి బయటపడడానికి ఇష్టపడరు... అసలు రాజ్యాంగం రూపకల్పన, దాని అవతరణే విప్లవాత్మకంగా ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించి, ఆ కర్తవ్యాన్ని న్యాయ వ్యవస్థకు అప్పగించి రిట్ అధికారం ద్వారా తీర్పులిచ్చే విస్తృత అధికారాలను జ్యుడీషియరీకి దఖలు పరిచింది. అదే ప్రజాప్రయోజన వ్యాజ్యం.’
– జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ (‘ఫ్రమ్ బెంచ్ టు ది బార్’ నుంచి)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జీబీ రెడ్డి పిల్ మౌలికతను వివరిస్తూ, రాజ్యాంగం మౌలిక లక్ష్యాలను గురించి న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన లేదా శాసించిన ఆజ్ఞ ఎలాంటిదో నిష్కర్షగా పేర్కొన్నారు: ‘న్యాయ వ్యవస్థ తన అధికారాలనూ, విధులనూ నిర్వర్తించడంలో; చట్టంలో నిర్దేశించిన విధంగా ఏ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను రక్షించి, పెంపొందించి వాటిని సామాజికులకు ఆచరణలో అందేలా చూడాలని రాజ్యాంగం కోరుకుందో–అవి నెరవేరేటట్టు చూసే బాధ్యత న్యాయ వ్యవస్థదేనని రాజ్యాంగం చట్టం శాసించింది. ఇది రాజ్యాంగం నిర్వచించిన మూడు విభాగాలకూ (ప్రభుత్వం, శాసన వేదిక, న్యాయ వ్యవస్థ) వర్తించే ఆజ్ఞాపత్రం.’ అంతేకాదు. ఈ బాధ్యత నిర్వహణలో న్యాయ వ్యవస్థ తన జ్యుడీషియల్ అధికారాలను న్యాయబద్ధంగానే వినియోగిస్తూ విధాన రూపకర్తగా (పాలసీ మేకర్), శాసనకర్తగా, బుద్ధి చెప్పగల బోధకునిగా తన ఉత్తర్వులను అమలు జరిపించే మానీటర్‌గా వ్యవహరించవచ్చు. అప్పుడు మాత్రమే అది చైతన్యవంతమైన న్యాయ వ్యవస్థ అవుతుందని కూడా డాక్టర్ రెడ్డి విశ్లేషించారు.
వాగ్దానభంగం చేసేవారిని వదలరాదు
ఈ పూర్వరంగంలో ఈ నెల 8న ఢిల్లీలో ‘ఎన్నికల సమస్యలు–ఆర్థిక సంస్కరణలు’ అన్న అంశం మీద జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జగదీశ్‌సింగ్ కేహర్ ఎన్నికల నిర్వహణ తీరు, ఎన్నికల కమిషన్ బాధ్యతల గురించి, రాజకీయ పార్టీల గురించి చేసిన ప్రస్తావనలు పరిశీలించదగినవి.
1970ల వరకు సాదాగా మనుగడ సాగించిన జాతీయ ఎన్నికల సంఘం ఆ తరువాత భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థకు, పాలకుల అవినీతికి, బూత్‌ల ఆక్రమణకు, దౌర్జన్యంగా ఓట్లు వేయించుకునే అక్రమాలకు ధైర్యంగా కళ్లెం వేయలేకపోయింది. అయితే ఎన్నికలు, ఆ సందర్భంగా రాజకీయ పార్టీలు గుప్పించే హామీలు, వాటిలోని డొల్లతనం గురించి సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి కేహర్ వలే, ఆ పదవిలో ఉన్నవారు ఇంతకు పూర్వం ప్రస్తావించినట్టు లేదు.
‘ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులూ, పార్టీలూ విడుదల చేసే మేనిఫెస్టోలలోగానీ, ప్రసంగాలలోగానీ ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ధారాళంగా హామీలు ఇస్తున్నారు. వాటిని అమలు చేయని నాయకులనూ, పార్టీలనూ అందుకు జవాబుదారులను చేసి తీరాలి’ అని జస్టిస్ కేహర్ ప్రకటించారు. మేనిఫెస్టోలు ఆచరణకు నోచుకోకుండా చిత్తుకాగితాలుగా మిగిలిపోతున్నాయని కూడా కేహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజల జ్ఞాపకశక్తి ఎక్కువ కాలం నిలిచి ఉండదని తెలిసే పార్టీలూ, నేతలూ వాగ్దాన భంగాలకు పాల్పడుతున్నా’రని కూడా ఆయన అన్నారు.
ఎల్లెడలా ఉల్లంఘనలు
జస్టిస్ కేహర్ ఆవేదన నేపథ్యంలోనే, ఎన్నికల సంఘం పట్టించుకోవలసినంతగా పట్టించుకోని ఇతర సామాజిక రాజకీయ వ్యాధుల గురించి రాజ్యసభ మాజీ సభ్యుడు అశ్వనీకుమార్ ఒక ఇంటర్వూ్యలో (8–4–17) ప్రస్తావించడం గమనార్హం. అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీలు పదే పదే కుల, మత, ప్రాంతీయవాద వివక్షలను పాటిస్తూ, ధనబలంతో ఓటర్లను లొంగదీయటం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మొత్తుకున్నారు.
అంతేగాదు, పాలకపక్షాలు బ్రూట్ మెజారిటీ చాటున రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి ప్రజా వ్యతిరేక చర్యలకు దిగుతున్నారు. అందుకే బాధ్యతతో ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు నిర్వర్తించాల్సిన నిర్ణయాత్మక విధులను కోర్టులు నిర్వహించాల్సి వస్తోందని మరువరాదు. ఇందుకు ఉదాహరణ– జ్యుడీషియల్ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం, న్యాయవ్యవస్థ తన కొలీ జియం సభ్యులను చట్టప్రకారం ఎంపిక చేసుకోకుండా ప్రభుత్వం అడ్డుకోజూడడం.
ఇలాంటి విన్యాసాలు చంద్రబాబు కూడా 9 ఏళ్ల పరిపాలనలోనూ చేశారు. ఇప్పుడు కూడా చేయడం లేదని చెప్పలేం (ఆధారం కోసం ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ డీఎఫ్‌ఐడీ సర్వే నివేదిక చదివితే చాలు). అంతేగాదు, సమాచార హక్కు చట్టానికి క్రమంగా కేంద్రం ఎలా తూట్లు పొడుస్తోందో, విద్యా వ్యవస్థలో చరిత్రకు సంబంధించి ఏ రకమైన పాఠాలతో పాఠ్య పుస్తకాల్ని రూపొందించజూస్తోందో పత్రికలు సమాచారాన్ని అందజేస్తున్నాయి.
ఏ మార్గంలో వెళ్లి జాతీయ ప్రణాళికా సంఘాన్ని చాపచుట్టిందో తెలుసు. అదీ ఇదీ కాదు, 2014 ఎన్నికలకు ముందు అధికారాన్ని చేజిక్కించుకోడానికి పాలక పార్టీ సమాచార, సాంకేతిక వ్యవస్థ అధినేత అరవింద గుప్తా ఎలక్ట్రానిక్ సాంకేతిక మాధ్యమాల ద్వారా రెండు సంవత్సరాల ముందే ఏ స్థాయిలో ఊదర సృష్టించడానికి ఎలాంటి భారీ విన్యాసాలు చేసిందో లోకానికి తెలుసు.
అలా కొరడా ఝళిపించే వారేరీ!
రెండు రాజ్యాంగ విభాగాల మధ్య–చట్టాలు అమలు చేయించవలసిన ప్రభుత్వానికీ, చేసిన చట్టాల సాధికారతను ప్రశ్నించి సరిచూసే న్యాయ వ్యవస్థకీ మధ్య ఏకీభావం కొరవడి; కేంద్రంలో నిరంకుశ ధోరణి కేంద్రీకరించడంవల్ల ఎన్నికల వ్యవస్థ రూప, స్వభావాలు కూడా భయాందోళనలకు గురవుతున్నాయని మరచిపోరాదు. మాజీ ఈసీ శేషన్ లాంటి నిక్కచ్చి మనుషులు అన్ని కాలాలలోను కనిపించరు. కుల, మత ప్రసక్తి ఎన్నికలలో, ప్రచార సభల్లో, ఓటింగ్ కేంద్రాలలో వినపడ్డానికి వీల్లేదని శేషన్ కొరడా ఝళిపించాల్సి వచ్చింది (కొన్ని ఉల్లంఘనలు చెదురువాటుగా జరిగినప్పటికీ). ఒక సందర్భంలో బీజేపీ కొన్నిచోట్ల మత ప్రస్తావన చేసినప్పుడు శేషన్ ‘మీ పార్టీకి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో’ జవాబు చెప్పాలన్నారు.
‘సెక్యులర్ వ్యవస్థ రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగం మీద మీరు ప్రతిజ్ఞ చేశారు. దాన్ని ఉల్లంఘించినందున మీ (బీజేపీ) గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదు’ అని ప్రశ్నించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలో ‘ఈవీఎం’ (ఎలక్ట్రానిక్ ఓటింగ్) మెషీన్లు లోపభూయిష్టంగా ఉండటమేగాక, అందులో చిట్టీలన్నీ అధికార పార్టీ ముద్రలతోనే గుప్పించి ఉన్నాయన్న రహస్యం బయటపడింది. ఆ పిమ్మట ఎన్నికల కమిషన్ ఇచ్చిన సంజాయిషీ–నెపం కమిషన్ల మీదికి తోయకండి.
మెషీన్లలో లోపం లేదని సర్టిఫికెట్ ఇచ్చిన మరుక్షణం యూపీ ఎన్నికల ఫలితాల్ని కూడా ప్రశ్నిస్తూ (ఈ చర్చను అంతర్జాతీయ నిపుణులు చెప్పిన వివరాలతో మరో సందర్భంలో వివరంగా సాగిద్దాం) వివిధ పార్టీలు, సాంకేతిక నిపుణులు నిలదీశారు. ఇందుకు, ‘ఇప్పటి ఈవీఎంలు పాత సరుకు, ఇప్పటికేదో అయిపోయింది. 2019 నాటికి కొత్తవి కొందా’మంటూ ఎన్నికల కమిషన్ ప్యానెల్ విచిత్రమైన ప్రకటన విడుదల చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లనేరదంటూ వందేమాతరం రామచంద్రరావు ఎన్నికల సంఘానికి, కోర్టుకూ అప్పీలు చేశారు. ఆరోపణలు రుజువైనందున కోర్టు చెన్నారెడ్డి ఎన్నికను రద్దుచేసి, ఆరేళ్లపాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడని ప్రకటించింది. అందువల్ల మనకి మంచి చట్టాలు ఉన్నాయి, మంచి తీర్పులూ ఉన్నాయి. కానీ ఈ దేశంలో సామాజికంగా పెద్ద కుదుపు వస్తే తప్ప ప్రజాస్వామ్యం, దాని విలువలు పునఃప్రతిష్ట కాగల అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి.
అందుకే సుప్రీంకోర్టు ఒక ఎన్నికల కేసులో (2001) వచ్చిన పిటిషన్‌పై చెప్పిన తీర్పులో ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్వభావం, దాని వ్యవహార శైలి అనేది స్థూలంగా ప్రజాస్వామ్యం సారాంశాన్ని తేలుస్తుంది. ఆ సారాంశం అనేది–ప్రజా ప్రతినిధులుగా నిర్ణయించే అభ్యర్థుల సరుకుపైన ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కొలబద్ద అయితే, అందులో పోటీ చేసేవారు పార్లమెంటరీ వ్యవస్థ బతకడానికి తోడ్పడే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు’ అని చెప్పింది (ఎస్.ఆర్. చౌధురి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు).
చట్టాన్ని ముంచుతున్న పక్షవాతం
అభ్యర్థుల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం అవసరమని 2002 నాటి మరొక తీర్పులో (యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘీభావ సంస్థ) స్పష్టం చేసింది. అంతేగాదు, పోటీలో ఉన్న అభ్యర్థుల పూర్వాపరాలను తెలుసుకొనే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేసిన ప్రజా ప్రాతినిధ్య చట్టానికి 2002లో వచ్చిన 3వ సవరణ చట్టం తూట్లు పొడిచింది. అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టానికి రెండుసార్లు తెచ్చిన సవరణలు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి.
అందుకే అశ్వనీకుమార్ వ్యంగ్యంగా సమాచార హక్కు చట్టం గురించి ఓ జోక్ వేశారు: ‘పాలనా వ్యవస్థ నిర్ణయాలు తీసుకోవటంలో పక్షవాతానికి గురికావడానికి బహుశా సమాచార హక్కు చట్టం ప్రధాన కారణమై ఉంటుంది’. దీని వెనుక దాగిన రహస్యం పేర్కోవాలి: ప్రధాని మోదీ బీఏ విద్యార్హతను ప్రశ్నించే హక్కును కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ చెలాయించచూడ్డమే ఇప్పుడు చట్టాన్ని ముంచుతున్న ఆ ‘పక్షవాతం’.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు