నవ్వుతున్న బుద్ధుడు.. | Laughing Buddha Funday Story Written By Badisha Hanmantha Rao | Sakshi
Sakshi News home page

నవ్వుతున్న బుద్ధుడు..

Published Sun, Jul 14 2024 4:55 AM | Last Updated on Sun, Jul 14 2024 4:55 AM

Laughing Buddha Funday Story Written By Badisha Hanmantha Rao

‘రమణీ, ఈరోజైనా వెళ్లిన పనయిందా ?’ రాంబాబు ఇంటిలోకి వస్తూనే భార్యను అడిగాడు. లక్షలు పెట్టి కొన్న షేర్లు వేలకు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్‌ కళ్ళల్లో కనపడే దిగులు రమణి ముఖంలో తారాటలాడింది. ‘ఆ..ఆ.. అర్థమయిందిలే! ఇవ్వాళ కూడా నీ అన్వేషణ ఫలించలేదన్నమాట.’ ‘అవునండీ.. ఒక చోట ఉన్నవి మరోచోట లేవు, పిచ్చెక్కిపోతోంది. ఇలా చూస్తుండగానే వాడికి మూడో ఏడు తగులుతుంది.’

‘నా మాట వినవే.. ముందు మన ఇంటి దగ్గరలో చేరుద్దాం, కాస్త పెద్దయిన తరువాత నువ్వు చెప్పినట్టు చేద్దాం’ అంటూనే సడన్‌గా ఆపేశాడు. చెవులు రిక్కించాడు.. ఖర్, ఖర్‌.. ఖర్‌మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు.. అది రాంబాబు చెవులకు బాగా పరిచితమైన చప్పుడే.. భార్యా(ర)మణి పళ్లు కొరుకుతోంది. ‘నీకో దండం పెడతా! అలా నమలకే! పళ్ళు అరిగిపోతాయి. నీకు నచ్చినట్లే చేద్దాంలే. రేపయినా నీ వేట పూర్తి చెయ్యి.’

రాంబాబు ఎమ్‌సీఏ చదివి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయమే 7 గంటలకు క్యాబ్‌ వస్తుంది. దాంట్లో వెళ్ళి రాత్రి పదిగంటలకు వస్తాడు. మంచి జీతం. మేనమామ కూతురు, రమణిని పెళ్లి చేసుకున్నాడు. రమణి ఇంటర్‌ చదివింది. ఎమ్‌సెట్‌ రాస్తే ఆరంకెల ర్యాంకు వచ్చింది. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకొని మళ్లీ రాసింది. ఈసారీ ఆరంకెలే. అందులోనూ ఇంకాస్త గరిష్ఠ సంఖ్య. ‘ముచ్చటగా మూడోసారి రాయనా’ అనబోయి, వాళ్ళ అమ్మ చేతిలో అట్లకాడ చూసి నోరు మూసింది. మూసే ముందు, ప్రపంచంలో ఇంజినీరింగ్‌ తప్ప నేను చదవగలిగే కోర్సేదీ లేదని తేల్చి మరీ.. మూసింది. ఇక ఎన్ని చెప్పినా లాభం లేదని పెళ్లి చేశారు.

ఆ పెళ్లి జరగడానికి రమణి వాళ్ళ అమ్మమ్మ తనదైన శైలిలో చెప్పిన సెంటిమెంటు డైలాగులు కూడా ఇతోధికంగా సాయపడ్డంతో చేసేదేం లేక పళ్ళు నూరుకుంటూ.. రమణి పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. అయినా రాంబాబంటే రమణికీ ఇష్టమే. రాంబాబుకు మరదలన్నా, ఆమె అమాయకత్వమన్నా చాలా ఇష్టం. ఆమెకు ఇంటిపని, వంటపనిలో మంచి నైపుణ్యం ఉంది. రాంబాబుకు ఉద్యోగం చేసే అమ్మాయి కాకుండా ఇల్లు దిద్దుకొనే అమ్మాయినే చేసుకోవాలని వ్యక్తిగత అభిప్రాయం.  ఇద్దరూ ఉదయం నుండి రాత్రి దాకా జాబులు చేస్తే వచ్చే డబ్బులు చూసి మురవడం తప్ప, సంసారంలో సారం ఉండదంటాడు. 

స్వతహాగా రమణి మంచిదే. మంచి కాలేజీలో ఇంజినీరింగ్‌ చేయాలనేది మనసులో తీరని కోరికలాగా ఉండిపోయింది. అంతే! ఎలాగైనా టాప్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేయాలనే తన లక్ష్యం నెరవేరకుండా పెళ్లి పేరుతో అడ్డుకున్నందుకు అమ్మమ్మను కసితీరా శపించింది. ఆ శాపం తగిలి రమణి పెళ్లయి ఏడాది తిరక్కుండానే, మనవడికి తన పేరు పెట్టాలని ఒట్టు పెట్టించుకొని మరీ బాల్చీ తన్నేసింది.

రమణి.. రాంబాబును కూడా శపించేదే, కానీ ‘మనకు పుట్టబోయే బిడ్డను అక్కడా ఇక్కడా ఏం ఖర్మ.. ఐఐటీలోనే చదివించి నీ కోరిక తీర్చుకుందువుగాని’ అన్న సలహా పుణ్యమాని వదిలేసింది. ఆ సలహా వల్ల భవిష్యత్‌లో వచ్చే ఉత్పాతాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు రాంబాబు.

కాస్త ఆలస్యంగానైనా, రమణి వాళ్ల అమ్మమ్మ కోరుకున్నట్లు మగపిల్లాడే పుట్టాడు.  పాపం వాడికేం ఎరుక.. తనకోసం అప్పటికే ఒక టార్గెట్‌ ఫిక్స్‌ అయిందని! అప్పటికీ అనుమానంతో పుట్టగానే ఏడ్చాడు గానీ, అందరూ ఎత్తుకొని ఉంగా.. ఉంగా అని సముదాయించే సరికి ‘వీళ్ల మొహం, అన్ని కుట్రలు చేసే తెలివితేటలు వీళ్లకెక్కడివని’ అప్పటికూరుకున్నాడు. కానీ తల్లి సంగతి పసిగట్టలేకపోయాడు.

అందరూ వాడ్ని ‘చిటుకూ’ అని పిలవసాగారు. వాడు కూడా తన పేరు అదే అనుకున్నాడు. ‘అమ్మమ్మా, అమ్మమ్మా’ అని తప్ప.. ఆమె పేరు ఎవరికీ గుర్తులేకపోవడం ఓ కారణమై ఉంటుంది. తన పేరు మునిమనవడికి పెట్టలేదనే సంగతి పైనున్న అమ్మమ్మకు ఇంకా  తెలియదు.

చిటుకూ మొదటి సంవత్సరం పూర్తి కాక ముందే వాడికి తగిన స్కూలుకోసం వేట మొదలుపెట్టింది రమణి. 
ఒకానొక శుభ ముహూర్తాన చిటుకూని పక్కింటివాళ్లకిచ్చి, వెంటనే వస్తానని చెప్పి వాళ్ల కాలనీ దగ్గరలో ఉన్న ఓ మోస్తరు స్కూలుకు వెళ్లింది పొద్దున్నే. స్కూలు గేటు దగ్గర వచ్చి పోయే పిల్లలను పరిశీలిస్తూ నిలబడింది. కాసేపటికి నిట్టూరుస్తూ ఇంటికి వచ్చింది. రాంబాబుకు రిపోర్ట్‌ కూడా యిచ్చింది. 

‘ఎక్కువ మంది పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు లేవు. కాబట్టి చిటుకూ ఆ స్కూలులో చేరబోయేది లేదు’ అని! రాంబాబు బిత్తరపోయాడు. ‘అదేమిటే సోడాబుడ్డి కళ్లద్దాలకు చదువుకు ఏం సంబంధం?’ రాంబాబు గొణుగుడు విని ‘పాపం అమాయకుడు’ అనుకొని నవ్విన రమణి నవ్వుకి ఈసారి బిత్తర మీద బిత్తరపోయాడు.

మరో ముహూర్తంలో మరో స్కూలుకు ఉదయాన్నే వెళ్లింది. తృప్తి్తపడి సాయంత్రమూ వెళ్లింది. రాంబాబుకు సాయంకాలానికి మరో రిపోర్ట్‌ సమర్పించింది..‘స్కూలు నుండి సాయంకాలం ఇంటికి వెళ్లే పిల్లలు పెద్దగా బరువు లేని బ్యాగులతో ధిలాసాగా ఉన్నారనీ, పిల్లలకు కనీస గూని అయినా కనపడని కారణంగా ఈ స్కూలు కూడా చిటుకూకి పనికిరాదు’ అంటూ! రాంబాబు నవనాడులూ ముక్కలు ముక్కలై, వక్కలై సహస్రాలైన భ్రమ కలిగింది. 

‘అసలు నీకు కావలసిన స్కూలులో నువ్వు కావాలనుకుంటున్న లక్షణాలేవో చెప్పమ’ని పాత సినిమాల్లో సూర్యకాంతాన్ని రమణారెడ్డి అడిగినట్టు, నాలుగో మెట్టు మీద నిలబడి మొదటి మెట్టు అందుకున్న పోజులో అడిగాడు రాంబాబు. వరమిస్తున్న దేవతమాదిరిగా ఒక్కో వేలు ముడుస్తూ.. ‘మందపాటి అద్దాలున్న కళ్ల జోళ్లు, నిలబడితే వాలిపోయే నడుములు, పిల్లాడి బరువుకి కనీసం అయిదు రెట్ల బరువుతో బ్యాగు, మొహం చేతులు తప్ప ఏవీ కనిపించని స్కూలు డ్రెస్సు, బోండాకు కాళ్లుచేతులూ అమర్చినట్లు శరీరాలు, సూర్యుడిని చూడటానికి వీలుపడని టైమింగ్స్, అగరువత్తుల పొగ కమ్ముకున్న మాదిరి ముఖాలున్న టీచర్లు..’ అలా చెబుతూ రెండు చేతుల వేళ్లన్నీ ముడిచింది. 

కూల్‌గా నోట్లో వేలు వేసుకొని నిద్ర పోతున్న చిటుకూని చూసి రాంబాబుకు ఎనలేని జాలి కలిగింది. ఇలా స్కూళ్ల వేటా, చిటుకూ గాడి వయసూ క్రమంగా ఒక దశకు చేరుకున్నాయి. పనిలో పని, పక్కింటి వాళ్లు కూడా ‘అమ్మయ్య’ అనుకొని రిలాక్స్‌ అయ్యారు.. చిటుకూని కాపలా కాసే శ్రమ తగ్గినందుకు.

తనది పల్లెటూరు చదువు గాబట్టి ఇంజినీరింగ్‌ సీటు రాలేదని రమణి గాఢమైన అభిప్రాయం. ‘తను అలాంటి పొరపాటు చేయదు గాక చేయదు’ అని మనసులోనే శపథం చేసి, ఆ సిటీలో ఉన్న అన్ని స్కూళ్లు జల్లెడ వేసి, వేసి చివరికి ఒక స్కూల్లో అడ్మిషన్‌ తీసుకున్నారు.

ఒకరోజు, దగ్గరలో ఉన్న గుడిలో సరస్వతీపూజ చేసి చిటుకూని అటు నుండి అటే స్కూల్‌కి తీసుకుపోయారు. ఆరోజే మూడో ఏడు తగిలిన ఆ బాలరాజు ఇదంతా సరదాగా చూస్తున్నాడు. చివరాఖరికి స్కూల్‌ దగ్గరికి వచ్చేసరికి వీళ్లేదో చేస్తున్నారనే అనుమానం వచ్చి, ఆరున్నొక్క రాగం మొదలుపెట్టేశాడు.  వాడిని సముదాయించే సరికి తాతలు దిగొచ్చారు. అటో ఇటో నర్సరీ క్లాసులో కూర్చోబెట్టారు. రమణి కూడా తోడుగా కూర్చోవాల్సి వచ్చింది. రాంబాబు ఆఫీసు గదిలో కూర్చున్నాడు. కిటికీలో నుండి చిటుకూ క్లాస్‌ రూమ్‌ కనబడుతోంది. 

లంచ్‌ బెల్‌ తర్వాత, ఇవ్వాల్టికి చిటుకూని తీసుకెళ్లి, మళ్లీ రేపు తీసుకువస్తామని ప్రిన్సిపల్‌ని అడిగాడు.  
‘అయ్యో! అలా ఎలా కుదురుతుంది? ఇవ్వాళ్టి సిలబస్‌ మిస్‌ అయిపోతే ఎలా?’ ఆమె గాభరా పడిపోయింది. 
‘సిలబసా? నర్సరీకా?’ అయోమయంగా చిటుకూ క్లాసు వైపు చూశాడు రాంబాబు.

టీచర్‌ బోర్డు మీద థామ్సన్‌ అటామిక్‌ మోడల్‌ పటం గీస్తోంది. అదే తరగతిలో చిటుకూకి తోడుగా కూర్చున్న రమణి బోర్డు వైపు తన్మయంగా చూస్తోంది. కళ్ళు నులుముకొని బోర్డు వైపు మళ్లీ చూశాడు రాంబాబు. ‘థామ్సన్‌ అటామిక్‌.. కాదులే.. పుచ్చకాయ బొమ్మ గీస్తోందేమోలే! నేను మరీ అతిగా ఆలోచిస్తున్నా’ అనుకున్నాడు.

ఇక్కడే ఉంటే తనకేదో అయిపోద్దనిపించి ప్రిన్సిపల్‌ కాళ్లూ గడ్డం పట్టుకొని ఆరోజుకి చిటుకూతోనే బయటపడ్డారు. ‘ఈరోజంటే మొదటి రోజు కాబట్టి ఫరవాలేదు, రేపట్నుంచి స్కూల్‌ డ్రెస్‌లోనే రావాలి. లేకపోతే ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది’ ఆఫీసు తలుపు దాటుతూంటే వినపడింది. ఎదురుగా వస్తున్న కుర్రాణ్ణి చూస్తే ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ లాగా వాడి తలకాయ, కాయమేమో కుక్కర్‌లో ఉడుకుతున్నట్టు అనిపిస్తే.. రమణి మాత్రం వాడి వైపు అబ్బురంగా చూస్తోంది.

వెనక్కి తిరిగి చూస్తే .. ప్రిన్సిపల్‌ కఠినమైన చూపుతో.. మొహంపై మట్టి గోడ మీద వేసిన డిస్టెంపర్‌ లాంటి నవ్వుతో లకలక అంటున్న చంద్రముఖిలా కనపడ్డాడు రాంబాబుకు.  ఇంటికి రాగానే రమణి కాళ్లమీద పడ్డంత పనిచేశాడు రాంబాబు.  ఆ స్కూలు వద్దంటే వద్దని. అంతకంటే కఠినంగా, తన ట్రేడ్‌ మార్కు చప్పుడు చేస్తూ చెప్పింది రమణి ‘తన నిర్ణయం మారదని. ఇప్పుడు రమణి మొహం కంటే, అక్కడ ప్రిన్సిపల్‌ మొహమే ప్రశాంతంగా ఉందనిపించింది.

చూస్తుండగానే రోజులు, నెలలు  గడుస్తున్నాయి. తన లైఫ్‌లో జరిగిన పొరపాట్లు చిటుకూ లైఫ్‌లో జరగవద్దని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది రమణి. వాడు బాత్‌రూమ్‌లోకి వెళ్లినప్పుడు కూడా, వాడికి వినపడేలా ఆడియో లెస్స¯Œ ్స మొదలుకొని– వాడు టీవీ చూడాలనుకున్నపుడు వీడియో లెస్స¯Œ ్స వరకు ఎక్కడా చిన్న పొరపాటు జరగనివ్వలేదు.

మాటిమాటికీ గోళ్లు చూసుకుంటూ కోరుక్కుంటున్నాడని, ఆ గోళ్లపై కూడా పర్మనెంట్‌ మార్కర్‌తో వివిధ ఫార్ములాలు రాసేది. కారప్పూసలో త్రికోణమితిని, చపాతీలపై కెమిస్ట్రీని, వాడే వస్తువులపై ఫిజిక్స్‌నీ.. అలా చిటుకూ తినే పదార్థం.. వాడే వస్తువూ.. దేన్నీ వదలిపెట్టలేదు రమణి. ఈ విషయంలో అదీ, ఇదీ అనే సందేహం వలదు దేన్నైనా ఉపయోగించుకోవచ్చనే సూత్రాన్ని.. రమణి క్రియేటివిటీతోనే నమ్మగలం. 
లంచ్‌ బాక్స్‌లో మొదటి గిన్నెలో కూడా వివిధ నిర్వచనాలు, సింబల్స్‌ లాంటివి రాసిన స్లిప్స్‌ ఉంచేది. ఈ చదువేదో రమణి తన కాలేజ్‌లో చదివుంటే రమణికి పక్కాగా ర్యాంక్‌ వచ్చేదని రాంబాబు లోపల లోపల అనుకున్నాడు. ఇంట్లో సిట్టింగ్‌ రూమ్‌ అంతా చిటుకూ పుస్తకాలతో నిండిపోయింది. కంప్యూటర్, ట్యాబ్‌లూ వచ్చి చేరాయి. గోడల మీద డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేష¯Œ ్స ఫార్ములాలు, పీరియాడిక్‌ టేబుల్స్‌ తిష్ట వేశాయి. క్రమంగా ఆ గదిలో ఉన్న సామగ్రి హాలులోకి ఆ తరువాత బెడ్‌ రూములోకి ఒక్కొక్క అడుగే వేస్తున్నాయి.

కళ్లు మూసి తెరిచేసరికి మరో నాలుగేళ్లూ కరిగిపోయాయి. ప్రతి సంవత్సరం ఐఐటీ ర్యాంకర్ల ఫొటోలు కూడా భద్రంగా గోడ మీద ఎక్కిస్తోంది రమణి.   చిటుకూ ముక్కు మీదికి కళ్ల జోడెక్కింది. ఆరోజు రమణి ఎంత సంబరపడిందో! గోడ మీద ఉన్న ర్యాంకర్ల ఫొటోల్లో కూడా అన్నీ కళ్ల జోళ్లే మరి! శారీరక వ్యాయామం లేక గుండ్రంగా అయ్యాడు.

వివిధ రకాల పేపర్, డిజిటల్‌ మెటీరీయల్‌ రాంబాబుకు ఇంట్లో కాలు మెదపడానికి కూడా వీలుపడకుండా చుట్టుముడుతున్నాయి. రాంబాబూ, చిటుకూ మాట్లాడుకొని ఎంతకాలమయ్యిందో! కానీ బయట మాత్రం రాంబాబు ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై, ఓపీ టాండన్‌ కెమిస్ట్రీ, హెచ్‌సీ వర్మ ఫిజిక్స్‌ అంటూ ప్రైమరీ స్కూలు పిల్లలు భయపడే మాటలు మాట్లాడుతున్నాడు.

చిటుకూ కూడా కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు. మాటిమాటికీ కళ్ల జోడు పైకి నెట్టుకోవడం, కుడిచేతి చూపుడు వేలుతో ముక్కు నులుపుకోవడం, నిద్ర మధ్యలో ఇంగ్లిష్‌లో ఏ, బి, సి, డి, ఈ సెక్షన్లు అంటూ జెడ్‌ వరకూ కలవరించడం వగైరా. రమణి ఈ అలవాట్ల గురించి తన పేరెంట్స్‌తో ‘మీ మనవడు ఇప్పుడే టార్గెట్‌ ఓరియెంటెడ్‌గా ఆలోచించడమేం ఖర్మ.. నిద్ర కూడా అలాగే పోతున్నాడు’ అని చెబుతూ మురిసిపోతోంది.

వాళ్లేమో ‘వీడు మామూలు పిల్లల్లా అల్లరి చేయడు, మాట్లాడడు, ఏదో లోపం ఉందేమో’ అని అనుమానపడ్తున్నారు. ‘పోనీ వీడికి తోడుగా ఉంటారు మరొకరిని కనండి అంటే ఒక్కడే చాలని ఆపేశారు అంటూ లోలోపలే సణక్కోసాగారు. ఆ మాటలు పైకి అంటే అంతే సంగతులు. తను ఇంజినీర్‌ కాకపోవడానికి మీరే కారణమని తేల్చి నేను ఆ పొరపాటు చేయనని ర్యాంకర్ల ఫొటోలున్న గోడ మీద గట్టిగా గుద్ది మరీ చెబుతుంది రమణి.

చూస్తుండగానే కాలయంత్రపు చక్రాలు గిర్రున తిరిగాయి. ఏళ్లు గడిచాయి. ఇంటర్‌ రిజల్ట్‌ వచ్చింది. ఫరవాలేదు ఓ మాదిరి మార్కులతో పాసయ్యాడు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ అంటూ ఏవో కారణాలు వాళ్లకు వాళ్లే  చెప్పుకున్నారు. జెఈఈలు గట్రా ‘మీకూ, నాకూ సంబంధం లేదని’ బుద్ధిగా సైలెంట్‌ అయిపోయాయి. ఇక ఎమ్‌సెట్‌.. హిస్టరీ రిపీట్‌ అయింది. రమణి పేరు నిలబెట్టాడు చిటుకూ. మళ్ళీ లాంగ్‌ టర్మ్‌. హిస్టరీ మళ్ళీ రిపీట్‌. వాక్యం మార్చాల్సిన అవసరం రానివ్వలేదు.

రమణి ఆలోచించింది. ఇన్నాళ్లూ ప్రతి క్లాసులోనూ బాగానే మార్కులు వస్తున్నాయి. మరి ఇప్పుడేమైంది? ఉన్నట్టుండి గుర్తొచ్చింది. ఒకసారి క్లాసులో ఫస్ట్‌ ర్యాంక్‌లు పది మందికి వచ్చాయి. ‘అదేంటి? ఎంతమంది ఉన్నా ఒకరికే కదా ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చేద’ని అడిగితే మార్కులు సమానం, వయసు సమానం, ఎర్రర్స్‌ సమానం అంటూ అర్థం కానివేవో చెప్పారు. ‘పోనీలే, నా కొడుకుకైతే ర్యాంక్‌ వచ్చింది కదా’ని ఆనాడు తృప్తిపడింది. 

ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో జరిగిందని లోపల గంట కొడుతోంది. స్కూళ్లలో, కాలేజీలలో జరిగిన నమ్మక ద్రోహం అర్థమైంది. పలురకాలుగా ఆలోచించింది. చిన్నగా రాంబాబు దగ్గరకొచ్చి ‘పోనీలెండి.. చిటుకూకి త్వరగా పెళ్లి చేద్దాం. అప్పుడు వాడికి పుట్టే కొడుకో, కూతురో మన కోరిక నెరవేర్చకపోరు?’ అంది అప్పటికి ఆ కోరికతో రాంబాబే  సతమతమైపోతున్నట్టు.

అప్పుడు.. రమణికి ఏదో శబ్దం వినపడింది. చెవులు వెడల్పు అయ్యాయి. ఖర్‌..ఖర్‌..ఖర్‌మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు. అది రమణి చెవులు ఎప్పుడూ వినని చప్పుడు. తన ప్రమేయం లేకుండానే రాంబాబు పళ్లు కొరుకుతున్నాడు. ఎదురుగా అటక మీద కనపడుతున్న వస్తువు వైపు అతని చూపులు సాగడాన్ని రమణి పసిగట్టింది. ఆ వస్తువు ఎప్పుడో తమ పెళ్లప్పుడు సంప్రదాయం కోసం వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. అప్పటివరకూ   ఎప్పుడూ అవసరపడనిది.. రోకలి బండ. గోడ మీద పీరియాడిక్‌ టేబుల్లో సిల్వర్‌ మెటాలిక్‌ కలర్‌లో యురేనియం మెరిసిపోతోంది.

అప్పుడెప్పుడో రాంబాబు పుట్టడానికి కొన్ని నెలల ముందు ‘నవ్వుతున్న బుద్ధుడు’ అనే కోడ్‌ నేమ్‌తో పోఖ్రాన్‌ మొదటి అణుపరీక్ష జరిగింది. దాని తాలూకు పేలుడు ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయ్‌. ఇవేమీ పట్టనట్టు చిటుకూ బయట ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళాడు. ఇలాగే జరుగుతుందని వాడికి ఎప్పుడో తెలుసు. కాకపోతే చెప్పడానికి అవకాశమెక్కడిది?

ప్రహరీ గోడపై గడ్డం ఆనించి నిలబడ్డాడు. పై పెదవిపై సన్నని పెన్సిల్‌ గీతలా మీసాల జాడ.. వాడి చూపు.. ముక్కుపైకి నెట్టుకుంటూన్న కళ్లద్దాల గుండా గోడ మీదుగా .. ఎదురుగా కనిపిస్తున్న గ్రౌండ్‌ వైపు ఉరికింది. అక్కడ పరుగులు పెడుతూ ఆడుతున్న పిల్లలపై నిలిచింది. ఆశ్చర్యంగా, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మేను మరచిపోయాడు.

ఇంటికి కొద్ది దూరంలోనే ఇలాంటి గ్రౌండ్‌ వుందని ఇప్పటివరకూ వాడు గమనించనేలేదు.    సరిగ్గా అప్పుడే మైదానం నుండి పిల్లల లేత పాదాల తాకిడికి లేచిన ఓ ధూళి మేఘం... చూస్తుండగానే గాలిలో కలిసిపోయింది.. వాడి బాల్యంలా! – బాడిశ హన్మంతరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement