భారత ఎన్నికల సంఘం ఒక పస లేని ప్రతిపాదన చేసి, అభిప్రాయాలు చెప్పండంటూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. అదేమిటంటే.. పార్టీలు ఎన్నికలలో ఇవ్వబోయే హామీలు; ఆ హామీలను అమలుచెయ్యబోయే విధివిధానాలు, వాటికై ఎలా నిధులు సమీకరించబోయేదీ, ప్రణాళిక అమలయ్యాక ఏం లాభం కలిగేదీ వివరిస్తూ కమిషన్‌కి ముందస్తుగానే అఫిడవిట్ సమర్పించాలట. తద్వారా ప్రజానీకానికి అలవికాని హామీల బాధ తప్పడంతో బాటు, ప్రభుత్వ ఖజానా స్థితిగతుల పట్ల వాస్తవిక దృక్పథంతో ఎవరున్నారో తెలుస్తుందట.
ఎన్నికల సంఘానిది విచిత్రమైన కోరిక. ఏ పార్టీ అయినా ఒక అభివృద్ధి కార్యక్రమం గురించో, సంక్షేమ విధానం గురించో చెప్పి, అది ఎందుకు తమ ప్రాధమ్యమో చెప్పగలదు. కానీ వాటికి నిధులెక్కడినుండి వస్తాయో, ఎలా మేనేజ్ చేస్తుందో చెప్పాలంటే సాధ్యమేనా? పోనీ తెలుసుకుని ఎన్నికల సంఘం ఏమి చేస్తుంది?
ఏదైనా ప్రతిపాదన తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తే ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకుంటుంది? అలా జడ్జ్ చేసే రాజ్యాంగపరమైన హక్కు ఆ సంఘానికి ఉందా? పనికిరాని పరిజ్ఞానం సేకరించడం ద్వారా ఎన్నికల సంస్కరణలు సాధ్యమౌతాయా? ఇప్పుడు కావాల్సింది లోపరహితంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ. ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకోగల చైతన్యం ప్రజలకు ఎటూ ఉంది. అట్టే బెంగ పెట్టుకోనక్కర లేదు.
– డాక్టర్ డీవీజీ శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment