ఒకప్పుడు ఇది మాఫియా డెన్. ఇప్పుడు థీమ్ పార్క్. దీని పేరు ‘హేసియెండా నేపోలెస్’. అంటే నేపుల్స్ ఎస్టేట్ అని అర్థం. కొలంబియన్ డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ స్థావరమిది. దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్‌లో నివాస భవనాలు, ఒక ఈతకొలను, నాలుగు చెరువులతో పాటు ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన వృక్షసముదాయం చిట్టడవిని తలపిస్తుంది.
ఇక్కడ రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఎస్కోబార్ నీటి ఏనుగుల వంటి భారీ జంతువులను ఇక్కడకు తెచ్చి పెంచుకునేవాడు. ఈ ఎస్టేట్‌లో ఒక జూ, శిల్పశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. పోలీసుల దాడిలో ఎస్కోబార్ 1993లో మరణించాడు. ఈ ఎస్టేట్ కోసం అతడి కుటుంబం దావా వేసినా, కోర్టులో ఓడిపోయింది.
దాంతో ఇది 2006లో కొలంబియా ప్రభుత్వానికి స్వాధీనమైంది. కొలంబియా ప్రభుత్వం దీనిని ఒక థీమ్‌పార్కుగా తీర్చిదిద్ది, కొత్తగా ప్రవేశద్వారాన్ని నిర్మించింది. ప్రవేశద్వారానికి పైన విమానాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. ఈ విమానంలోనే ఎస్కోబార్ మాదకద్రవ్యాలను రవాణా చేసేవాడు. దేశ దేశాల్లో తిరిగిన తర్వాత ఇదే విమానంలో నేరుగా తన ఎస్టేట్‌కు చేరుకునేవాడు.
కొలంబియా ప్రభుత్వం ఇక్కడ జురాసిక్ పార్క్ తరహాలో 2014 నాటికి పూర్తిస్థాయి ఆఫ్రికన్ థీమ్‌పార్కు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడిది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఈ థీమ్‌పార్కులో ఒక రోజు బస చేయడానికి 15 డాలర్లు (రూ.1,215) చెల్లించాల్సి ఉంటుంది. ఈ థీమ్‌పార్కులో ఎస్కోబార్ మ్యూజియం, పట్టుబడతాననే భయంతో అతడు తగులబెట్టిన కార్లు, కొకెయిన్ గోదాముల శిథిలాలు ఆనాటి మాఫియా సామ్రాజ్యానికి ఆనవాళ్లుగా నిలిచి ఉన్నాయి.
ఇవి చదవండి: అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!
Comments
Please login to add a commentAdd a comment