సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవ దానవులు ఎవరూ చూడలేదు. సత్య స్వభావం కలిగిన ధర్మ స్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు.
కేవలం వాయుభక్షణతో పదివేల ఏళ్లు తపస్సు కొనసాగించినా, ధర్ముడు కరుణించలేదు. దర్శనమివ్వలేదు. తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృశించిపోయాడు. ఆయనకు ధర్ముడి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు. అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు సత్యం, బ్రహ్మచర్యం, తపస్సులను; యమ నియమ, దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు.
సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా, యమం ద్విజుడి రూపంలోను, నియమం ప్రాజ్ఞుడి రూపంలోను, దానం అగ్నిహోత్రుడి రూపంలోను వచ్చాయి. వారికి తోడుగా క్షమ, శాంతి, లజ్జ, అహింస, స్వచ్ఛత స్త్రీల రూపంలోను, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ, మేధ, సత్కృతి, శాంతి, పంచయజ్ఞాలు, వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి. ఈ విధంగా ధర్ముడు సపరివారంగా దుర్వాసుడి ముందుకు వచ్చాడు.
‘మహర్షీ! తపోధనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపం శ్రేయస్సును, తపస్సును నశింపజేస్తుంది. పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి. దయచేసి శాంతించు! నీ తపోధనం చాలా గొప్పది’ అన్నాడు ధర్ముడు.
ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు.
‘మహాత్మా! దివ్యపురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి? నీతో వచ్చినవారంతా తేజస్సంపన్నులుగా ఉన్నారు. వారంతా ఎవరు?’ అడిగాడు దుర్వాసుడు. ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరినే దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు. ‘అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లి దయ. గొప్ప తపస్విని. నేను ధర్ముడిని, ధర్మ పురుషుణ్ణి’ అని పలికాడు. ‘ఓ ధర్మపురుషా! మంచిది. మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు? నేను మీకు చేయగల సాయమేమైనా ఉందా?’ ప్రశ్నించాడు దుర్వాసుడు.
‘మహర్షీ! శాంతించు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు? నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి? కారణం చెప్పాలనిపిస్తేనే చెప్పు. ఇందులో నిర్బంధమేమీ లేదు’ అన్నాడు ధర్ముడు. ‘ధర్మపురుషా! నా కోపం నిష్కారణమైనది కాదు. నా కోపానికి తగిన కారణం ఉంది. చెబుతాను, విను! నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను. నీ దర్శనం కోసం పదివేల ఏళ్లు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను. అయినా, నువ్వు నన్ను కరుణించలేదు. ఇంతకాలం వేచి ఉండేలా చేశావు. నీకు నా మీద దయ లేదు. అందుకే నీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను శపించాలనుకున్నాను’ కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు.
‘మహర్షీ! దయచేసి శాంతించు. నువ్వు తొందరపడి శపిస్తే, నీ శాపానికి నేను నాశనమైతే, ఈ లోకమంతా నశిస్తుంది. నీ బాధకు మూలకారణాన్ని తొలగిస్తాను. ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను. లోకంలో ముందు సుఖాన్ని పొందినవాళ్లు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు. ముందు దుఃఖాన్ని పొందినవాళ్లు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు. పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో, అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు. అది వారు చేసిన పాపానికి ఫలం’ అని ధర్ముడు హితబోధ చేశాడు.
అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు. ‘ధర్మపురుషా! నువ్వెన్ని చెప్పినా, నీ మీద నాకు కోపం తగ్గడంలేదు. అందువల్ల నిన్ను శపించాలనే అనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఓ మహర్షీ! నా వల్ల నీకు కోపం వస్తే, దయచేసి క్షమించు. క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చేయి లేదా రారాజుగా చేయి లేదా చండాలుడిగా చేయి. వినయంగా ఉండేవారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా!’ అన్నాడు. దుర్వాసుడు వెంటనే, ‘ధర్మపురుషా! నువ్వు కోరినట్లే రారాజువుగా, దాసీ పుత్రుడిగా, చండాలుడిగా జన్మించు’ అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్లిపోయాడు.
దుర్వాసుడి శాపఫలితంగా ధర్మపురుషుడు తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా, దాసీపుత్రుడు విదురుడిగా, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు. చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment