Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..! | Sakshi
Sakshi News home page

Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!

Published Mon, Apr 29 2024 12:18 PM

Lion Story Written By KK Raghunandana Funday Children's Story

ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.

‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు.
      ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది.
      ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.

‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది.
      ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి  సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.

అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది.
      ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.
‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.

ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది.
      ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది.
      ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు.
      ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.

కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.

‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా.
      జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి.
      ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.

‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది. 
      గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందన

ఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు..

Advertisement
Advertisement