సాక్షి, అమరావతి: ఏనుగులు, పులులు వంటి జంతువులు జనావాసాలు, పొలాల వద్దకు వచ్చి బీభత్సం సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జంతువులను అడవికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఒడిశా, తమిళనాడు అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన అటవీ శాఖాధికారుల సదస్సులో విస్తృతంగా చర్చించారు.
ఎనిమిదేళ్లలో 38 మంది మృత్యువాత
ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల రెండు పులులు దారి తప్పి తూర్పుగోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి, పొలాల్లోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు మధ్య సంఘర్షణలో 2014 నుంచి ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలపై 15,198 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలు, పంట, ఇతర నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా పరిహారం చెల్లించింది.
పటిష్ట భద్రత ఏర్పాట్లు.. అవగాహన కార్యక్రమాలు..
ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులు ఎక్కువగా ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఏనుగులు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వడం (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్‌లు), ఆర్‌సీసీ పిల్లర్లతో స్ట్రీమ్ బారికేడ్లు, రోడ్లపైకి వచ్చే మార్గాల్లో గేట్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో 24గంటలు తిరుగుతూ వాటిని గ్రామాల్లోకి రాకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, ఎలిఫెంట్ ట్రాకర్లను నియమించనున్నారు.
అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మిరపకాయ పొగ వేయడం, ఆముదం స్ప్రే చేయడం, తేనెటీగల సౌండ్ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవి వైపు మళ్లించే అంశాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏనుగులు బయటకు రాకుండా అడవుల్లోనే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో సమన్వయం పెంచుకుని ఏనుగుల కదలికలపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రణాళిక రూపొందించారు.
పులులను ట్రాప్ చేసేలా...
తమ ఆవాసాల్లోకి వేరే పులులు రావడంతో అక్కడక్కడా పులులు దారి తప్పి అడవి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా బయటకొచ్చిన పులులు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి ఆవులు, మేకలు వంటి జంతువులను చంపుతున్నాయి. ఇలాంటి ఘటనల నివారణ కోసం వాటిని ట్రాప్ చేసే కేజ్‌లు సమకూర్చుకోవడంతోపాటు కెమెరాల ట్రాప్‌లను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. అవి అడవి దాటి రాకుండా చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment