ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్‌లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్‌లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్‌ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్‌లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్‌లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్‌ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్‌ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్‌ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం.
ఎందుకీ ప్రయోగం?
ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది.
ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment