‘ఇదిగో అబ్బాయ్‌.. ఓపాలి ఇట్రా’...! | Funday Special Story Written Yallapu Pavani | Sakshi
Sakshi News home page

‘ఇదిగో అబ్బాయ్‌.. ఓపాలి ఇట్రా’...!

Published Sun, Jul 21 2024 1:34 AM | Last Updated on Sun, Jul 21 2024 1:34 AM

Funday Special Story Written Yallapu Pavani

‘ఇదిగో అబ్బాయ్‌.. ఓపాలి ఇట్రా’ తెల్లటి బట్టలు ధరించిన ఓ పెద్దాయన కేక విని ఆగాడు అప్పుడే పని నుండి బయటకు వచ్చిన అబ్బాయి. ‘అయ్యా’ అంటూ తలమీదున్న తుండు తీసి చేత్తో పట్టుకొని వంగి దణ్ణం పెట్టాడు. ‘ఆడ ఒడ్లు అట్టా పోతుంటే సూసి సూలేనట్టు పోతావేట్రా అబ్బాయ్‌. అవన్నీ ఏరి బస్తాలో పొయ్‌.’

‘అట్టాగేనయ్యా’ కింద పడ్డ వడ్లన్నీ తీసి బస్తాలో పోసి, ‘పనయిపోయినాదయ్యా.. ఇకెల్లమంటారా?’ వినయంగా అడుగుతున్న కుర్రాడిని ఓసారి చూసి, ‘నీ పేరేటి?’ అనడిగాడు ధాన్యం మిల్లు ఓనరు.
‘రామయ్య అయ్యా, రామం అంటారు..’
‘కొత్తగా పన్లోకి సేరింది నువ్వేనా?’ జేబులో నుండి ఓ చుట్ట తీసి వెలిగిస్తూ అడిగాడు యజమాని.
‘నేనేనయ్యా..’
‘నీ బస ఎక్కడా?’ 
సమాధానం తెలియని రామయ్య తల గోక్కున్నాడు. 
‘పోయి ఆ సెట్టుకి ఉన్న రెండు జాంపళ్లు కోసుకెళ్లు’ గాల్లోకి పొగ వదులుతూ లుంగీ పైకెత్తి కట్టుకొని తన బండి మీద ఇంటికెళ్లిపోయాడతను.

‘ఇదిగో అవ్వా.. ఇంత ఎండేలప్పుడు రాకపోతే కాస్త పొద్దెక్కాక వచ్చేవాళ్ళం కదా’ ఎండకి చేతిలో ఉన్న ఖాళీ బాల్చీ నెత్తిమీద పెట్టుకుంటూ విసుక్కుంది సీతాలు. ‘బట్టలెక్కువున్నాయి కదేటే. అయినా ఇంకా ఎండేటి.. ఏసవికాలం పోయి వర్షాకాలం వత్తేనూ..’ ‘రోజూ ఇట్టాగే సెప్తున్నావ్‌ అవ్వా..  నీరసం వత్తంది. జూన్‌ మాసం వచ్చినంత మాత్రాన వర్షాకాలం వచ్చినట్టు కాదు.. వర్షాలు పడాలా..’
‘నాయమ్మ ఓపిక పట్టే.. కాలం సల్లబడిపోతే ఎండేటి తెలీదు. ఇగో ఈ బాల్చీ మీద ఓ చేయి ఎయ్‌ సీతమ్మా..’

‘రోజూ ఇదే సెప్తావు. నా గురించి ఒగ్గేయ్‌! నీ గురించైనా నీకు యావ లేపోతే ఎట్టాగా?’ అవ్వ తలపై ఉన్న బరువు దించుతూ చిరుకోపంగా అడిగింది సీతాలు.
‘నా గురించి నాకు బెంగేంటి సీతమ్మా.. నాలుగు రాళ్ళు కూడబెట్టి నిన్నో అయ్య సేతిలో ఎట్టేత్తె ఏ సింత లేకుండా పానం ఒగ్గేత్తాను’ చీర కొంగుని బొడ్లో దోపి జుట్టు ముడేస్తూ నవ్వింది.

‘అవ్వా’ కోపం సీతాలు గొంతులో. ‘కోప్పడకులే సీతమ్మా. పోయి ఆ సెట్టు కింద కూర్సో నీడగా ఉంటాది’ నీటికి, నేలకి మధ్యున్న బండరాయిపై నిలేస్తూ చెప్పింది.
‘నేనూ సాయం సేత్తానే..’
‘వద్దమ్మ. అదిగో రావి చెట్టు కింద మీ ముసలోడు ఉన్నాడు పో..’ 
‘రోజూ ఇంతే. ఈ మాత్రం దానికి నన్ను ఎంటబెట్టుకొని రాడం దేనికి?’ విసుక్కుంటూ వెళ్ళి రావి చెట్టు కిందున్న ముసలోడి పక్కన కూర్చుంది. దగ్గరలో ఉన్న రాములోరి గుడి గోపురానికి కట్టి ఉన్న మైకు సెట్టు నుండి వస్తున్న రాముడి కీర్తన వింటూ! కీర్తనకు వంత పలుకుతూ పక్కనే ఉన్న ముసలోడితో మాట కలుతుపుతున్న సీతాలు వైపు చూస్తూ గోదాట్లోకి వెళ్ళాడు రామయ్య.

తనను చూస్తూ వెళ్తున్న రామయ్యను చూసి ‘ఒక్క నిమిషం తాత ఇప్పుడే వత్తాను!’ అంటూ రామయ్య వైపు వెళ్ళింది. తుండు, తనతో పాటు తెచ్చిన జాంపళ్ళను గట్టు మీద పెట్టి, కాళ్ళు చేతులు కడుక్కుని తాగడానికి దోసిట్లోకి నీళ్ళు తీసుకున్నాడు రామయ్య. 
‘ఓయ్‌ గళ్ళ నిక్కరూ..’ గట్టిగా వినిపించిన కేకకి చేతిలో ఉన్న నీటిని వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు రామయ్య. 
‘ఏటీ’ గయ్యిమన్నాడు ఒక్కసారిగా, గళ్ళ నిక్కరు అని పిలిచినందుకు ఉక్రోషం అతనిలో.

‘సంబడవో.. అంత కోపమేటి? ఈ రేవులో ఆడాళ్ళు పశువులు కడుగుతారు. ఆ నీళ్ళు తాగడానికి బాగోవు. ఇంద ఇవి తాగు’ గోనసంచి చుట్టున్న చిన్న మట్టికుండ రామయ్య చేతిలో పెట్టింది.
మైమరపుగా సీతాలు వైపు చూసి నీళ్ళు తాగి ‘నీ పేరేటి?’ అడిగాడు రామం. 
‘సీతాలు, మరి నీదో?’

‘రామయ్య’ చెప్పి సీతాలు చేతిలో కుండ పెట్టబోయాడు. 
‘ఉంచుకో! నాకాడ ఇంకోటుంది’ గట్టు మీదున్న జామకాయలు చూస్తూ చెప్పింది. ‘అట్టాగే’ ఓ జామకాయ సీతాలు చేతికి అందించాడు. కళ్ళతోనే కృతజ్ఞత చెప్పుకొని రావి చెట్టు దగ్గరకి వెళ్ళిపోయింది సీతాలు.

ఆ తర్వత మూడు రోజుల్లో ఏదొక సాయంత్ర సమయంలో రామయ్య కనిపించినా, సీతాలు మాట్లాడేది కాదు. రావి చెట్టు కిందున్న ముసలోడికి తనతో పాటు తెచ్చిన అన్నం పెట్టడం, గుడి నుండి వినపడే పాటలు వింటూ, చీకటి పడేదాకా కాలక్షేపం చేసి అవ్వతో వెళ్ళిపోవడం. ప్రతిరోజూ సీతాలుని ఓకంటా గమనిస్తున్న రామయ్య చూపులు సీతాలుని తాకలేదు.

ఒకరోజు, పల్చగా కురుస్తున్న వర్షపు జల్లుని లెక్క చేయక గోదారి ఒడ్డున కూర్చున్న రామయ్య పక్కనొచ్చి కూర్చుంది సీతాలు. 
‘గళ్ళ నిక్కరూ.. ఆయాల్టిసంది ఈడే కనపడుతున్నావ్‌. నీ ఊరేటి, మునుపెప్పుడూ నిన్నీడ సూళ్ళేదు.’
‘రామయ్య నా పేరు.’
‘సంబడవో.. ఈడేం సెత్తున్నావ్‌?’
‘ఒడ్డు దాటి పోతే ఇరవై అంగల్లో నేను పన్చేసే ధాన్యం మిల్లు..’
‘ఓ.. పెద్ద పనే. సొంతూరేటి?’

‘పశ్చిమ గోదావరి, గూడెంలో మా ఇల్లు.’
‘అంత దూరం నుండి వత్తున్నావా రోజూ?’ ఆశ్చర్యంలో సీతాలు.
‘లేదు. ఇల్లు ఒగ్గేసి వచ్చేశా. సదువు అబ్బలేదని మా అయ్య కొట్టాడు. అలిగొచ్చేశాను. కానీ ఇంట్లో నుండి బయటకు వచ్చేప్పుడే అనుకున్నాను గొప్పగా ఎదగాలని!’ 
‘నిన్నుకొట్టింది మీ నాయన కాదేటి?’

‘నా సంగతటెట్టు, నీ సంగతి చెప్పు ?’
‘అమ్మా, నాన్నను సూడలేదు. ఈ అవ్వ దగ్గరే పెరిగా. అవ్వ, తాతలది బట్టలుతికే పని. తాతకి ఒంట్లో బాగోపోతే అవ్వకి జతొస్తున్నా..’ అని సీతాలు చెప్తుండగా.. 
‘సీతమ్మా.. జడి పెద్దదైపోతుంది. ఇంటికి పోదాం దా..’ పిలిచింది అవ్వ.
‘అట్టాగే అవ్వా..’ అని అవ్వకి చెబుతూ  ‘నేనెల్తున్నా గళ్ళ నిక్కరూ.. నువ్వు కూడా ఇంటికి పో!’ పైకి లేచి బట్టలకంటుకున్న ఇసుక దులుపుకొని వెళ్తున్న సీతాలు కుడి చేయి పట్టి ఆపి జామకాయ చేతిలో పెట్టి ‘రామయ్య’ అని తన పేరుని గుర్తు చేశాడు.

‘సంబడవో..’ చందమామలా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సీతాలు.
ప్రతిరోజూ సంధ్యాసమయంలో మిల్లులో పని ముగించుకొని వస్తున్న రామయ్య, అవ్వతో పాటు ఒడ్డుకొస్తున్న  సీతాలు మాటల్లో పడ్డారు. ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్నట్లు కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రామయ్య తనతో పాటు తెచ్చే రెండు జామకాయల్లో ఒకటి సీతాలుకి ఇవ్వడం, సీతాలు తీసుకెళ్ళి తాత చేతిలో పెట్టడం జరుగుతోంది..

‘అతనెవరో నీకెరుకా?’ ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన సీతాలుని అడిగాడు రామయ్య. 
‘నా అనుకుంటే మనవాడే.. పాపం ఆ తాత కడుపు నింపడానికి ఎవరూ లేరు.. అడగడానికి అతనికి గొంతు లేదు.. మూగోడు.’
‘నిజమే?’ రావి చెట్టు కిందున్న ముసలోడి వైపు చూశాడు రామం. 
‘నువ్వోటి గమనించావా?’ గోదాట్లో పాదాలు పెట్టి సూర్య కిరణాలకి మెరుస్తున్న కాలి కడియాలను చూసుకుంటూ అడిగింది. 
‘ఏటీ ?’

‘నీ పేరు రామయ్య, నా పేరు సీతాలు. మనిద్దరి పేర్లు కలిపితే జతవుద్దీ’ తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గాలిగోపురం వైపు చూస్తూ ముసిముసిగా నవ్వింది. ఆరుమాసాలు గడిచాయి.. ప్రాయంతో పాటు సీతాలు అందాలూ రామయ్యలో కోరికల దీపాలు వెలిగించసాగాయి. ఓ సాయంత్రం అవ్వ.. తాత ఉతికిన బట్టలు మూట కడుతూ తాతను ‘మాయ..’ అని పిలవడం విన్నాడు రామయ్య. గోదావరిలో గెంతుతున్న సీతాలు దగ్గరకు వెళ్లి.. ‘ఓపాలి నన్నూ మాయ అని పిలవ్వే సీతమ్మా’ అని ఆశగా అడిగాడు.

‘సంబడవో.. నువ్వేటి నిక్కరూ నన్ను పిలవమనేది’ అలజడిగా అనిపించి అక్కడి నుండి వెళ్ళబోయిన  సీతాలు చేయి పట్టి ఆపి ‘నువ్వే సెప్పావ్‌ కదేటే మన పేర్లు జతవుతాయని.. పిలవ్వే’ అనడిగాడు. 
‘అట్టాగే మాయ’ రామాలయం నుండి గట్టిగా వినపడిన గంట శబ్దానికి ఇద్దరూ అటువైపు తిరిగి దణ్ణం పెట్టుకున్నారు.

‘గళ్ళ నిక్కరూ! ఈరోజేటి ఆలస్యంగా వచ్చావ్‌?’ అంటూ అరటాకులో దాచిన పరమాన్నం రామయ్య చేతికి ఇచ్చింది సీతాలు. 
‘మిల్లు అమ్మకానికి ఎట్టారంట, నేను దాచిన కొన్ని డబ్బులు ఉన్నాయి. ఇంకొన్ని సర్దుకుంటే మిగతాది తర్వాత ఇవ్వచ్చు అన్నాడు.’
‘ఇప్పుడే వత్తా మాయ, నువ్వు తింటా ఉండు..’

‘ఎక్కడికే?’ అడుగుతుండగానే మాయం అయిపోయింది సీతాలు. గంట తర్వాత ఆయాసంతో తిరిగొచ్చిన సీతాలు.. రామయ్య పక్కన కూర్చొని అతని చేతిలో తనతో పాటు తెచ్చిన బంగారు గొలుసు పెట్టింది. 
‘ఇంత బంగారం నీకెక్కడిదే?’ కంగారుగా అడిగాడు రామయ్య. 
‘మా అమ్మది. ఇది అమ్మేయ్‌ మాయ. డబ్బులు సరిపోతాయి!’
‘నీకు అమ్మ, నాన్న లేరన్నావ్‌ కదే?’

‘ఉందేమో, తెలీదు. నన్ను కని ఓ గంపలో పెట్టి గోదారమ్మ తల్లికి అప్పజెప్పేసింది అమ్మ. సాకలి పనిసేసే అవ్వకి పిల్లలు లేకపోతే నన్ను దగ్గరకు తీసి ఇంత దాన్ని చేసింది. అదే బుట్టలో ఈ గొలుసు, ఉంగరం ఉన్నాయంట. ఉంగరం అమ్మ గుర్తుగా నేనే ఉంచుకుంటాను, గొలుసు నువ్వు తీసుకో’ కల్మషంలేని మనసుతో నవ్వుతున్న సీతాలు చేతికి తిరిగి గొలుసు ఇచ్చేస్తూ ‘నాకొద్దే, ఎదోలా ఉంది’ అన్నాడు ఇబ్బంది పడుతూ.

‘కట్నం అనుకో. నా దగ్గర మొహమాటమేటి? ఈ ఉంగరం నా చేతికి తొడుగు మాయ’ ఆశగా అడిగిన సీతాలు చేతివేలికి ఉంగరం తొడిగి, ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకొని, ‘మిల్లు కొన్నాక ఈ రాములోరి గుళ్ళో పెళ్లి చేసుకుందాం సీతమ్మా’ చెప్పాడు. 
‘నీ ఇట్టం మాయ’ వేలికున్న ఉంగరం వైపు మురిపెంగా చూసుకుంది సీతాలు.

సీతాలు ఇచ్చిన గొలుసు అమ్మగా వచ్చిన డబ్బుతో తాను దాచిన డబ్బు కలిపి బయాన చెల్లించి మిగిలింది వాయిదాల ప్రకారం ఇస్తానని చెప్పి మిల్లు సొంతం చేసుకున్నాడు, సీతాలుకి విషయం చెప్పాలని మిల్లు తాలూకా పత్రాలు పట్టుకొచ్చాడు గోదారి దగ్గరకి. తెల్లటి బట్టల్లో దొరలా ఉన్న రామయ్య కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని తన కళ్ళల్లో నింపుకొని కాగితాలు అన్నీ చూసింది సీతాలు. ప్రతి చోట ఉన్న వేలి ముద్రని చూసి ‘సంతకమెట్టడం నేర్చుకో మాయ, పెద్ద ధాన్యం మిల్లు ఒనరువీ, అచ్చరాలు రాకపోతే అవమానం కదూ!!’ చిరుకోపం చూపించింది.

‘బడికి పోతేనే కదే అచ్చరాలు ఒచ్చేది, మనమేనాడూ పోయింది లేదు’ తల గోక్కున్నాడు. 
‘ఈలు కుదిరినపుడు నేను సదువు నేర్పుతాలే’
‘బడాయి పోకు, నీకొచ్చేటి?’
‘ఏడో తరగతి సదివాను, పై తరగతులకు పోవాలంటే పెద్ద బడికి ఏరు దాటి పోవాలంట, అవ్వ వద్దంది!’
‘నా సీతాలు తెలివైందే’ మెరుస్తున్న కళ్లతో సీతాలును చూశాడు.

‘సాల్లే సంబడం .. నాకో రెండు కోరికలు మాయ..’
‘సిటికెలో పనే, మిల్లు యజమాని నీ మాయ ఇప్పుడు. సెప్పు ఏటి కావాలో?’ గర్వం రామయ్య గొంతులో తొణికిసలాడింది.
‘వచ్చిన లాభాలతో మేడలు కట్టేయకా, బంగారం పోగేయకా నీకు చేతనయినంతలో పేదోళ్ళ కడుపు నింపు మాయ.. అలాగే నాకో మంచి కోక కొనెట్టు!’

‘సున్నితమైన హృదయమే నీది, నీ ఇట్ట ప్రకారమే చేద్దాం’ గోదారి వైపు చూస్తూ చెప్పాడు. 
‘ఏటి మాయ.. సూత్తున్నావ్‌..?’
‘నీటి పవాహంలో మనం కలిసినట్టు కనపడుతుందే..’
‘మరి కదిలే కాలంలో మనం ఒకటిగానే ఉంటామా మాయ?’ అంటూ రామయ్య భుజంపై తల పెట్టుకొని చూస్తుండిపోయింది.

మరో మూడు నెలలు కరిగిపోయాయి. సీతాలు దయవల్ల నాలుగు ముక్కలు నేర్చుకున్నాడు రామయ్య. ఒకసారి తన తండ్రిని చూసొస్తానని, వచ్చాక తనను పెళ్ళి చేసుకుంటానని సీతాలుకు మాటిచ్చి సొంతూరికి వెళ్ళాడు రామయ్య. వారం తర్వాత తండ్రితో పాటు వచ్చిన రామయ్య రావి చెట్టకిందున్న ముసలాడికి ఇడ్లీ పొట్లం ఇచ్చి సీతాలు కోసం ఎదురుచూడసాగాడు. చేతిలో ఎదో సంచి. ఆ పొద్దు సీతాలు రాలేదు కానీ అవ్వొచ్చింది. అవ్వను అడిగాడు సీతాలు ఎక్కడ అని. ‘పెళ్ళయిపోనాది బాబు. అత్తింటికి పోయింది’ అవ్వ మాటలు వింటూనే చేతిలో సంచి వదిలేశాడు. సంచిలో ఉన్న నెమలికంఠం రంగు నేత చీర గోదాట్లో కొట్టుకుపోయింది.

‘ఏమే లక్ష్మీ.. కాస్త ఆ తువాల పట్రా’ పెరట్లో తొట్టి దగ్గర స్నానం చేసి కేకేశాడు శ్రీను. 
‘రోజూ ఇదే అలవాటయిపోతుంది. రేపొద్దున్నుండి నువ్వే తెచ్చుకో’ విసురుగా భర్త ముఖాన తుండు విసిరి లోనికి వెళ్ళిపోయింది లక్ష్మి. ‘ఏమైంది దీనికి? రాత్రి నుండి గయ్యిమంటోంది’ అనుకుంటూ నడుముకి తుండు కట్టుకొని లోపలికెళ్ళి మంచం పై చూశాడు. ఎప్పుడూ మంచం అంచులో లక్ష్మి తనకోసం తీసిపెట్టే బట్టల చోటులో ఖాళీ అతన్ని వెక్కిరించింది.

చెక్క బీరువాలోంచి బట్టలు తీసి వేసుకొని బయటకు వస్తూ ‘లక్ష్మీ టిఫిన్‌ పెట్టు’ అని కేకేస్తూ తండ్రి కోసం చూశాడు. ఎప్పుడూ ఆ సమయానికి ఇంటి బయట అరుగు మీద కూర్చునే తండ్రి రెండ్రోజులగా జీవం లేనట్టు గుమ్మంలో ఉన్న నులక మంచంపై పడుకొని ఉంటున్నాడు.  దగ్గరకెళ్ళి తండ్రి నుదిటిపై చెయ్యేసి చూశాడు. కొడుకు చేతి స్పర్శకి కళ్ళు తెరిచిన రామయ్య ‘నేను బానే ఉన్నానురా’ అంటూ లేచి కూర్చున్నాడు.

‘నీ ఆరోగ్యం బాగుంటే నువ్వెలా ఉంటావో నాకు తెలీదా నాన్నా?’ అంటూ ‘లక్ష్మీ.. నాన్నకి కాసిన్ని పాలు వెచ్చబెట్టి తీసుకురా. అలాగే అలమరలో ఉన్న జ్వరం మాత్రలు కూడా’ అని పురమాయించాడు. ‘నన్నెందుకు అడగడం? మొన్న కూరగాయల సంతలో మీ వయసున్న అమ్మాయి చేయి పట్టుకున్నారు, నిన్న వీథి చివర అదే అమ్మాయి మెడలో బంగారు గొలుసేశారు, ఈరోజు తెల్లారి పక్కింటి రంగడితో లాయరు గారికి కబురెట్టమన్నారు. అంతా ఆ పిల్ల కోసమే కదా! పోయి ఆ అమ్మాయినే ఇవ్వమని చెప్పండి మాత్రలు’ కోపం ఆపుకోలేక బయటపడిపోయింది లక్ష్మి.

‘లక్ష్మీ.. మాటలు జాగ్రత్త’ అరిచాడు శ్రీను. 
‘నాపై నోరు పారేసుకోకుండా నేను చెప్పింది అబద్ధమని మీ నాన్నని చెప్పమనండి!’ 
‘మీ కోడలు చెప్పేది నిజమా నాన్న?’
పెదవి విప్పలేదు రామయ్య. ‘వయసు మర్చిపోయి తప్పుడు పనులు చేశాక ఇంకా ఈ మౌనం ఎందుకో! అడుగుతున్నారు కదా, సమాధానమివ్వండి’ అంటున్న లక్ష్మి చెంప ఛెళ్లుమంది శ్రీను చేతిలో. ఊహించని ఆ చర్యతో బొమ్మలా నిలబడిపోయింది లక్ష్మి. ‘మరోమాట మాట్లాడితే సహించను. పో ఇక్కడి నుండి’ వేలెత్తి చూపిస్తూ భార్యను హెచ్చరించాడు శ్రీను.

లక్ష్మి వెళ్ళిన మరుక్షణం ‘అది చెప్పింది నిజమేనా నాన్నా?’ అసహనం నిండుకున్న గొంతుకతో అడిగాడు. 
కోడలి అపార్థానికి మాటలు రాక కాసేపు మౌనంగా ఉన్న రామయ్య, కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుంటే అదే నిజం అనుకుంటాడు అని పెదవి విప్పక తప్పలేదు. ‘నిజమే బాబు, చెయ్యట్టుకున్నాను, మెళ్ళో గొలుసేశాను, కానీ మరో ఇదంగా కాదు’ మాట పూర్తి కాకుండానే, ‘ఛీ.. ఎంతో ఉన్నతమైన హోదాలో ఉన్న మీరు ఇలాంటివన్నీ చేస్తుంటే వినడానికి అసహ్యంగా, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి అవమానంగా ఉంది’ చీదరించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీను.

కొడుకు వెళ్ళిపోయాక తన గదిలో మంచం పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రామానికి గతం కళ్ళ ముందు మెదిలింది. సీతాలు దూరమై రెండేళ్ళు గడిచినప్పటికీ తను లేదని, తిరిగి రాదనే నిజం నమ్మలేకున్న రోజుల్లో తండ్రి బలవంతం మీద బాణి అనే అమ్మాయిని మనువాడాడు. బాణిని ఏనాడూ భార్యలా  చూడలేదు. మనసు విప్పి మాట్లాడలేదు.  పెళ్ళయి రెండేళ్ళయినా పిల్లల్లేరా అని అడిగిన వాళ్ళకి ఏమని సమాధానమివ్వాలో తెలియక మౌనంగా బాధపడేది బాణి.

వేసవికాలం. అతనికి సీతాలుని పరిచయం చేసిన కాలం, ఆమె నవ్వులో గ్రీష్మ కాలం కూడా తొలకరి జల్లుని పరిచయం చేసిన కాలం. ఆరుబయట సన్నజాజుల పాదు కింద నులక మంచం వేసి పడుకున్నాడు. మబ్బుల చాటునున్న చంద్రుడిలో సీతాలు, విచ్చుకున్న సన్నజాజి పువ్వులో సీతాలు నవ్వులు. పక్కకి తిరిగి పడుకున్నాడు. ఇంటి ముందున్న గిరిబాబు వేపచెట్టుకి ఆకాశవాణి తగిలించి, లాంతరు వెలుగులో బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, ఆగి ఆగి వినిపిస్తున్న నిరీక్షణ చిత్రంలోని ‘చుక్కల్లే తోచావే.. ఎన్నల్లే కాచావే.. ఏడబోయావే.. ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే’  పాటలో రాగం అందుకుంటూ..,

రామయ్య కంటి కొసన కన్నీళ్ళు. మూడో కంటికి తెలియడం ఇష్టంలేనట్టు తుడిచేశాడు. కాసేపటికి ‘మాయ’ అని పిలుస్తూ రామయ్య పక్కకొచ్చి కూర్చుంటూ అతని చేయి పట్టుకుంది బాణి. ‘మునుపోసారి సెప్పినట్టు గుర్తు మాయ అని పిలొద్దని’ చేయి వెనక్కి తీసుకున్నాడు.

‘అంత కోపమేటి మాయ, అమ్మ సెప్పింది భర్తని పేరెట్టి పిలవకూడదు అని!’
తలకింద చేయి పెట్టుకొని ఆకాశం వైపు మౌనంగా చూస్తున్న రామయ్యపై చూపు నిలిపి,
‘మన పెళ్ళికి మునుపు అమ్మ సెప్తుండేది మాయ. ఒలేయ్‌ బాణి, నీతో ఉండేవాళ్ళని నువ్వు బాగా సూసుకుంటావు, నీ పనితనంతో మెప్పు పొందుతావు, నీక్కాబోయే భర్త అదృష్టవంతుడు అని! మరి నేనేటి పాపం సేశానో తెలీదు మాయ, నీ మనసు గెలుచుకోలేకపోయాను’ దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఇంట్లోకెళ్ళిపోయింది.

జ్ఞాపకాల్లో నుండి బయట పడిన రామయ్య కాగితంపై ఏవో రాసిపెట్టాడు. పొద్దున్నుండి గది బయటకు రాని తండ్రిని తిన్నావా అని అడగలేదు, రాత్రి పది దాటాక బయటకెళ్తున్న అతన్ని చూసి ఎక్కడికని అడగలేదు శ్రీను. పొద్దు పొడవకముందే ఎవరో తలుపులు కొడుతున్న చప్పుడు విసుగ్గా అనిపిస్తుంటే అదే చిరాకులో వచ్చి తలుపులు తెరిచాడు. ‘అయ్యా, రామయ్య గారు శవమై ఒడ్డున తేలారు’ వింటూనే జారగిలపడ్డాడు శ్రీను.

తండ్రి చావుకి తానే కారణంగా భావించిన శ్రీను పదిహేను రోజుల తర్వాత ఒక రకమైన బాధతో తండ్రి గదిలోకి వెళ్ళాడు. తనకి జన్మనిచ్చిన బాణి పురిటినొప్పుల్లోనే కళ్ళు మూస్తే అన్నీ తానై పెంచాడు రామయ్య.  గదిలో ఏ మూల చూసినా అతని జ్ఞాపకాలే, గోడ మీద మిగిలిన నవ్వులే. తండ్రి నవ్వులను చేత్తో తడిమి మంచం పై కూర్చున్నాడు. కిటికీ నుండి వచ్చిన గాలికి బల్ల మీదున్న కాగితాలపై ఏదో రాసినట్టు అనిపిస్తే చేతిలోకి తీసుకొని చూశాడు.

‘బాబూ, సెప్పకుండా పోతున్నాను. బాధపడకు. మూడో మనిషికి తెలియకుండా నా గతం నాలోనే సమాధి చేసెయ్యాలని అనుకున్నాను. కోడలు అలా జరగనివ్వలేదు. నా గతం, నా ప్రాణం నా సీతాలు, దానికి పుట్టిన కన్నబిడ్డే కోడలు అపార్థం చేసుకున్న అమ్మాయి. రెండ్రోజుల క్రితం అనుకోకుండా షావుకారి కొట్టు దగ్గర కలిశాను. ఆ అమ్మి చేతి వేలికున్న ఉంగరం చూసి గుర్తుపట్టాను. ఆరా తీస్తే సెప్పింది తల్లి పేరు సీతాలు అని, పెళ్ళి కాకుండానే ఓ తాగుబోతు ఆవేశానికి బలై తనకి జన్మనిచ్చింది అని.

తండ్రికి సారా చుక్క ఎక్కువై ప్రాణం పోతే, తల్లికి తాగడానికి గంజి చుక్క లేక పానం వదిలేసిందని. ఎంత అన్యాయం ఆ భగవంతుడిది! నా సీతాలు నన్నడిగిన ఆఖరు కోరిక, ఆకలితో ఉన్నోడికి గుప్పెడు మెతుకులు దానమియ్యయా అని! అంత మంచి మనసున్న నా సీతమ్మని తిండికి గతిలేనిదాన్ని చేసి తన దగ్గరకి తీసుకెళ్ళిపోయాడు. సీతాలు కూతురికి ఇప్పుడెవరూ లేరు. ఆ అమ్మినలా నడిరోడ్డు మీద ఒంటరిగా వదిలేయాలని అనిపించలేదు, తండ్రినై అక్కున చేర్చుకోవాలి అనుకున్నాను.  సీతాలు గొలుసు ఆ అమ్మి మెడలో ఏశాను. కోడలి మనస్తత్వం తెలిసి లాయరుకి కబురెట్టి మిల్లుకి నిన్ను యజమానిని చేయాలని అనుకున్నాను. బాధ్యతలన్నీ నీకు అప్పగించి అమ్మికి తోడవుదామని అనుకున్నాను. కానీ కాలం నన్ను దోషిని చేసింది, తట్టుకోలేకపోయాను.

కనురెప్పల మాటున ఉప్పెన రేపేసి పోయింది నా సీతమ్మ. నా గుండెలో ఆరని దీపమైంది. ఎక్కడోచోట సుఖంగా ఉందనుకొని ఇన్నేళ్ళూ నెట్టేశాను. ఆ వెలుగుతో ముడిపడున్న నా గుండె చప్పుడు తను లేదని తెలిశాక ఉనికి వినిపించాలనుకోలేదు. ఆకాశపు ఎడారిలో ఒంటరోన్నై కొన ఊపిరితో కాలం ఈడ్చినట్టు అనిపించింది ఈ రెండు రోజలు. అందుకే నా నుండి దూరంగా పంపేశాను. ఏ గోదారి ఒడ్డున నా సీతాలు నాకన్నీ ఇచ్చిందో, అక్కడే అన్నీ వదిలేశాను నా ఊపిరితో సహ. నువ్వూ, కోడలు జగ్రత్త.. ఇక సెలవు!’ 
కాగితపు అంచున రామయ్య కన్నీటి చారికలు.

శ్రీను కళ్ళల్లో కన్నీటి ఉద్ధృతి. ఇన్నాళ్ళూ తండ్రిని అర్థంచేసుకున్నానని అనుకున్నాడు, కానీ తండ్రి మనసు తెలుసుకోలేకపోయాడు. కాసేపటికి ఓ దృఢమైన నిర్ణయం తీసుకున్నట్టు కన్నీళ్ళు తుడుచుకొని గడప దాటి బయటకు వెళ్తుంటే అడిగింది లక్ష్మి ఎక్కడికని. ‘నా అక్కని ఇంటికి తీసుకురావడానికి’ వెనక్కి చూడకుండా ముందడుగేశాడు శ్రీను. – యల్లపు పావని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement