Jurassic Park
-
ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది?
ఒకప్పుడు ఇది మాఫియా డెన్. ఇప్పుడు థీమ్ పార్క్. దీని పేరు ‘హేసియెండా నేపోలెస్’. అంటే నేపుల్స్ ఎస్టేట్ అని అర్థం. కొలంబియన్ డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ స్థావరమిది. దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్‌లో నివాస భవనాలు, ఒక ఈతకొలను, నాలుగు చెరువులతో పాటు ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన వృక్షసముదాయం చిట్టడవిని తలపిస్తుంది. ఇక్కడ రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఎస్కోబార్ నీటి ఏనుగుల వంటి భారీ జంతువులను ఇక్కడకు తెచ్చి పెంచుకునేవాడు. ఈ ఎస్టేట్‌లో ఒక జూ, శిల్పశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. పోలీసుల దాడిలో ఎస్కోబార్ 1993లో మరణించాడు. ఈ ఎస్టేట్ కోసం అతడి కుటుంబం దావా వేసినా, కోర్టులో ఓడిపోయింది.దాంతో ఇది 2006లో కొలంబియా ప్రభుత్వానికి స్వాధీనమైంది. కొలంబియా ప్రభుత్వం దీనిని ఒక థీమ్పార్కుగా తీర్చిదిద్ది, కొత్తగా ప్రవేశద్వారాన్ని నిర్మించింది. ప్రవేశద్వారానికి పైన విమానాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. ఈ విమానంలోనే ఎస్కోబార్ మాదకద్రవ్యాలను రవాణా చేసేవాడు. దేశ దేశాల్లో తిరిగిన తర్వాత ఇదే విమానంలో నేరుగా తన ఎస్టేట్‌కు చేరుకునేవాడు.కొలంబియా ప్రభుత్వం ఇక్కడ జురాసిక్ పార్క్ తరహాలో 2014 నాటికి పూర్తిస్థాయి ఆఫ్రికన్ థీమ్‌పార్కు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడిది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఈ థీమ్‌పార్కులో ఒక రోజు బస చేయడానికి 15 డాలర్లు (రూ.1,215) చెల్లించాల్సి ఉంటుంది. ఈ థీమ్‌పార్కులో ఎస్కోబార్ మ్యూజియం, పట్టుబడతాననే భయంతో అతడు తగులబెట్టిన కార్లు, కొకెయిన్ గోదాముల శిథిలాలు ఆనాటి మాఫియా సామ్రాజ్యానికి ఆనవాళ్లుగా నిలిచి ఉన్నాయి.ఇవి చదవండి: అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!! -
సిద్దిపేటలో జురాసిక్ పార్క్
వందల ఏళ్ల కిందట అంతరించిపోయిన డైనోసార్లకు హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ వెండితెరపై రూపం ఇచ్చి ప్రాణం పోశారు. 1993లో వచ్చి న జురాసిక్ పార్క్ క్రియేట్ చేసిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఆ తరువాత కూడా ఆ చిత్రానికి కొనసాగింపుగా అనేక సినిమాలు వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రజలకు డైనోసార్లపై ఉన్న ఆసక్తిని గమనించి ఆ తర్వాత డైనోసార్ థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో పార్కులు వెలిశాయి. నూతన సాంకేతికతను ఉపయోగించి నిజంగా ప్రాణం పోసుకున్నాయా అన్నట్టుగా డైనోసార్లను తయారుచేసి ప్రదర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటైన రీతిలో ఇప్పుడు కొత్తగా డైనోపార్క్ మన తెలంగాణలోనూ అందుబాటులోకి రాబోతుంది. దానికి సిద్దిపేట వేదిక కాబోతుంది. - సాక్షి, సిద్దిపేట విదేశాల్లోని పార్కుల తరహాలో డైనోపార్క్ అంటే ఏదో ఎగ్జిబిషన్‌లా బొమ్మలు, 3డీ యానిమేషన్ స్క్రీన్లు కాదు. అమెరికా, సింగపూర్లలోని యూనివర్సల్ వరల్డ్ స్టూడియోలో ఉన్న డైనోపార్క్ల తరహాలో కోమటిచెరువు సమీపంలో పార్క్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ పార్క్ పనులు ఏడాది కిందట మొదలు కాగా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో.. డైనోసార్ పార్క్‌ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ డైనోపార్క్లో పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్‌ఫాల్స్ ఇలా మూడు వేల శతాబ్దాల కిందట భూమండలం మీద పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో వివిధ రకాల డైనోసార్లు, వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి పార్కు ఆవరణలో అటూఇటూ కలియతిరుగుతూ భీకరంగా శబ్దాలు చేస్తూ సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాకింగ్ డైనో.. ఈ డైనో థీమ్ పార్క్‌లో వాకింగ్ డైనోసార్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో చిన్నారులు కూర్చుంటే నడుచుకుంటూ వెళ్తుంది. ఒకేసారి ఆరుగురు చిన్నారులు కూర్చునే విధంగా రూపొందించారు. అలాగే లోపల గుహల్లో తిరుగుతున్న సమయంలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. డైనోసార్ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తుండగా సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది. పార్క్‌ను చూసేందుకు వస్తున్న పిల్లలను అలరించేందుకు డైనోసార్ సూట్ వేసుకుని ఇద్దరు తిరగనున్నారు. మినీ ట్రాక్.. ఓపెన్ ట్రైన్ డైనోసార్ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్‌ను నిర్మించారు. దీనిపై ఓపెన్ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుంది. ఈ ఓపెన్ ట్రైన్లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్లు మీదపడినట్టు, భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్‌ను డిజైన్ చేశారు. గుజరాత్‌ను మించేలా.. మన దేశంలో గుజరాత్‌లోని రయోలిలో డైనోసార్ గుడ్లు లభించాయి. దీంతో అక్కడ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో నిలకడగా ఉండే డైనోసార్లను ప్రదర్శనకు ఉంచారు. డైనోసార్లలో ఒక్కటి మాత్రమే అరుస్తూ.. తోక ఊపుతుంది. కానీ సిద్దిపేటలో ప్రారంభంకాబోతున్న పార్క్‌లో కదిలే డైనోసార్లు 18 ఉన్నాయి. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేశారు. ఒక రకంగా దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్ పార్క్ అని అంటున్నారు. కొత్త అనుభూతి కలిగిస్తుంది కోమటి చెరువులో మరో మణిహారంగా డైనోసార్ పార్క్ ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్క్‌ల చెంతన వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ అందుబాటులోకి రానుంది. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, మధురానుభూతిని కలిగించేలా డైనోసార్ పార్కు ఉంటుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్ ఉండబోతుంది. -
ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!
ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్‌లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం. ఎందుకీ ప్రయోగం? ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది. ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
వైరల్: అమ్మో.. మరో జురాసిక్ వరల్డ్ పార్క్..?
"Jurassic Park" గురించి చాలా మందికి తెలిసిందే. 1993 సంవత్సరం మొదట్లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరిలో ఒకింత ఆశ్చర్యం, మరింత భయాన్ని కలిగించాయి. తాజాగా ఓ పార్క్‌లో ఉడుములు(ఇగువానాస్) మందలుగా పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ‘స్ట్రాంగ్ జురాసిక్ పార్క్ వైబ్స్’ అనే క్యాప్షన్‌తో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్లో యూజర్ రాబ్ ఎన్ రోల్ పోస్ట్ చేయగా.. మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.30 లక్షల మంది వీక్షించారు. దీనిలో ఓ ఉడుముల(ఇగువానాస్) గుంపు ఎవరో తరుముతున్నట్టు పరుగెడుతుంది. ‘‘ఈ దృశ్యం1993 జురాసిక్ పార్క్ చిత్రంలో డైనోసార్లు మందలుగా పరుగెత్తడంలా.. ఉంది.’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో కథానాయకుడు అలాన్ గ్రాంట్, పిల్లలు డైనోసార్ల మందలో నుంచి బయట పడతానికి పరిగెత్తుతారు. this is giving off strong Jurassic Park vibes pic.twitter.com/qDJGfxCbsM — Rob N Roll (@thegallowboob) July 7, 2021 -
యుద్ధభూమిలో ఆంబర్ వేట!
జురాసిక్ పార్క్ సినిమా గుర్తుందా...? ఎన్నడో అంతరించిపోయిన రాక్షస బల్లులు మళ్లీ పుట్టుకొస్తాయి దీంట్లో! చెట్ల జిగురులో ఇరుక్కుపోయిన అవశేషాల నుంచి డీఎన్ఏను వేరు చేయడం.. దాన్నుంచి పూర్తిస్థాయి జంతువును సృష్టించడం చిత్రం ఇతివృత్తం! సినిమా.. అందులోని కాల్పనిక టెక్నాలజీ విషయాలన్నీ కాసేపు పక్కనపెడితే... ఆ జిగురు కథ మాత్రం ఎంతో ఆసక్తికరం.. ఇప్పుడదో లాభసాటి వ్యాపారం.. అంతేనా... కానేకాదు.. మన పొరుగుదేశం మయన్మార్‌లో బోలెడంత ఘర్షణకూ ఇదే కారణమవుతోంది! చిన్నప్పుడు మీ పుస్తకాలకు అట్టలేసుకునేందుకు జిగురు వాడారా? ఇప్పుడైతే ఫెవికాల్ లాంటివి వచ్చేశాయి గానీ.. ఓ మూడు దశాబ్దాల క్రితమైతే.. చెట్ల వెంబడి పడి.. సొంతంగా జిగురు సేకరించుకోవాల్సిందే. వేపచెట్టు జిగురు కంటే తుమ్మ బంక చాలా గట్టిదన్న నమ్మకం.. తుమ్మచెట్టు ఎక్కడుందో వెతుక్కోవడం.. కాండం, కొమ్మలపై గాట్లు పెట్టి జిగురు వచ్చేందుకు వేచి ఉండటం.. ఆపై దాన్ని మురిపెంగా సేకరించుకొచ్చి.. దాచుకుని కొంచెం కొంచెం వాడుకోవడం.. ఇదీ పాతకాలపు అనుభవాలు. పొరుగుదేశం మయన్మార్‌లో కొంతమంది ఇప్పటికీ ఇలాగే జిగురు సేకరిస్తున్నారు. కాకపోతే అది ఇప్పుడున్న చెట్లకు కాసింది కాదు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అన్ని పరిస్థితులనూ తట్టుకుని గడ్డకట్టిపోయినవి. ఇంగ్లిష్ పేరు ఆంబర్. ముదురు పసుపు రంగులో లేదంటే కొంచెం ఎరుపు రంగులో గాజు మాదిరిగా పారదర్శకంగా ఉండే ఈ ఆంబర్‌ను సేకరించడం లాభసాటి వ్యాపారమే. జిగురు మాత్రమే ఉంటే నగల్లో వాడతారు. అందులో ఏవైనా ఇతర పదార్థాలు కలసి ఉన్నా.. క్రిమి, కీటక, జంతు అవశేషాలున్నా.. ధర ఎక్కువవుతుంది. రాక్షస బల్లుల అవశేషాల్లాంటివి ఉంటే ఒక్కో ఆంబర్ ముక్క లక్ష డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలు ఖరీదు చేసినా ఆశ్చర్యం లేదు. కొత్త కేంద్రం మయన్మార్... ఆంబర్ చరిత్ర ఘనమైందే. ఒకప్పుడు చైనా పాలకులు దీన్ని నగల్లో విరివిగా వాడేవారు. గ్రీస్‌తోపాటు కొన్ని ఇతర యూరోపియన్ దేశాల్లోని కొన్ని చర్చిల్లోనూ విస్తృతస్థాయిలో దీన్ని వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే తాజాగా మయన్మార్ ప్రాంతంలో బయటపడుతున్న ఆంబర్ మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న కచిన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బయటపడుతూండటం ఒక విశేషమైతే.. ఇటీవలే అక్కడ రాక్షస బల్లి రెక్క అవశేషం పూర్తిస్థాయిలో ఉన్న ఓ ముక్క వెలుగుచూడటం ఇంకో విశేషం. సుమారు పదికోట్ల ఏళ్ల క్రితం నాటి ఆంబర్లు కచిన్కు కొంచెం దూరంలో ఉన్న మయిట్కైనా ప్రాంతంలో బయటపడుతున్నాయని.. కొన్నింటిలో క్రిమికీటకాలు పూర్తిస్థాయిలో నిక్షిప్తమై ఉండటం పురాతత్వ శాస్త్రవేత్తలను విపరీతంగా ఆకర్షిస్తోందని అంటున్నారు చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్త లిడా జింగ్. మూడేళ్ల క్రితం రాక్షస బల్లి తోకతో కూడిన ఆంబర్‌ను మయన్మార్ నుంచి చైనాకు తీసుకొచ్చింది ఈయనే. అంతర్యుద్ధంతో శాస్త్రవేత్తల అధ్యయనానికి ఇబ్బందులు కోట్ల ఏళ్లక్రితం నాటి జీవజాతుల గురించి అధ్యయనం చేసే పాలియో ఎంటాలజిస్ట్లకు ఆంబర్లోని అవశేషాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ప్రపంచం మొత్తమ్మీద వాణిజ్యస్థాయిలో ఆంబర్‌ను వెలికితీస్తున్న ఏకైక ప్రాంతం కచిన్ కావడం.. స్థానికులు కచిన్ స్వాతంత్య్రం కోసం సైన్యంతో పోరాడుతూండటం వీరికి సమస్యలు సృష్టిస్తోంది. ఆంబర్‌ను అమ్ముకుని తమ ఉద్యమానికి ఆర్థిక దన్ను సమకూర్చుకోవాలన్నది తిరుగుబాటుదారుల ఉద్దేశం. ఇది సైన్యానికి సుతరామూ ఇష్టం లేదు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్ష మందికి పైగా సామాన్యులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోగా.. ఆంబర్ గనుల పరిసరాల్లోని వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదని సైన్యం ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాలకు వెళ్లడం, ఆంబర్ గనుల్లో భూగర్భ ప్రాంతాలను పరిశీలించడం సాధ్యం కావడం లేదని పరిశోధకులు అంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని రాక్షస బల్లుల అవశేషాల కోసం అక్బర్‌ఖాన్ లాంటివారు కొందరు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి అరుదైన ఆంబర్ వేటకు మించిన థ్రిల్ ఇంకోటి లేదని అక్బర్‌ఖాన్ అంటారు. -
జురాసిక్ పార్క్ ఐదో సీక్వెల్ వస్తోంది!
సాక్షి సినిమా: హాలీవుడ్ చిత్రాల్లో భారతీయ సినీ ప్రేక్షకులను అధికంగా అలరించిన అతి కొద్ది చిత్రాల్లో జురాసిక్ పార్క్ నమోదు అవుతుందని ప్రత్కేకంగా చెప్పనవసరం లేదు. ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలు జురాసిక్‌పార్క్ సిరీస్. పార్క్ అనే నవల ఆధారంగా 1993లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ తెరపై ఆవిష్కరించిన వండర్ జురాసిక్‌పార్క్ చిత్రం. ప్రపంచ స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లా నుప్లర్ అనే ఒక కల్పన దీవిలో డైనోసర్ అనే ఒక వింత జాతికి జంతువు అరాజకాల ఇతివృత్తంగా తెరకెక్కిన ఆ చిత్రానికి ఆ తరువాత ది లాస్ట్ వరల్డ్ పేరుతో 1997లోనూ, జురాసిక్ పార్క్ 3 పేరుతో 2001లోనూ, జురాసిక్ వరల్డ్ పేరుతో2015లోనూ అదే స్టీవెన్ స్పీల్బెర్గ్ వరుసగా సీక్వెల్స్‌ను రూపొందించారు. తాజాగా జురాసిక్‌పార్క్– ఫాలెన్కింగ్డమ్ పేరుతో ఐదవ సీక్వెల్‌ను తెరకెక్కించిన చిత్రం జూన్‌న్7న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. అదే డైనోసర్ విలనిజాలను మరో కొత్త కోణంలో తెరపై దర్శకుడు ఆవిష్కరించారట. 1993 నుంచి జురాసిక్ పార్క్ సిరీస్‌లోనూ నటించిన జెఫ్ కోల్ట్ప్లమ్ ఈ జురాసిక్‌పార్క్–ఫాలెన్ కింగ్డమ్ చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. ఈ చిత్రంపై అంచనాలు భారి స్థాయిలో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం.ఆంగ్లం భాషల్లో యూనివర్శల్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. -
‘జురాసిక్ వరల్డ్ 3’ ప్లాన్ రెడీ!
స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్లో మొన్న డిసెంబర్లో ‘ది పోస్ట్’ అని ఒక సినిమా వచ్చింది గుర్తుంది కదా? ఇప్పుడు నిన్నగాక మొన్న ‘రెడీ ప్లేయర్ వన్’ అని ఇంకో సినిమా వచ్చింది. ఇవి కాకుండా ఆయన ప్రొడక్షన్లో నిరంతరం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అంత బిజీగా ఉంటాడాయన. ఇక ‘జురాసిక్ పార్క్’తో డైనోసర్ సినిమా అంటే స్పీల్బర్గ్ అనిపించుకున్న ఆయన, ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్‌కు దర్శకుడిగా కాక, నిర్మాతల్లో ఒకరుగా ఉంటూ వస్తున్నాడు. జురాసిక్ వరల్డ్ ఒకటో భాగం 2015లో వస్తే, రెండో భాగం 2018 జూన్‌లో వస్తోంది. అలాగే మూడో భాగానికి కూడా అప్పుడే ప్లాన్ రెడీ చేసేశాడు స్పీల్బర్గ్. ఆయన ఒక నిర్మాతగా నిర్మించనున్న జురాసిక్ వరల్డ్ మూడో భాగానికి కొలిన్ ట్రెవెరో దర్శకత్వం వహించనున్నాడు. జురాసిక్ వరల్డ్ మొదటి భాగానికి ఆయనే దర్శకుడు కాగా, కొన్ని అనుకోని కారణాల వల్ల రెండో భాగానికి జె.ఎ.బయోనా దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మూడో భాగానికి మళ్లీ కొలినే దర్శకుడు కావడం విశేషం. -
మనం మెచ్చిన హాలీవుడ్!
హాలీవుడ్‌కు ప్రపంచమంతా మార్కెట్ ఉన్న రోజుల్లో, ఆ సినిమాలు ఆడని ఒకే ఒక్క మార్కెట్ ఇండియా అంటారు. అలాంటి ఇండియన్ సినిమా మార్కెట్లోకీ హాలీవుడ్ చొచ్చుకొచ్చి రెండు దశాబ్దాలు దాటింది. ఈ రెండు దశాబ్దాల్లో ఇండియన్ సినిమా అభిమానికి హాలీవుడ్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ‘జురాసిక్ పార్క్’ చూసి సంబరపడిపోయాం. ‘టైటానిక్’ చూసి అద్భుతం అనేసుకున్నాం. ‘స్పైడర్‌మేన్’ అన్నాం. ‘టెర్మినేటర్’ వెంటపడ్డాం. ‘అవతార్’ ప్రపంచంలో కొట్టుకుపోయాం. ‘ఇంటర్స్టెల్లార్’ను వింతగా చూశాం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతాలు సృష్టించగల పేరున్న హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ ఆ పేరుతోనే పాపులర్ అయ్యాయి. ఆ జానర్ సినిమాలే ఇక్కడ ఫేమస్. ఇక గతేడాది హాలీవుడ్‌కు ఇండియన్ సినిమా మంచి మార్కెట్‌గా అవతరించింది. 2017లో వండర్‌వుమన్, స్పైడర్‌మేన్ లాంటి సూపర్‌హీరో సినిమాలు ఇండియాలో దుమ్మురేపాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. యాక్షన్, అడ్వెంచరస్ సినిమాలకే ఇండియాలో ఇప్పటికీ క్రేజ్ కనిపిస్తుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఇక 2017కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమా అభిమాని టేస్ట్‌కి తగ్గ భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు 2018లోనూ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఇండియాలో ఈ ఏడాది చాలా సినిమాలే దుమ్మురేపుతాయని ట్రేడ్ భావిస్తోంది. ముఖ్యంగా ‘జురాసిక్ వరల్డ్ 2’, ‘అవెంజర్స్’, ‘డెడ్‌పూల్ 2’, ‘బ్లాక్ పాంథర్’, ‘ఎక్స్ మెన్’ తదితర సినిమాలపై ట్రేడ్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ అన్నది ఇండియాలో హాలీవుడ్ సినిమాకు కామన్ అయిపోయింది. ఈ ఏడాది సరికొత్త రికార్డులు సెట్ చేసే సినిమాలు వస్తున్నాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ భారీ బడ్జెట్ సినిమాలు అందుకుంటాయా? చూడాలి! -
జురాసిక్ వరల్డ్‌కు జూన్ సెంటిమెంట్
‘జురాసిక్ పార్క్’.. ఇండియన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను కూడా హాలీవుడ్‌కు విపరీతంగా అట్రాక్ట్ అయ్యేలా చేసిన సినిమా. 1993లో స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా తర్వాతే ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు మార్కెట్ పెరిగింది. ఈ సినిమాతోనే స్పీల్బర్గ్ ఇండియన్ సినీ అభిమానికి ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ఒకడుగా చేరిపోయాడు. అలాంటి సినిమా కాబట్టే ‘జురాసిక్ పార్క్’ విడుదలై 25 సంవత్సరాలు కావొస్తున్నా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఈ సినిమాకు సీక్వెల్‌గా నాలుగు సినిమాలొచ్చినా, ఐదో సినిమా వస్తోందంటే అభిమానుల ఉత్సాహం అదే స్థాయిలో ఉంది. జురాసిక్ పార్క్(1993), జురాసిక్ పార్క్: ది లాస్ట్ వరల్డ్ (1997), జురాసిక్ పార్క్ 3 (2001), జురాసిక్ వరల్డ్ (2015) లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్డమ్ (2018) వస్తోంది. జె.ఎ.బయోనా దర్శకుడు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్కంతా ఇచ్చేస్తోంది. భారీ డైనోసర్స్తో ఫుల్ ఆన్ అడ్వెంచర్స్‌తో సినిమా సాగిపోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పట్నుంచే జురాసిక్ వరల్డ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టేశారు. ‘జురాసిక్ పార్క్’ విడుదలైన 25 ఏళ్లకు ‘జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్డమ్’ విడుదలవుతోంది. అది కూడా జురాసిక్ పార్క్ విడుదలైన జూన్‌లోనే! దీంతో జురాసిక్ పార్క్ అభిమానులకు వచ్చే ఏడాది జూన్ డబుల్ పండగ కిందే లెక్క. -
బుజ్జి బల్లి.. భలే ముద్దుగా ఉంది!
రాకాసి బల్లి ముద్దొస్తుందా? రాదు కదా! చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, బుల్లి రాకాసి బల్లి అయితే ముద్దుగా ఉంటుంది. కావాలంటే ఇక్కడున్న ఫొటోని మీరే చూడండి. మరి.. పెద్దయ్యాక ఈ బుజ్జిది మనుషులను ఏ రేంజ్లో రఫ్ఫాడేస్తుందో కానీ, ఇప్పుడు మాత్రం అమాయకంగా కనిపిస్తోంది. ‘జురాసిక్ పార్క్’ సిరీస్‌లో ఐదో చిత్రం ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్’కి సంబంధించిన ఫొటో ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఆరు సెకన్ల టీజర్‌ను రచయితల్లో ఒకరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొలిన్ ట్రెవెర్రో విడుదల చేశారు. ‘‘ఫ్రమ్ అవర్ జురాసిక్ ఫ్యామిలీ టు యు’ అని పేర్కొన్నారాయన. క్రిస్ ప్రాట్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ చిత్రానికి జె. బయోనా దర్శకుడు. 6 సెకన్ల టీజర్ చూపించారు సరే.. ఫుల్ సినిమా ఎప్పుడు చూపిస్తారు? అంటే.. వచ్చే ఏడాది జూన్ 22న. అన్నట్లు... ఫస్ట్ పార్ట్ ‘జురాసిక్ పార్క్’ 1993లో వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. గ్రాఫిక్స్‌లో డైనోసార్లను సృష్టించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ వచ్చిన నాలుగు భాగాలకన్నా ఐదో భాగం టెక్నికల్‌గా ఇంకా హై లెవెల్లో ఉంటుందనీ, ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందని హాలీవుడ్ టాక్. -
జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!
‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్‌గా దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కొలిన్ ట్రవెర్రో ఈ సీక్వెల్‌నూ తెరకెక్కిస్తారన్న వార్తలొచ్చాయి. అయితే ఆయనకు మరో హిట్ సిరీస్ ‘స్టార్ వార్స్’ సీక్వెల్‌కు డెరైక్షన్ ఛాన్స్ రావడంతో చిత్రబృందం మరో దర్శకుడి కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. చివరికి ఈ అవకాశం ‘ద ఇంపాజిబుల్’, ‘ద ఆర్ఫనేజ్’ చిత్రాలను తెరకెక్కించిన జేఎ ఆంటోనియో బయోనను వరించింది. 2018 జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
లైవ్ ఆర్కెస్ట్రాతో...జురాసిక్ పార్క్
డైనోసార్ల నేపథ్యంలో జరిగే ‘జురాసిక్ పార్క్’ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ 1993లో తీసిన ఈ చిత్రం 23 ఏళ్ళ తరువాత మళ్ళీ సరికొత్తగా జనం ముందుకు రానుంది. లైవ్ ఆర్కెస్ట్రాతో ఈ సినిమాను ప్రదర్శించ నున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడైన 83 ఏళ్ళ జాన్ విలియమ్స్ కూర్చిన ఈ చిత్ర సంగీతాన్ని ఆర్కెస్ట్రా అప్పటికప్పుడు వాయిస్తుండగా, తెరపై సినిమాను ప్రదర్శించా లని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ వినూత్న ప్రదర్శన జరపనున్నారు. అమెరికా బాక్సాఫీస్ చరిత్రలోని టాప్ 20 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో 8 చిత్రాలకు సంగీతం జాన్ విలియమ్స్‌దే. ఆయన సంగీతం అందించిన ‘హోమ్ ఎలోన్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’, ‘ఇ.టి’ చిత్రాల లాగే ఇప్పుడీ ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి కూడా ‘ఫిల్మ్ కాన్సర్ట్స్ లైవ్’ ద్వారా ఈ లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన ఘనత దక్కనుంది. జాన్ విలియమ్స్‌కు 1974 నుంచి స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌తో మంచి అనుబంధం ఉంది. స్పీల్బెర్గ్ చిత్రాల్లో అత్యధిక శాతానికి సంగీతం అందించింది ఆయనే. అయితే, జాన్ విలియమ్స్ సంగీతం కూర్చిన చిత్రాల్లో ‘జురాసిక్ పార్క్’కు విశిష్టమైన గుర్తింపుంది. డైనోసార్లను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై సృష్టించినప్పటికీ, అవి సజీవంగా నిలిచి, ఊపిరి పీల్చుకుంటున్న అనుభూతికి సంగీతమే ప్రధాన కారణమని నిపుణులు అంటారు. వచ్చే నవంబర్‌లో జరిగే ‘జురాసిక్ పార్క్ ఇన్ కాన్సర్ట్’ కార్యక్రమంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద తెరలపై పూర్తి హైడెఫినిషన్ క్వాలిటీలో ప్రదర్శించనున్నారు. ఆ పక్కనే తెర మీది దృశ్యానికి తగ్గట్లు పూర్తిస్థాయి సింఫనీ ఆర్కెస్ట్రా వాయిస్తారు. ఫలితంగా, తెర మీది చూస్తున్న దృశ్యం కళ్ళెదుట జరుగుతున్నట్లే అనిపిస్తుంది. విశేషం ఏమిటంటే, ‘జురాసిక్ పార్క్’ సంగీతకర్త జాన్ విలియమ్స్ తాజా ఆస్కార్ అవార్డుల రేసులో కూడా ఉన్నారు. ‘స్టార్ వార్స్ - ది ఫోర్స్ ఎవేకెన్స్’ చిత్రానికి అందించిన సంగీతానికి గాను ఆయనకు ఈ నామినేషన్ దక్కింది. ఇప్పటికే పలుసార్లు ఆస్కార్ అందుకున్న ఆయనకు ఈసారీ వస్తుందా అన్నది వేచి చూడాలి. -
డైనోసార్లు మనుషులను తినేస్తాయా?
వాషింగ్ఘన్: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన 'జురాసిక్ పార్క్-4' హాలివుడ్ చిత్రంపై పురాజీవ శాస్త్రవేత్తలు (నశించిపోయిన జంతువులపై ఆధ్యయనం చేసే శాస్త్రవేత్తలు) మండిపడుతున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాబోదని, జురాసిక్ కాలంనాటి డైనోసార్ల గురించి సినిమాలో చూపించిందంతా ఒట్టి బూటకమని విమర్శిస్తున్నారు. ఆకారంలో భారీగావున్నప్పటికీ సాధు జీవులైన డైనోసార్లను మనుషులను పీక్కుతినే రాక్షస జంతువులుగా చిత్రీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఇది ప్రకృతి విరుద్ధంగా జంతుజాలాన్ని కాఠిన్యంగా చూపించడమే అవుతోందని వారు వాదిస్తున్నారు. సినిమాలో చూపించినంత పెద్దగా అవి ఉండవని, 40 అడుగులకు మించిన డైనోసార్ కళేబరం తమ పరిశోధనల్లో ఎక్కడా దొరకలేదని వారు చెబుతున్నారు. ఎప్పుడు చూడని మనిషిని చూస్తే అవి గుర్తించలేవని, కదలక, మెదలక నిలబడితే ఏ మనిషినైనా గుర్తించే మెదడు నైపుణ్యంగానీ దృష్టిగానీ వాటికి లేవని అన్నారు. డైనోసార్లలో శాకాహార, మాంసాహారులనే రెండు రకాలు ఉన్నప్పటికీ....మాంసాహారులు చిన్న చిన్న జంతువులను తింటాయే తప్ప, మనుషులను వెంటాడి తినే ప్రసక్తే లేదని అంటున్నారు. సహజంగా మెతక వైఖరిని ప్రదర్శించే శాకాహార డైనోసార్లకు తోకతోని మనుషులనే కాదు, తోటి జంతువులను వేటాడే లక్షణాలు కూడా ఉండవని, డైనోసార్లలో కొన్ని రకాల డైనోసార్లకు రెక్కలు ఉన్నట్టు తమ పరిశోధనల్లో తేలినప్పటికీ వాటికి ఎగిరే శక్తినిచ్చే రెక్కలు మాత్రం లేవని వారు చెబుతున్నారు. ఏ రకం డైనోసార్కైనా తలుపులను తెరిచే జ్ఞానం మాత్రం ఉండదని, పైగా సినిమాలో చూపించినట్టుగా వాటి చర్మం గట్టిగా గరకుతేలినట్టు ఉండదని, మెత్తగా ఉంటుందని వారంటున్నారు. సినిమాలో వాస్తవ లక్షణాలకు విరుద్దంగా డైనోసార్లను చూపించడం ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోప పట్టించడమే అవుతుందని ఇప్పటివరకు 20 డైనోసార్ల కళేబరాలను కనుగొన్న పురాజీవ శాస్త్రవేత్త జేమ్స్ కిర్క్లాండ్ (సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం), టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జూలియా క్లేర్క్, రేమండ్ అల్ఫ్ మ్యూజియం ఆప్ పాలియోంటోలజిలో పనిచేస్తున్న నిపుణుడు, శాస్త్రవేత్త ఆండ్రివ్ ఫార్కే ఆరోపిస్తున్నారు. సినిమాల ద్వారా ఔత్సాహిక పరిశోధకుల్లో, విద్యార్థుల్లో డైనోసార్ల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిస్తున్నందుకు థాంక్స్ అని వారు చెప్పడం కొసమెరపు. వీరి వాదనలతో జురాసిక్ పార్క్ చిత్ర నిర్మాణం వెనుక నిలిచిన శాస్త్రవేత్త జాక్ హార్నర్ విభేదిస్తున్నారు. ఇవన్ని వారి అభిప్రాయాలేగాని, వాస్తవాలు కాదని, స్పీల్బర్గ్ దర్వకత్వంలో వెలువడిన తొలి జురాసిక్ పార్క్ సినిమా నుంచి వారు ఇలాంటి విమర్శలే చేస్తున్నారంటూ ఆయన ఎదురు దాడికి దిగారు. అయినా తాము తీసింది సైన్స్ ఫిక్షన్గానీ డాక్యుమెంటరీ కాదని చెప్పారు. పైగా డీఎన్ఏ ఆధారంగా డైనోసార్లను అభివృద్ధి చేసినట్టు చూపాం కనుక గతించిన డైనోసార్లకు, పునర్ సృష్టించిన డైనోసార్లకు ఎంతైనా తేడా ఉండవచ్చని ఆయన లాజిక్ తీశారు. -
మరింత థ్రిల్‌గా...!
1993లో ైడె నోసార్ విధ్వంసంతో మూసుకుపోయిన జురాసిక్ పార్క్ గే ట్లు మళ్లీ 2015 జూన్ 11న తెరుచుకుంటున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? 1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘జురాసిక్ పార్క్’ ఒక ప్రభంజనం. 22 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా రానున్న చిత్రం ‘జురాసిక్ వరల్డ్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేసే హక్కులను ముఖేశ్ మెహతా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘భారతదేశంలో మొత్తం 2500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. క చ్చితంగా 100 కోట్ల మార్కుని సాధిస్తుంది. ‘జురాసిక్ పార్క్’ అప్పట్లో ఓ సంచలనం. ఈ సీక్వెల్ కూడా మరింత థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
హైబ్రిడ్ రాకాసి బల్లి వచ్చేస్తోంది!
అదో రాకాసి బల్లి. దానికి ప్రత్యేకంగా తిక్క రేగాల్సిన అవసరం లేదు. ఫుల్ టైమ్ తిక్క ఆన్‌లోనే ఉంటుంది. అందుకే, కంటికి కనిపించిన మనిషిని కసకసా కొరికి తినేస్తుంది. ఇది చదువుతోంటే ‘జురాసిక్ పార్క్’ గుర్తొస్తోంది కదూ. పిల్లలూ, పెద్దలూ ఆ రాకాసి బల్లిని కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూశారు. ఇప్పుడు అంతకు రెట్టింపు రాకాసి రాబోతోంది. ఇది హైబ్రిడ్ డైనోసార్. ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి నాలుగో భాగంగా రూపొందిన ‘జురాసిక్ వరల్డ్’లో ఈ హైబ్రిడ్ రాకాసి బల్లి చేసే విధ్వంసం చూడ్డానికి రెండు కళ్లూ చాలవట. మునుపటి భాగాల్లో కన్నా ఇందులోని బల్లి వెన్నులో వణుకు పుట్టించేలా ఉండాలని చిత్రబృందం అనుకున్నారట. దాంతో 50 అడుగుల పొడవు, 18 అడుగుల ఎత్తు ఉన్న రాకాసి బల్లిని తయారు చేశారు. జురాసిక్ వరల్డ్ పార్క్‌లోకి సందర్శకుల ప్రవేశం తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ నిర్మాతగా, కొలిన్ ట్రెవ్రో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ జూన్ 12న. -
'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'
లాంస్ ఎంజిల్స్: వికృత రూపంలో ఉండే ఓ భయంకరమైన భారీ ఆకారాన్ని ఊహించుకోండని చెప్తేనే అస్సలు ఇష్టపడం.. కష్టం కూడా.. అలాంటిది నిజంగానే అలాంటి జంతువు వుండి.. దాని ఎదురుగా నిల్చోవలసి వస్తే.. అది కూడా దాని శ్వాస నిట్టూర్పులు తగిలేంత దగ్గరిగా.. రెండు చేతులు పట్టినా సరిపోనంత పెద్ద కోరలతో ఆ జంతువుంటే.. అమ్మో ఒళ్లు జలదరించి పోతుందికదా.. ఇదే కాదు ఇలాంటి ఎన్నో అనుభవాలు అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. మీకే కాదు ఆ సమయంలో మీతో పాటు కూర్చున్న అందరికీ కూడా. ఇంతకీ ఏంటనీ అనుకుంటున్నారా.. జురాసిక్ చిత్రాలు మీరు చూసే ఉంటారుగా.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆ చిత్రాలకు సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. గతంలో వచ్చిన చిత్రాలకంటే మరింత గొప్పగా తీర్చి దిద్ది 'జురాసిక్ వరల్డ్' అనే పేరుతో దర్శకుడు కోలిన్ ట్రెవర్రో గాడ్జిల్లాలతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనున్న ఈ చిత్రానికి చెందిన కొన్ని పోస్టర్లు ఆయన ఆన్లైన్లో విడుదల చేశారు. ఆ పోస్టర్లలో ఈ చిత్రంలోని హీరోయిన్ బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ఓ అద్దాల భవంతిలో నిల్చుని ఉండగా.. అద్దం వెలుపల సరిగ్గా ముఖానికి దగ్గర ఓ పెద్ద గాడ్జిల్లా ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కనిపిస్తుంది. ఇలాంటి పోస్టర్లు ఇంకెన్నో ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
2015లో ‘జురాసిక్ వరల్డ్’
ఎప్పటికీ మనసుల్లో నిలిచిపోయే సినిమాల్లో ‘జురాసిక్ పార్క్’ ఒకటి. ఈ చిత్రంలో రాక్షస బల్లులు చేసిన విన్యాసాలను పిల్లలూ పెద్దలూ ఆసక్తికరంగా తిలకించారు. ఆ తర్వాత రెండో, మూడవ సీక్వెల్స్ కూడా వచ్చాయి. మరోసారి ఈ డైనోసార్లు తెరపైకి రానున్నాయి. ‘జురాసిక్ పార్క్’ నాలుగో సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయి. ఒలిన్ ట్రెవొర్రో దర్శకత్వంలో స్టీఫెన్ స్పీల్బర్గ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘జూరాసిక్ వరల్డ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 2015 జూన్, 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘జురాసిక్’ తొలి భాగం విడుదలై దాదాపు ఇరవయ్యేళ్లయ్యింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్ సాంకేతికంగా ఇంకా బాగుంటాయి. నాలుగో భాగం మరింత ఉన్నతంగా ఉంటుందట. అత్యున్నత సాంకేతిక హంగులతో మరింత థ్రిల్‌కు గురి చేసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ‘జురాసిక్ వరల్డ్’ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే పట్టుదలతో కొలిన్, స్టీఫెన్ తదితర యూనిట్ సభ్యులు వర్క్ చేస్తున్నారని హాలీవుడ్ టాక్.