dvg shankar rao
-
ఫండే: ఈ వారం కథ - 'డీల్ ఓకే!'
అర్ధరాత్రి నిద్రలో మెలకువ వచ్చి కళ్లు తెరిచి తుళ్ళి పడ్డాను. చిమ్మచీకటి. పక్కనే ఉన్న ఓ మొహం. కేవలం దాని మీదనే వెల్తురు. విరబోసిన జుత్తు. చింతనిప్పుల్లా కళ్ళు. వికటాట్టహాసం. మళ్లీ కళ్లుమూసి ఆంజనేయ దండకం అందుకున్నాను. మత్తు కొంచెం వదిలాక కొంచెం నిదానం వచ్చాక ఒక కన్ను సగం తెరిచి చూశాను. అది మా ఆవిడే. దయ్యం కాదు. ఇపుడు భయం ఇంకా ఎక్కువైంది. ధైర్యం కూడదీసుకుని అడిగాను ‘ఏమిటిది’ అని. ‘యూ ట్యూబ్‌లో ఇది ఇంటరెస్టింగ్‌గా వుంది. చూస్తారా?’ ‘అర్ధరాత్రి ఈ అంకాలమ్మ శివాలెందుకు? అంతగా అయితే పొద్దున్న చూసుకోవచ్చు కదా!’ ‘భలేవారే. అప్పుడు వేరేవి చూడొచ్చు’ సిన్సియర్‌గా చెప్పింది. ఆవులించి, అటువైపు తిరిగి తలగడని కావలించి పడుకున్నాను. ఇది జరిగి రెండు నెలలయింది. అంటే ఆ తర్వాత అలా అవ్వలేదని కాదు. రోజూ అయ్యీ, అయ్యీ నాకలవాటయి పోయింది. ఇప్పుడు నేను తుళ్ళి పడటం లేదు. ఇలా జరగడానికి కారణం నేనే. మాది అన్యోన్య దాంపత్యం. నన్నొదిలి మా ఆవిడ ఒక్క క్షణం ఉండేది కాదు. ఎల్లవేళలా అంటిపెట్టుకునే వుండేది. అనుమానం తో కాదు. అభిమానంతో. నాకు కవిత్వం రాయడం ఇష్టం. అయితే ఎదురుగా ఎవరున్నా రాయలేను. పెన్ను కదలదు. ఆవిడ 24 గంటల నిరంతర వార్తా స్రవంతి చానెల్లాగా నాతోనే ఉండడం వల్ల ఈ మధ్య రాయడం అవ్వడం లేదు. ఆ మాట అనలేక ఒకసారి చెప్పి చూశాను ‘బంగారం.. ఏమైనా పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా, మంచి వ్యాపకం కదా!’ ‘పుస్తకాన్ని చిన్నప్పటి నుంచీ చూసీ, చూసీ బోరు కొట్టేసింది. తాకితే చాలు.. చూడండి స్కిన్ ఎలర్జీలాగా ఒళ్లంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి. వద్దు బాబోయ్.’ ‘పోనీ టీవీ చూడొచ్చు కదా!’ ‘అది కుదరదు. నేను టె¯Œ ్తలో ఉన్నప్పుడు ఒకసారి టీవీలో జీడిపాకం సీరియల్ చూస్తుండగా నాన్న వచ్చారు. చదువుకోకుండా అలా చూడడం ఆయనకు నచ్చక నన్ను కాణిపాకం తీసుకువెళ్ళి, ఒట్టేయించుకున్నారు, ఈ సీరియల్ అయిపోయేవరకూ టీవీ చూడకూడదని. ఆ సీరియల్ ఈ జన్మకి అయ్యేట్టు లేదు.’ ‘పోనీ నా కవితలు నోట్సుల నిండా కోకొల్లలుగా ఉన్నాయి. అవి చదివి ఎలా ఉన్నాయో చెప్పొచ్చు కదా!’ ‘కబుర్లు చెప్పండి. ఎన్నయినా వింటాను. కవితలంటే మాత్రం చెవులు కోసుకుంటాను. నిజంగానే. అస్సలిష్టం ఉండవు.’ ‘మా తల్లే, పెళ్లికి ముందు మీ నాన్న నేను కవిని అని తెలిసి.. మా అమ్మాయి కవితలంటే చెవి కోసుకొంటుంది అంటే ఈ అర్థంలో అనుకోలేదు’ గొణిగాను. అప్పుడు వచ్చిందో ఐడియా. యూ ట్యూబ్‌ని మెల్లగా తనకి అలవాటు చేసెయ్యాలి. అందులో ‘ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు’ అంటూ అడ్డమైనవీ చూపించడం చెయ్యాలి. అలా అలా మొదట కలిసి చూడడం అలవాటు చేశాను. చూస్తూ, చూస్తూ నేను మానేశాను. తను కంటిన్యూ చేస్తోంది. ఆ గ్యాప్‌లో నేను కవిత్వం రాసుకొంటున్నాను. అయితే తన అలవాటు ఇలా వెర్రితలలు వేసి నిద్రలు చెడగొడుతుందనుకోలేదు. ‘నీకో సర్ప్రైజ్ బంగారం.. నా కవిత్వం అంతా ఒక పుస్తకంగా పబ్లిష్ చేశాను. త్వరలో ఆవిష్కరణ. నువ్వు రావాలి.’ ‘ఓహ్. కంగ్రాట్స్. నేను రాకుండా ఎలా ఉంటాను, నచ్చకపోయినా? నాకేగదా అంకితం ఇచ్చారు?’ గుండెలో రాయి పడింది. ‘నీక్కాదోయ్. యూ ట్యూబ్‌కి’ గొణిగాను. ఓ చూపు చూసింది. అలాంటి చూపు ఇంతకు ముందు ఒకసారే అనుభవం. కాలేజీలో అడిగిన ప్రశ్నకి తిక్క జవాబు చెప్పినపుడు మాస్టారు చూసిన చూపు. పుస్తక ఆవిష్కరణ సభకి ఇద్దరం వెళ్ళాం. నా కవి మిత్రుల్ని, అభిమానుల సందోహాన్ని, పటాటోపాన్ని, నా పుస్తకాలకు ఎగబడే సాహితీ ప్రియుల్ని గర్వంగా మా ఆవిడకి చూపాలని గొప్ప ఆశగా ఉంది. సభ చూసి ఉస్సురన్నాను. గంట గడిచినా కుర్చీలు ఖాళీ. చూస్తే పట్టుమని పదిమంది లేరు. కవిగాయక కళాకారులు, బంధుమిత్రులు అంతా బందు. బొత్తిగా మొహమాటం లేదు వీళ్ళకి. వచ్చిన వాళ్లలో ఎవరైనా పుస్తకం పొరపాటున అడిగితే ఒట్టు. సభానంతరం కొంచెం గిల్టీగా అన్నాను.. ‘బంగారం.. అనవసరంగా పుస్తకం ప్రచురించి వేలకు వేలు తగలెట్టానేమో కదా!’ ‘మీరే అలా అనుకుంటే ఎలా అండీ? అమ్ముకుని సొమ్ము చేసుకుందామని కాదు కదా మీరు పబ్లిష్ చేసింది. ఇంటికి పదండి ముందు. మీకో సర్ర్పైజ్ న్యూస్ చెప్తాను.’ ‘ఏంటబ్బా’ అనుకుంటూ ఇంటికి చేరక ముందే ఉగ్గబట్టలేక, గేటు బయటే అడిగేశాను విషయమేంటని! గేటులోంచి నన్ను ఇంట్లోకి గిరవాటేసి సుడిగాలిలా వచ్చింది. నన్ను కుర్చీలో కూలదోసి తన సెల్లో యూ ట్యూబ్ ఓపెన్ చేసి చూడమంది. అందులో ‘తొక్క తీస్తా’ అన్న టైటిల్‌తో ఉన్న వీడియో. దాంట్లో అంతా చిక్కుడుకాయలకు, చింతకాయలకు తొక్క తీసే విధానం చూపుతూ వాయిస్ ఓవర్. పావుగంట సేపు సాగుతుంది. పరమ బోరు. కాకపోతే మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే అది మా ఆవిడ చానెల్. ‘ఈ వీడియోలు చూసీ చూసీ నేనేం తక్కువ అని చానెల్ పెట్టానండీ. సక్సెస్ అయ్యింది. ఇక మరి చూసేదే లేదు. అప్లోడ్ చెయ్యడమే తప్ప!’ కొంచెంసేపటికి కోలుకున్నాను మెంటల్ షాక్ నుండి కాదు, ఆశ్చర్యం నుండి. ‘హమ్మయ్య, ఏమైతేనేం. మరి పిచ్చిగా యూ ట్యూబ్ చూడదన్నమాట.. పిచ్చి పిచ్చిగా అప్లోడ్ చెయ్యడం తప్పించి. థాంక్ గాడ్ ’ అనుకుంటూ ‘మంచి సర్ర్పైజ్’ అన్నాను. ‘అంతే కాదు మీ పుస్తకం ప్రచురణకయిన ఖర్చు నేనే భరిస్తాను. ముందు ముందు కావాలంటే మరిన్ని పుస్తకాలు ప్రచురించుకోండి. యూ ట్యూబ్ వల్ల నాకు వచ్చిన ఆదాయం అంతా మీకే. ఓకేనా?’ ఓ.. వీక్షకులను టార్చర్ పెడితే డబ్బులు కూడా ఇస్తారన్న మాట. అయితే నేను యూ ట్యూబ్‌కి అంకితం ఇవ్వడం అన్నది అతికినట్టు సరిపోయిందే. ‘థాంక్యూ బంగారం. అయితే ఒక షరతు. నీ చానెల్ నేను చచ్చినా చూడను, నా కవితలు నువ్వూ చూడొద్దులే. సరేనా?’ ‘అంతకన్నానా! నేనూ అదే అందామనుకున్నాను. మీ కవిత్వం చచ్చినా చూడను. నా చానెల్ మీరు చూడొద్దులే.’ ఆవిడ వీడియో సరంజామా వెతుక్కుంటూ వెళ్ళింది. నేను పెన్ను, పేపర్ అందుకున్నాను. — డాక్టర్ డీవీజీ శంకరరావు -
Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?
2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్‌లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?) పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. – డాక్టర్ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
ఎన్నికల సంఘం.. విచిత్ర కోరిక
భారత ఎన్నికల సంఘం ఒక పస లేని ప్రతిపాదన చేసి, అభిప్రాయాలు చెప్పండంటూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. అదేమిటంటే.. పార్టీలు ఎన్నికలలో ఇవ్వబోయే హామీలు; ఆ హామీలను అమలుచెయ్యబోయే విధివిధానాలు, వాటికై ఎలా నిధులు సమీకరించబోయేదీ, ప్రణాళిక అమలయ్యాక ఏం లాభం కలిగేదీ వివరిస్తూ కమిషన్‌కి ముందస్తుగానే అఫిడవిట్ సమర్పించాలట. తద్వారా ప్రజానీకానికి అలవికాని హామీల బాధ తప్పడంతో బాటు, ప్రభుత్వ ఖజానా స్థితిగతుల పట్ల వాస్తవిక దృక్పథంతో ఎవరున్నారో తెలుస్తుందట. ఎన్నికల సంఘానిది విచిత్రమైన కోరిక. ఏ పార్టీ అయినా ఒక అభివృద్ధి కార్యక్రమం గురించో, సంక్షేమ విధానం గురించో చెప్పి, అది ఎందుకు తమ ప్రాధమ్యమో చెప్పగలదు. కానీ వాటికి నిధులెక్కడినుండి వస్తాయో, ఎలా మేనేజ్ చేస్తుందో చెప్పాలంటే సాధ్యమేనా? పోనీ తెలుసుకుని ఎన్నికల సంఘం ఏమి చేస్తుంది? ఏదైనా ప్రతిపాదన తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తే ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకుంటుంది? అలా జడ్జ్ చేసే రాజ్యాంగపరమైన హక్కు ఆ సంఘానికి ఉందా? పనికిరాని పరిజ్ఞానం సేకరించడం ద్వారా ఎన్నికల సంస్కరణలు సాధ్యమౌతాయా? ఇప్పుడు కావాల్సింది లోపరహితంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ. ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకోగల చైతన్యం ప్రజలకు ఎటూ ఉంది. అట్టే బెంగ పెట్టుకోనక్కర లేదు. – డాక్టర్ డీవీజీ శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
వైఎస్సార్సీపీ ప్లీనరీ భవిష్యత్ సీనరీ
ఆంధ్రపదేశ్‌లో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నిర్వహిస్తోన్న భారీ ప్లీనరీని ప్రజానీకం ఆసక్తిగా చూస్తోంది. ఈ ప్లీనరీ ఆ పార్టీ ఆవిర్భావం తరువాత జరుగుతున్న మూడోదీ, అధికారం అందుకున్న తర్వాత మొదటిదీ. భవిష్యత్తులో వేయబోయే అడుగులపై దిశా నిర్దేశం చేసేవిధంగా పలు తీర్మానాలు ఇందులో చర్చకు వస్తుండటం ముదావహం. పదేళ్లుగా ప్రజల్లో ఉండి పోరాటం జరిపిన పార్టీ, వారి ఆశీస్సులతో భారీ విజయాన్ని నమోదు చేసి మూడేళ్లుగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ మూడేళ్లూ ఆర్థికంగా కష్టకాలం. విభజన అనంతరం తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో పాటూ రెండేళ్ల కరోనా వల్ల వచ్చిన ఆర్థిక దుఃస్థితీ ఇబ్బంది పెడు తోంది. అయినప్పటికీ లక్షా నలభై వేల కోట్ల మేరకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సాయం అందించడం, గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గర చెయ్యడం, లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడం కొనసాగించగలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో సహా వివిధ రీతుల్లో విద్యార్థులకు చేయూత నిచ్చిన కారణంగా డ్రాప్ ఔట్ రేట్ తగ్గి, ఎన్రోల్మెంట్ శాతం పెరిగింది. వైద్య రంగానికి కూడా కేటాయింపులు పెంచి రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను మంజూరు చేసింది. అయితే రానున్నది గడ్డుకాలం. ఆర్థిక స్థితి మెరుగు పరచడంతో బాటు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు సమగ్ర ప్రణాళికలు అవసరం. మరో వైపు రాజకీయ ప్రత్యర్థులనూ, వారి ఆరోపణలనూ దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేసి ఉత్తేజితుల్ని చెయ్యాలి. ప్రజల అజెండాను చర్చించి ప్రజల మద్దతు నిలుపుకోవాల్సి ఉంది. ఏరకంగా చూసినా ఈ ప్లీనరీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. (క్లిక్: సామాజిక న్యాయమే పాలన అజెండా) – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
నేనూ నాగరాజు... ఫొటో పై డేట్ ఆఫ్ డెత్ చూశాక..
ఆ రోజు సాయంత్రం... పదేళ్ల తర్వాత ఊర్లోకి అడుగుపెట్టాను. నేనొచ్చినట్టు నా శత్రువు నాగరాజుకి తెలిసే అవకాశం లేదు. వాడితో శత్రుత్వానికి నేపథ్యాలు ఇక్కడ చెప్పడం అనవసరమే గానీ తీవ్రత చెప్పడం అవసరమే. ఎదురుపడితే ఎవరో ఒకరమే ప్రాణాలతో మిగులుతాం. రెండోవాడు హంతకుడు కావాల్సిందే.. వాడైనా..నేనైనా. ఒకరు శవం.. ఇంకొకరు ముద్దాయి. అంతే. వేరే మార్గం లేదు. అయిదేళ్ల కిందట.. ఒకసారి నేనే మధ్యవర్తుల ద్వారా రాజీ సూత్రం ప్రతిపాదించాను.. ‘అయ్యిందేదో అయ్యింది.. జీవితాలు పాడవుతున్నాయి గతం మరిచిపోదాం’ అంటూ. ససేమిరా అన్నాడు. అదే చివరిసారి. వాడికి సొసైటీలో పలుకుబడి ఎక్కువే. అందుకనే దూరంగా బతుకుతున్నాను. ఒకరి ఉనికి ఒకరికి తెలియనంతగా. ఊళ్ళో ఎవరితోనూ టచ్‌లో లేను. ఆరోజు మాత్రం రావాల్సివచ్చింది.. ఒంటరిగా. రాత్రయ్యింది.. ఇంట్లో భోజనం చేసి నిద్రకుపక్రమించాను. ముందు జాగ్రత్తగా తలగడ కింద ఒకవైపు కత్తి.. మరోవైపున బెడ్ కింద, చేతికందేంత దూరంలో ఇనుపరాడ్ ఉంచుకున్నాను. ఉదయాన్నే వెనక్కి వెళ్లిపోవాలి. నేను ప్రస్తుతం ఉంటున్న పట్టణంలో ఎవరూ నేనిలా ఆయుధాలతో పడుకునే పరిస్థితిలో ఉంటానని చచ్చినా నమ్మరు. ఇక్కడే ఈ స్థితి. ఇక తెల్లవారుతుందనగా గదిలో అలికిడి. కళ్ళు తెరిచేలోగా నన్ను సమీపించిన చప్పుడు. కచ్చితంగా బలమైన మనిషి అడుగులే. తలగడ కింద కత్తిని అందుకోబోయాను. అప్పటికే ఆలస్యమైంది. నా ఛాతీ మీద బరువు. ఆగంతకుడు నా మీద కూర్చుని, చేతుల్ని కదలనివ్వడం లేదు. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. వీడు కచ్చితంగా నాగరాజే. వాడు జైలుకి, నేను పైలోకానికి పోవడం ఖాయం. పెనుగులాడుతున్నాను. ప్రయత్నం వదలలేదు. చివరకు పట్టు వీడింది. ఒక్కసారిగా బలంగా విదిలించి లేచాను. వాడు మెరుపులా చీకట్లో కలిసిపోయాడు. వాడి వేగానికి ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు వాడి చూపులో ‘ఈసారికి బతికిపోయావులే’ అన్న భావం కదలాడింది. నా గుండె వేగం ఇంకా తగ్గలేదు. మృత్యువు అంచులదాకా వెళ్ళొచ్చాను కదా! నా ప్రతికదలికా వీడికెలా తెలుస్తోంది? కనబడగానే చంపెయ్యాలన్నంత కసి పెరుగుతూ పోతోంది కానీ ఏమాత్రం తగ్గలేదు. గ్లాసు నీళ్లు తాగాను. అందులో సగం కిందనే ఒలికాయి చేతుల వణుకుతో. ఇంకో అనుమానం ‘నిద్రపోతున్న నన్ను ఒక్క వేటుతో ఫినిష్ చెయ్యగలడు కదా! మరెందుకు తడబడ్డాడు? నా ప్రతిఘటనతో బాలెన్స్ తప్పాడా? అయితే ఎందుకు పరిగెత్తిపోయాడు? వాడి బలిష్టమైన శరీరం ముందు సన్నగా ఉన్న నేను ఏమాత్రం? లేదా నన్నిలా బెదిరించి, రెండోదఫాలో సఫా చేద్దామని అనుకున్నాడా?’ ఎన్నో సందేహాలు. ఏమైనా మరి ఉపేక్షించడానికి లేదు. అటో, ఇటో తేల్చుకోవాలి. ఉదయాన్నే పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. ఫిర్యాదు చేశాను. అనుమానంగా చూస్తూ ఇన్స్పెక్టర్ అడిగాడు ‘ఎవరో ఆగంతకుడా? లేదా నాగరాజే హత్యాయత్నం చేశాడా?’ అని. ‘స్పష్టంగా చూశాను సార్. నాగరాజే. వాడిమీదే ఫిర్యాదు’ అన్నాన్నేను. ‘సర్లెండి. వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి క్రైమ్‌సీన్ చూస్తారు’ అని చెప్పాడు. ఆయన మొహంలో కొంచెం నిర్లక్ష్యం. బహుశా నాగరాజు పట్ల సానుకూల భావం. అసలే పలుకుబడి ఉన్న వ్యక్తి. ∙∙∙ నాగరాజు ఇంటికి, పోలీసు స్టేషన్ నుండే సరాసరి బయల్దేరాను. పట్టపగలు అందరూ చూస్తుండగా ఎటూ నన్ను చంపలేడు. ఆ ప్రయత్నం చేసినా నేను ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక ఈ శత్రుత్వానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామని డైరెక్ట్‌గా చెప్పేస్తాను. గతంలో మధ్యవర్తుల ద్వారా కదా చెప్పింది.. ఈ సారి నేనే ఫైనల్‌గా చెప్పేస్తే అతడి జవాబు బట్టీ నిర్ణయించుకోవచ్చు. వాళ్ళబ్బాయి మంచినీళ్లిచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. వీడికి తండ్రి పోలికలు వచ్చినట్టు లేవు.. సన్నగా ఆధునికంగా ఉన్నాడు. ‘అంకుల్, అమ్మకి చెప్తానుండండి’అంటూ లోపలికి వెళ్ళాడు. అమ్మకి చెప్పడమేమిటి, నాగరాజు ఇంటికి ఇంకా రాలేదా అనుకుంటూ లోపలికి చూశాను. షాక్‌తో మాట రాలేదు. గోడకి పూలదండతో వేలాడుతున్న నాగరాజు ఫొటో. ఆవిడ వస్తూ నమస్కరించి ‘అంతా కలలోలా అయిపోయిందండి. ఆక్సిడెంట్‌కి ముందే నాతో మాట్లాడారు. గంటలో వస్తున్నట్లు. ఈలోగా లారీ గుద్దేసింది. స్పాట్లో ప్రాణాలు పోయాయి. ఎప్పుడూ మీ గురించే తలుస్తుండే వారు’ కళ్లు తుడుచుకుంది. ఇంకా షాక్‌లోనే ఉన్న నేను ఫొటో పై డేట్ ఆఫ్ డెత్ చూశాను. సరిగ్గా నెల అయ్యింది. ఎటూ పరామర్శకి వచ్చాననుకుంటున్నారు కదా అలానే మాట్లాడేసి సెలవు తీసుకున్నాను. అయితే రాత్రి వచ్చిందెవరు? స్పష్టంగా చూశానే! ఆ ఒడ్డు పొడవు ఇంకెవరికీ లేవే! ఒకవేళ ఉన్నా శత్రుత్వం లేదే! అంతా కన్ఫ్యూజన్. బహుశా అందుకనే ఇన్స్పెక్టర్ అలా చూసి ఉంటాడు.. నెల కిందట పోయినవాడు నిందితుడేమిటాని. ∙∙∙ ‘ఇలా జరిగిందోయ్. నాకు టెన్షన్ తగ్గడం లేదు’ భార్యకు ఫోన్ చేశాను. ‘అయితే దయ్యం అయి ఉంటుందా? త్వరగా ఇంటికి వచ్చెయ్యండి. అసలే తీరని కోరికలున్న వాళ్ళు దయ్యాలవుతారట.’ ‘నాకు ఈ దయ్యాలు, పిశాచాల మీద నమ్మకం లేదు. ఈరోజు కూడా ఇక్కడే ఉండి వస్తాను. రాత్రికి శ్మశానానికి వెళ్లి నాగరాజు సమాధి పక్కనే పడుకుని వస్తాను.’ ‘మీకిదేం పాడు బుద్ధి? ఏదో తగలడండి. ఎటూ మీకు నచ్చిందే చేస్తారు. నాకు మాత్రం భయమేస్తోంది. మా ఫ్రెండ్‌ని తోడు పిలుచుకుంటాను.’ ‘రేపొస్తాను’ అని ఫోన్ పెట్టేశాను.. నాగరాజు బతకనిస్తే అని మనసులో అనుకుంటూ. అనుకున్నట్టుగానే ఆ రాత్రి శ్మశానంలో పడుకున్నాను. భయంలేదు గానీ ఏదో తెలియని టెన్షన్. దాదాపు నిద్ర పట్టలేదు. కొంచెం పట్టేసరికి ఎవరో కదిలెళ్లినట్టనిపించింది. లేచి చూస్తే ఏమీ లేదు. ∙∙∙ ఇంట్లో నాకోసమే వెయిట్ చేస్తున్నట్లున్నారు. మా ఆవిడకు అసలే దయ్యాల భయం ఎక్కువ. రాత్రి నిజంగానే తోడు తెచ్చుకున్నట్టుంది. తన ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇంతకు ముందెప్పుడూ మేం కలుసుకోలేదు. దయ్యాలు, పారా సైకాలజీ అంటూ ఏదేదో చెప్తోంది. చూడ్డానికి మోడర్న్‌గానే ఉంది. ‘ఒక వేళ నాగరాజు దయ్యం నామీద పగబడితే రాత్రి అక్కడే ఉన్నాను కదా. రాలేదేం?’ ‘దయ్యాలు మీ ప్లాన్ బట్టీ రావు. వాటి ప్లాన్ బట్టి వస్తాయి’ నవ్వుతూ అంది. ‘అయితే మళ్లీ వచ్చే అవకాశం ఉందా?’ ‘అది మీ మీద ఆధారపడి ఉంటుంది.అయితే కచ్చితంగా మీకు హాని చెయ్యదు. గ్యారెంటీ.’ ‘అలా ఎలా చెప్పగలరు?’ ‘ఎందుకంటే మీ కథ పూర్తిగా విన్నాక తెలిసింది.. మీకు లేవంగానే వచ్చినవి హిప్నోపాంపస్ హాల్యూసినేషన్స్. ఆ టైమ్‌లోనే వస్తాయవి. ఎవరో వచ్చినట్టు భ్రమ. పీడకలల్లాంటివి అన్న మాట.’ ‘మరి ఛాతిపై బరువు, నేను కదల్లేకపోవడం?’ ‘దాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు. రెండూ కలిసి రావడాన్ని ఇంక్యుబస్ ఫెనామినా అంటారు.’ ‘మానసిక అనారోగ్యమా?’ ‘కాదు. ఆరోగ్యవంతుల్లో కూడా అలా అప్పుడప్పుడు వస్తుంది. నిద్రలేమి, అలసట, టెన్షన్ కారణాలు కావొచ్చు. కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి’ అంటూ సెలవు తీసుకుంది. తర్వాత మా ఆవిడ చెప్పింది. ఆవిడ తనకు తెలిసిన సైకియాట్రిస్ట్ అట. ఫోన్లో నేను చెప్పిన విషయమూ, విధానమూ చూసి తనను సంప్రదించిందట. ఆవిడ మా ఆవిడ నుండీ, నా నుండీ పూర్తి వివరాలు సేకరించి ఇలా వ్యాధి నిర్ధారణ చేసిందన్న మాట. ‘మరి ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా!’ ‘బాబూ, మీరు మరీ తప్పదంటే భూత వైద్యులనైనా నమ్ముతారు కానీ సైకియాట్రిస్టు అంటే మాట్లాడతారా! అదేదో పిచ్చిలా నామోషీ ఫీల్ అయిపోరా?’ హాయిగా నవ్వేశాను. నాగరాజు మరి కనబడడేమో?! -డా. డి.వి.జి.శంకర రావు మాజీ ఎంపీ, పార్వతీపురం. చదవండి: పరాయి జీవితాలు: పెళ్ళయిన ఏడాదిన్నర నుంచి ఆమెకి ఇదే అనుమానం.. ఆ క్షణం కూడా.. -
సమ(గ్ర) అభివృద్ధికే వికేంద్రీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ ఆశించే చట్టాన్ని, దానికి అనుబంధమైన రెండో చట్టం–సీఆర్డీఏని రద్దు చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడం కీలక పరిణామం. మొన్న కేంద్రం వ్యవసాయ చట్టాల విషయంలో వ్యవహరించినట్టుగానే, రాష్ట్రం రాజధాని చట్టాల విషయంలో వ్యవహరించడం– అంటే తాను తెచ్చిన చట్టాల్ని తానే రద్దు పరచడం విశేషం. ఈ నిర్ణయానికి ప్రభుత్వాన్ని తప్పుబట్టడం, ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆ చర్యకు నేపథ్యంగా చెప్పిన కారణాలు అభినందనీయం. రాష్ట్రం అభివృద్ధితో ముడిపడివున్న ఈ చట్టాలపై విస్తృత ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది. వివిధ వేదికలపై జనబాహుళ్యంలో చర్చలు జరిపిన పిమ్మట మెరుగైన చట్టాల్ని తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టాలపైన రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ భావాలకు అతీతంగా రాష్ట్ర శ్రేయస్సు ప్రాతిపదికన చర్చలు జరిగినప్పుడే ఫలితం ఉంటుంది. ప్రస్తుత తరుణంలో అది అత్యాశే కావొచ్చు కానీ ఆవశ్యం మాత్రం అదే. (చదవండి: ఇది సెల్ఫ్ గోల్ కాదా బాబూ?) అభివృద్ధి అంటే సమాజంలో అందరికీ సంబంధించిన విషయం. సమాజంలో చిట్టచివరి వరుసలో నిలబడ్డ చిట్టచివరి వ్యక్తికీ మేలు జరిగే అవకాశమిచ్చేదే అసలైన అభివృద్ధి. ప్రజాస్వామ్య పాలనలో ప్రభువులైన ప్రజలకు పాలనా వ్యవహారాలు ఎంత చేరువైతే అంత మంచిది. ఒక గ్రామస్థుడు, మండల కేంద్రం దాకా వెళ్లి, తిరిగి సాధించుకోవాల్సిన పని తన గ్రామ సచివాలయంలో చేసుకోగలిగితే ఎంత సౌలభ్యం! సమయం, ధనం మిగులు కదా! అలాగే పాలనా వికేంద్రీకరణ రాష్ట్రంలో ముఖ్యమైన మూడు ప్రాంతాలకు విస్తరిస్తే మూడు ప్రాంతాలూ వివక్షకు గురి కావు. సమాన అభివృద్ధిని చవిచూస్తూ సమప్రాధాన్యతతో ఉంటాయి. అలాగే అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. అన్యాయం జరిగిందన్న భావన, విస్మరణకు గురయ్యామన్న భావన నెలకొనని రీతిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్తున్నట్లు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి లక్షలాది కోట్లు సేకరించడం తలకు మించిన భారం. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం పరిస్థితిలో ఇది భారమే కాకుండా దాదాపు అసాధ్యం. ఈ వాస్తవం ప్రశ్నించలేనిది. దీనిపై మాటల గారడీ పనికిరాదు. ఇప్పటి పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని ఆర్థిక, సామాజిక, సమతుల్య, సమగ్ర అభివృద్ధి కోసం మెరుగైన ఆలోచనలు చెయ్యాలి. అందులో వాస్తవిక దృక్పథం, ఆచరణీయ మార్గం, స్పష్టమైన గమ్యం ఉండాలి. జనబాహుళ్యంలో విస్తృత చర్చల ద్వారానే అసలు మేలైన మార్గమేదో స్పష్టమౌతుంది. – డా. డి.వి.జి. శంకర రావు మాజీ ఎంపీ, పార్వతీపురం -
ప్రయివేటీకరణ: ఫలం తక్కువ.. ప్రమాదమెక్కువ
దేశంలో ఆర్థిక వృద్ధికి ప్రయివేటీకరణ సరైన మార్గమని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టుంది. ఆ అభిప్రాయం సరైందికాదు. అంతకు ముందున్న లైసెన్స్ రాజ్ దేశం లోని వృద్ధిని మందగింపజేస్తే, సరళీకరణ తర్వాత పరిణామాలు వృద్ధిని కొద్దిమంది చేతిలో బందీని చేశాయి. దేశానికి సొంత వనరుల్ని వాడుకుంటూ సృష్టించిన సంపద అతికొద్దిమంది చేతికే చెంది, అత్యధిక మందిని పేదలుగా ఉంచింది. దేశంలోని పెరిగే సంపదలో 70 శాతం కేవలం పది శాతంమంది దగ్గర పోగుపడడం, అసమానతల్ని పెంచే విధానాల్ని చెబుతోంది. కాబట్టి ఇప్పుడు దేశానికి కావాల్సింది సంపదల సరైన పంపిణీ. ఆర్థిక అసమానతల్ని, వీటికి మూలంగా నిల్చిన సామాజిక అసమానతల్ని రూపుమాపే కార్యక్రమం. సంపద సృష్టికి దోహదపడే వనరుల సృష్టి, వినియోగం. విలువైన మానవ వనరులు ఏర్పడేలా అందరికీ ఉచిత విద్యావకాశాలు, ఉచిత లేదా చవకైన ఆరోగ్య సేవలు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం అన్నవి దీర్ఘకాలికంగా దేశానికి లాభం చేకూర్చేవి. అన్ని ప్రభుత్వ సంస్థలూ అసమర్థమైనవి కావు, అన్ని ప్రయివేటు సంస్థలూ గొప్పవి కావు. నిర్వహణ బట్టీ ఫలితం. నిర్వహణలో లోపాల్ని సరిదిద్దితే గాడిన పడతాయి. ప్రైవేటు సంస్థ చెయ్యగలిగింది ప్రభుత్వం చెయ్యలేదంటే లాజిక్ లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థ వల్ల ఉపాధి, ఉద్యోగాలు. వాటి ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమం సాధ్యపడుతుంది. ప్రయివేటులో యాజమాన్యానికి లాభం ముఖ్యమై, మిగతా విషయాల పట్టింపు ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు వ్యాపారం చెయ్యకూడదు అన్నది సరైంది కాదు. అది ప్రజల ధనంతో ప్రజలందరికీ న్యాయం, లాభం చేకూర్చగల మార్గం. గాంధీజీ దృష్టిలోనైనా వ్యాపారం తప్పు కాదు.. నైతికత లేని వ్యాపారమే పాపం. అదైతే ఎవ్వరూ చెయ్యగూడదు.. చెయ్యనివ్వగూడదు. – డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం మొబైల్ : 94408 36931 -
ఈసీని బద్నాం చేస్తే లాభమేంటి?
ఏపీ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన వ్యవహారంపై అధికారపక్షం గగ్గోలు పెట్టడంతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రమాదంలో పడినట్లయింది. ఎన్నికల కమిషన్ తీరు వంకపెట్టలేనిదేమీ కాదు. అలా అని దాన్ని ఊరకే నిందిస్తూ కూర్చున్నా ఫలితం లేదు. నిష్పక్షపాతంగా దాని పనితీరు మదిం పుచేసి లోపాలను, బలహీనతల్ని అధిగమించేలా, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసేలా ఎలా తీర్చిదిద్దాలో రాజకీయపక్షాలన్నీ ఆలోచించాలి. దాని పని తీరును ఎత్తిచూపే రాజకీయ పార్టీలు, తాము అధికారంలోకి వస్తే ఎలా దాన్ని బలోపేతం చేస్తామో చెప్పాలి. అదేసమయంలో ఆ రాజ్యాంగ సంస్థని అధికార పక్షం పంజరంలో చిలుకగా మార్చినట్టు చెప్తున్న ప్రతిపక్షాలు, దానిని బయట నుండి పుల్లలతో హింసించి ప్రయోజనం లేదు. లక్షలాది ఓట్లు గల్లంతు కావడం ఆ సంస్థ పనితీరుకు శోభనివ్వదు. సరికదా బాధ్యతారాహిత్యంగా అనుకోవాల్సి వస్తుంది. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తపరిచినపుడు, ఆ సందేహాన్ని ప్రాక్టికల్‌గా నివృత్తి చెయ్యాలి తప్ప, అడిగిన వారి డిగ్రీలు, అర్హతలు గురించి మాట్లాడకూడదు. ఇక ప్రతిపక్షాలు 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని కోరడంలో లాజిక్ తెలియడం లేదు. ఈవీఎంల నిక్కచ్చితనంపై సందేహం ఉంటే తేల్చుకోడానికి అంత స్థాయిలో శాం పిల్ అక్కరలేదు. రాండమ్‌గా కొంత శాతం సరిపోతుంది. లేదూ, వాటిని ట్యాంపర్ చేసి ఫలితాల్ని ప్రభావితం చేశారేమో అనుకున్నా అప్పుడు 50 శాతం లెక్కించినా ప్రయోజనం లేదు. 99శాతం లెక్కించినా మిగిలిన ఒక్క శాతంలో గడబిడ జరిగి ఫలితాలు మారొచ్చు కదా. కాబట్టి విశ్వసనీయత అన్నది అయితే సంపూర్ణం లేదా సున్నా తప్ప కొంచెం కొంచెం ఉండదు. 50శాతం లెక్కింపు తో ప్రయాస తప్ప, విశ్వసనీయతలో ప్రగతి ఏముం టుంది? అయితే అందరూ ఒప్పుకోవాల్సింది ఒకటి. ఎన్నికల కమిషన్‌కి స్వయం ప్రతిపత్తి ఉండాలి. స్వతంత్ర నిర్ణయాలు అమలుచేసే శక్తి ఉండాలి. సిబ్బంది ఉండాలి. అలా చెయ్యాలంటే అవసరమైన రాజ్యాంగ సవరణలకు ఒప్పుకునే పార్టీలుండాలి. రేపు అధికా రంలోకి రాబోయే వారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఎన్నికలు ముగిశాక, తమకు ఇబ్బంది కలిగించే సంస్కరణలకు వత్తాసు పలికేలా పార్టీలు ఆలోచిస్తా యా అన్నది సందేహం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఆ తరహా సంస్కరణలు తప్పనిసరి అవసరం. -డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
సేమ్ టు షేమ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబు తీరు కారణంగా పార్టీలో అయోమయం నెలకొంది. నేతల మధ్య అంతర్గత పోరుతో ఎన్నికల రేసులో సైకిల్ వెనుకబడింది. ప్రతికూల పరిస్థితులతో కేడర్ గందరగోళంలో ఉన్నా రు. పార్టీ అధినేత జిల్లాలో పర్యటించినా టిక్కెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. నామినేషన్ల ప్రక్రియ తుది దశకొచ్చినా స్పష్టత ఇవ్వలేదు. చీపురుపల్లిలో నాలుగు స్తంభాలాట.. చీపురుపల్లి టిక్కెట్ కేటాయింపుపై జరుగుతున్న హైడ్రామాతో కార్యకర్తలు, నాయకులు ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆశావహుల జాబితాలో నిన్నటివరకు ముగ్గురే ఉన్నారనుకుంటే తాజాగా తెరపైకి నాలుగో వ్యక్తి వచ్చారు. కొ న్ని రోజులుగా కె.త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, కిమిడి మృణాళిని టిక్కెట్ కోసం కుమ్ములాడుకుంటే పరిషత్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మీసాల వరహాలనాయుడు కూడా అందులో చేరారు. తన పేరు కూ డా పరిశీలించాలని గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇక్కడ నాలుగు స్తంభాలాట సాగుతోంది. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఒకరు తన సా మాజిక వర్గం ద్వారా, మరొకరు నారాయణ విద్యా సంస్థ అధినేత ద్వారా, మిగిలిన ఇద్దరు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహనరావు ద్వారా ప్రయత్నిస్తున్నారు. చేతి చమురు కూడా భారీగా వది లించుకుంటున్నారు. వీరిలో త్రిమూర్తులరాజు ఒక్కరే గత ఎన్నికల దగ్గరి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. అయితే, ఆయనకు టిక్కెట్ రాకుండా ఓ వర్గం గట్టిగా పనిచేస్తోంది. చంద్రబాబు కూడా ఎవరెక్కువ ఖర్చు పెట్టగలరని బేరీజు వేసుకుని టిక్కెట్ ఖరారు చేసే యోచనలో ఉన్నారు. కానీ, ఒక రోజు మాత్రమే నామినేషన్ గడువు ఉండటం, చివరి వరకు అభ్యర్థి ప్రకటించకపోవడంతో కేడర్ అయోమయంలో పడింది. నలుగురు నాయకులు వేర్వేరుగా శిబిరాలు నడపడంతో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. విసిగి వేసారి, గ్రూపుల మధ్య మధ్య ఇమడలేక కొంతమంది క్లీన్‌గా ఉన్న వైఎస్సార్సీపీలోకి జారుకుంటున్నారు. చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి ప్రకటన వెలువడగానే ఆ పార్టీ నుంచి భారీ ఎత్తున జంపింగ్‌లు జరగనున్నాయి. కురుపాంలో గందరగోళం కురుపాం పార్టీలో గందరగోళం చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న నిమ్మక జయరాజ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ్ టిక్కెట్ కో సం ప్రధానంగా ఆశిస్తున్నారు. అధినేత టిక్కెట్ ఖరారు చేయకపోయినా మరొక రోజే గడువు ఉండడంతో తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో ఇద్దరూ టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. వారిద్దరే కాకుండా జనార్దన్ థాట్రాజ్ తల్లి, నర్సింహథాట్రాజ్ కూడా టీడీపీ తరపున నామినేషన్ వేశారు. మొత్తానికి ఆ పార్టీ తరఫున ముగ్గురు నామినేషన్ వేసినట్టయింది. మొత్తానికి అటు జయరాజ్, ఇటు థాట్రాజ్ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఎవరి పక్క ఉండాలో తేల్చుకోలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. అభ్యర్థి ప్రకటన వెలువడగానే ఓ వర్గం భగ్గుమనే అవకాశం ఉంది. చంద్రబాబు సభకు గైర్హాజరైన పడాల, కరణం గజపతినగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా ఉన్న టీడీపీలో చివరికి కొండపల్లి అప్పలనాయుడు గ్రూపే మిగిలింది. మిగతా రెండు గ్రూపులు పార్టీకి దూరంగా ఉండిపోయాయి. దీంతో టిక్కెట్ దక్కించుకున్న కేఏనాయుడుకి సంతోషం కరిగిపోయింది. అసమ్మతి కారణంగా ఓటమి తప్పదని పరిశీలకు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేసేది లేదని మాజీ మంత్రి పడాల అరుణ, మరో నేత కరణం శివరామకృష్ణ స్పష్టం చేశారు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ కేంద్రానికొచ్చి, ఎన్నికల ప్రచార సభ నిర్వహించినా ఆ ఇద్దరు నేతలు హాజరు కాలేదు. ఏం చేసుకున్నా పరావాలేదని చంద్రబాబు సభకు గైర్హాజరయ్యారు. వారి వద్దకు ఒకరిద్దరు నేతల్ని రాయబారానికి పంపినా పట్టించుకోలేదు. బుజ్జగింపులకు తలొగ్గని డీవీజీ శంకరావు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు బుజ్జగించినా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రాథేయపడినా మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు కరగలేదు. పునరాలోచనే లేదని, రాజీనామాకు కట్టుబడే ఉన్నానని ఫోన్లో రాయబారం నెరిపిన ఆ ఇద్దరు నేతలతో నిర్మొహమాటంగా చెప్పేశారు. చంద్రబాబుతో మాట్లాడిస్తామని, స్పష్టమైన హామీ ఏదో ఇప్పిస్తామని ప్రలోభ పెట్టినా డీవీజీ రాజీ పడలేదు. ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని కరాఖండీగా చెప్పేశారు. ఇదిలా ఉండగా, పార్టీ చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక డీవీజీ అనుచరులంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. చంద్రబాబు రాక ముందు జిల్లాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఆయన వచ్చి వెళ్లిన తరువాత కూడా అలాగే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించలేకపోవడం ఒక విధంగా బాబుకు అవమానకరమే.