బుర్హాన్‌పురం జమీందారు భువనచంద్ర. అతని పుట్టినరోజు విందుకు ప్రజలందరినీ పిలిచేవాడు. కొందరు పెంచుకునే కోడినో, బాతునో జమీందారుకు కానుకగా ఇచ్చేవారు. బుర్హాన్‌పురంలోనే సైదులు అనే పేద జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వల తీసుకుని చెరువుకు పోయి చేపలు పట్టేవాడు. తాటాకు బుట్ట నిండాక వాటిని సంతలో అమ్మి జీవించేవాడు. ప్రతిఏడు జమీందారు పుట్టిన రోజుకు పెద్ద చేపను కానుకగా ఇచ్చేవాడు. ఎప్పటిలా ఆ సంవత్సరమూ భువనచంద్ర పుట్టినరోజు వచ్చింది. ఈసారి మరింత పెద్ద చేపను పట్టి జమీందారుకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సైదులు. తాటాకు బుట్ట, వల తీసుకుని చెరువుకు పోయాడు. చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ఆ ఏడు వానలు సరిగా పడలేదు. వరుణుడు కరుణిస్తేనే జాలరి నోట్లోకి బువ్వ పోయేది. చెరువులో వల విసిరాడు. కొద్దిసేపటికి వల బరువెక్కింది. వలలో పెద్ద చేపే చిక్కిందని ఆశతో వలను లాగి ఒడ్డుకు తెచ్చి దులిపాడు. చేప చిక్కలేదు కానీ.. తాబేలు వలలో చిక్కింది. తాబేలు తన డిప్పలోంచి తల బయటకి పెట్టి చూసి, చెరువు వైపు అడుగులు వేసింది. చేప చిక్కనందుకు నిరాశ చెందాడు సైదులు. ఒక్క నిమిషం ఆలోచించి, తాబేలును పట్టుకుని తాటాకు బుట్టలో వేసుకున్నాడు. పేదవాడైన సైదులు వద్ద జమీందారుకు కానుకగా ఇవ్వటానికి ఏమీలేదు. చేసేది లేక తాబేలునే కొత్త బుట్టలో వెంట తీసుకెళ్లాడు. జమీందారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, పాదాలకు దండం పెట్టి బుట్టను కానుకగా ఇచ్చాడు. ఎప్పటిలా పెద్ద చేపనే తెచ్చాడనుకుని తెరచి చూశాడు భువనచంద్ర. కానీ బుట్టలో తాబేలును చూసి ఆశ్చర్యపోయాడు.
‘అయ్యా! క్షమించండి. ఎప్పటిలా పెద్ద చేపనే పట్టి తెద్దామనుకున్నాను. కానీ వర్షాలు లేక చెరువు ఎండిపోయింది. చేపలు లేవు’ అని చెప్పాడు సైదులు దిగులుగా.
‘అలాగా! మరి నీకు ఎలా గడుస్తోంది సైదులు?’ అడిగాడు జమీందారు.
‘చేపలు దొరికిన నాడు నోట్లోకి బువ్వ! దొరకని నాడు పస్తులే! అలవాటైపోయిందయ్యా’ అన్నాడు సైదులు. భువనచంద్ర ఒక్క క్షణం ఆచించించి ‘ఇంట్లో పెంచుకోటానికి, పూజించటానికి తాబేలును పట్టి తెమ్మని నేనే కబురు పెడదామనుకున్నాను. ఇంతలో నువ్వే కానుకగా ఇచ్చావు. చాలా సంతోషం!’ అన్నాడు. విందు చేసి ఇంటికి పోతున్న సైదులుకు చిన్న సంచి నిండా ధనసాయం చేశాడు.
నాటి నుంచి తాబేలును పెంచుకోసాగాడు జమీందారు. అంతేకాదు బుర్హాన్‌పురం అంతటా వృక్షాలు నరకటం నిషేధించి, కొత్త మొక్కలను నాటించాడు. వచ్చే ఏటికల్లా.. వర్షాలు పడి చెరువులు నిండాయి. రాంకీ
Comments
Please login to add a commentAdd a comment