ఫండే: ఈ వారం కథ - 'డీల్‌ ఓకే!' | Funday: 'Deal OK' Short Story Written By Dr DVG Shankar Rao | Sakshi
Sakshi News home page

ఫండే: ఈ వారం కథ - 'డీల్‌ ఓకే!'

Published Sun, Mar 17 2024 12:32 PM | Last Updated on Sun, Mar 17 2024 12:32 PM

Funday: 'Deal OK' Short Story Written By Dr DVG Shankar Rao - Sakshi

ఫండే, ఫ్యామీలీ.. ఈ వారం కథ

అర్ధరాత్రి నిద్రలో మెలకువ వచ్చి కళ్లు తెరిచి తుళ్ళి పడ్డాను. చిమ్మచీకటి. పక్కనే ఉన్న ఓ మొహం. కేవలం దాని మీదనే వెల్తురు. విరబోసిన జుత్తు. చింతనిప్పుల్లా కళ్ళు. వికటాట్టహాసం. మళ్లీ కళ్లుమూసి ఆంజనేయ దండకం అందుకున్నాను. మత్తు కొంచెం వదిలాక కొంచెం నిదానం వచ్చాక ఒక కన్ను సగం తెరిచి చూశాను. అది మా ఆవిడే. దయ్యం కాదు. ఇపుడు భయం ఇంకా ఎక్కువైంది. ధైర్యం కూడదీసుకుని అడిగాను ‘ఏమిటిది’ అని.

      ‘యూ ట్యూబ్‌లో ఇది ఇంటరెస్టింగ్‌గా వుంది. చూస్తారా?’
‘అర్ధరాత్రి ఈ అంకాలమ్మ శివాలెందుకు? అంతగా అయితే పొద్దున్న చూసుకోవచ్చు కదా!’
      ‘భలేవారే. అప్పుడు వేరేవి చూడొచ్చు’ సిన్సియర్‌గా చెప్పింది.
ఆవులించి, అటువైపు తిరిగి తలగడని కావలించి పడుకున్నాను. ఇది జరిగి రెండు నెలలయింది. అంటే ఆ తర్వాత అలా అవ్వలేదని కాదు. రోజూ అయ్యీ, అయ్యీ నాకలవాటయి పోయింది. ఇప్పుడు నేను తుళ్ళి పడటం లేదు. ఇలా జరగడానికి కారణం నేనే.

మాది అన్యోన్య దాంపత్యం. నన్నొదిలి మా ఆవిడ ఒక్క క్షణం ఉండేది కాదు. ఎల్లవేళలా అంటిపెట్టుకునే వుండేది. అనుమానం తో కాదు. అభిమానంతో.  నాకు కవిత్వం రాయడం ఇష్టం. అయితే ఎదురుగా ఎవరున్నా రాయలేను. పెన్ను కదలదు. ఆవిడ 24 గంటల నిరంతర వార్తా స్రవంతి చానెల్‌లాగా నాతోనే ఉండడం వల్ల ఈ మధ్య రాయడం అవ్వడం లేదు.

      ఆ మాట అనలేక ఒకసారి చెప్పి చూశాను ‘బంగారం.. ఏమైనా పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా, మంచి వ్యాపకం కదా!’
‘పుస్తకాన్ని చిన్నప్పటి నుంచీ చూసీ, చూసీ బోరు కొట్టేసింది. తాకితే చాలు.. చూడండి స్కిన్‌ ఎలర్జీలాగా ఒళ్లంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి. వద్దు బాబోయ్‌.’
      ‘పోనీ టీవీ చూడొచ్చు కదా!’
‘అది కుదరదు. నేను టె¯Œ ్తలో ఉన్నప్పుడు ఒకసారి టీవీలో జీడిపాకం సీరియల్‌ చూస్తుండగా నాన్న వచ్చారు. చదువుకోకుండా అలా చూడడం ఆయనకు నచ్చక నన్ను కాణిపాకం తీసుకువెళ్ళి, ఒట్టేయించుకున్నారు, ఈ సీరియల్‌ అయిపోయేవరకూ టీవీ చూడకూడదని. ఆ సీరియల్‌ ఈ జన్మకి అయ్యేట్టు లేదు.’
      ‘పోనీ నా కవితలు నోట్సుల నిండా కోకొల్లలుగా ఉన్నాయి. అవి చదివి ఎలా ఉన్నాయో చెప్పొచ్చు కదా!’
‘కబుర్లు చెప్పండి. ఎన్నయినా వింటాను. కవితలంటే మాత్రం చెవులు కోసుకుంటాను. నిజంగానే. అస్సలిష్టం ఉండవు.’
      ‘మా తల్లే, పెళ్లికి ముందు మీ నాన్న నేను కవిని అని తెలిసి..  మా అమ్మాయి కవితలంటే చెవి కోసుకొంటుంది అంటే ఈ అర్థంలో అనుకోలేదు’ గొణిగాను.
అప్పుడు వచ్చిందో ఐడియా. యూ ట్యూబ్‌ని మెల్లగా తనకి అలవాటు చేసెయ్యాలి. అందులో ‘ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు’ అంటూ అడ్డమైనవీ చూపించడం చెయ్యాలి.
      అలా అలా మొదట కలిసి చూడడం అలవాటు చేశాను. చూస్తూ, చూస్తూ నేను మానేశాను. తను కంటిన్యూ చేస్తోంది. ఆ గ్యాప్‌లో నేను కవిత్వం రాసుకొంటున్నాను. అయితే తన అలవాటు ఇలా వెర్రితలలు వేసి నిద్రలు చెడగొడుతుందనుకోలేదు.

      ‘నీకో సర్‌ప్రైజ్‌ బంగారం.. నా కవిత్వం అంతా ఒక పుస్తకంగా పబ్లిష్‌ చేశాను. త్వరలో ఆవిష్కరణ. నువ్వు రావాలి.’
‘ఓహ్‌. కంగ్రాట్స్‌. నేను రాకుండా ఎలా ఉంటాను, నచ్చకపోయినా? నాకేగదా అంకితం ఇచ్చారు?’
      గుండెలో రాయి పడింది. ‘నీక్కాదోయ్‌. యూ ట్యూబ్‌కి’ గొణిగాను.
ఓ చూపు చూసింది. అలాంటి చూపు ఇంతకు ముందు ఒకసారే అనుభవం. కాలేజీలో అడిగిన ప్రశ్నకి తిక్క జవాబు చెప్పినపుడు మాస్టారు చూసిన చూపు.

పుస్తక ఆవిష్కరణ సభకి ఇద్దరం వెళ్ళాం. నా కవి మిత్రుల్ని, అభిమానుల సందోహాన్ని, పటాటోపాన్ని, నా పుస్తకాలకు ఎగబడే సాహితీ ప్రియుల్ని గర్వంగా మా ఆవిడకి చూపాలని గొప్ప ఆశగా ఉంది.
      సభ చూసి ఉస్సురన్నాను. గంట గడిచినా కుర్చీలు ఖాళీ. చూస్తే పట్టుమని పదిమంది లేరు. కవిగాయక కళాకారులు, బంధుమిత్రులు అంతా బందు. బొత్తిగా మొహమాటం లేదు వీళ్ళకి. వచ్చిన వాళ్లలో ఎవరైనా పుస్తకం పొరపాటున అడిగితే ఒట్టు. సభానంతరం కొంచెం గిల్టీగా అన్నాను.. ‘బంగారం.. అనవసరంగా పుస్తకం ప్రచురించి వేలకు వేలు తగలెట్టానేమో కదా!’
      ‘మీరే అలా అనుకుంటే ఎలా అండీ? అమ్ముకుని సొమ్ము చేసుకుందామని కాదు కదా మీరు పబ్లిష్‌ చేసింది. ఇంటికి పదండి ముందు. మీకో సర్ర్‌పైజ్‌ న్యూస్‌ చెప్తాను.’

‘ఏంటబ్బా’ అనుకుంటూ ఇంటికి చేరక ముందే ఉగ్గబట్టలేక, గేటు బయటే అడిగేశాను విషయమేంటని! గేటులోంచి నన్ను ఇంట్లోకి గిరవాటేసి సుడిగాలిలా వచ్చింది. నన్ను కుర్చీలో కూలదోసి తన సెల్‌లో యూ ట్యూబ్‌ ఓపెన్‌ చేసి చూడమంది. అందులో ‘తొక్క తీస్తా’ అన్న టైటిల్‌తో ఉన్న వీడియో. దాంట్లో అంతా చిక్కుడుకాయలకు, చింతకాయలకు తొక్క తీసే విధానం చూపుతూ వాయిస్‌ ఓవర్‌. పావుగంట సేపు సాగుతుంది. పరమ బోరు. కాకపోతే మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే అది మా ఆవిడ చానెల్‌.
      ‘ఈ వీడియోలు చూసీ చూసీ నేనేం తక్కువ అని చానెల్‌ పెట్టానండీ. సక్సెస్‌ అయ్యింది. ఇక మరి చూసేదే లేదు. అప్‌లోడ్‌ చెయ్యడమే తప్ప!’ కొంచెంసేపటికి కోలుకున్నాను మెంటల్‌ షాక్‌ నుండి కాదు, ఆశ్చర్యం నుండి.
      ‘హమ్మయ్య, ఏమైతేనేం. మరి పిచ్చిగా యూ ట్యూబ్‌ చూడదన్నమాట.. పిచ్చి పిచ్చిగా అప్లోడ్‌ చెయ్యడం తప్పించి. థాంక్‌ గాడ్‌ ’ అనుకుంటూ ‘మంచి సర్ర్‌పైజ్‌’ అన్నాను.
‘అంతే కాదు మీ పుస్తకం ప్రచురణకయిన ఖర్చు నేనే భరిస్తాను. ముందు ముందు కావాలంటే మరిన్ని పుస్తకాలు ప్రచురించుకోండి. యూ ట్యూబ్‌ వల్ల నాకు వచ్చిన ఆదాయం అంతా మీకే. ఓకేనా?’

ఓ.. వీక్షకులను టార్చర్‌ పెడితే డబ్బులు కూడా ఇస్తారన్న మాట. అయితే నేను యూ ట్యూబ్‌కి అంకితం ఇవ్వడం అన్నది అతికినట్టు సరిపోయిందే. ‘థాంక్యూ బంగారం. అయితే ఒక షరతు. నీ చానెల్‌ నేను చచ్చినా చూడను, నా కవితలు నువ్వూ చూడొద్దులే. సరేనా?’
      ‘అంతకన్నానా! నేనూ అదే అందామనుకున్నాను. మీ కవిత్వం చచ్చినా చూడను. నా చానెల్‌ మీరు చూడొద్దులే.’
ఆవిడ వీడియో సరంజామా వెతుక్కుంటూ వెళ్ళింది. నేను పెన్ను, పేపర్‌ అందుకున్నాను.
— డాక్టర్‌ డీవీజీ శంకరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement