గత ఐదేళ్లలో దేశంలో 2,657 మంది మృత్యువాత
అత్యధికంగా ఒడిశాలో 542 మంది బలి
మానవులు–వన్యప్రాణుల సంఘర్షణల తగ్గింపునకు చర్యలు
కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో గత ఐదేళ్లుగా ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఏనుగులు దాడి కారణంగా ఏకంగా 2,657 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఐదేళ్లలో అంటే 2018–19 నుంచి 2022–23 వరకు దేశంలో అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో ఏనుగు దాడి కారణంగా 542 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత జార్ఖండ్‌లో 474 మంది మృత్యువాత పడ్డారు.
మానవులు– ఏనుగుల సంఘర్షణ ఫలితంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని, ఈ సంఘర్షణను తగ్గించే ప్రయత్నంలో భాగంగా దేశంలోని ఏనుగులు, వాటి అవాసాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకం ప్రాజెక్టు ఎలిఫెంట్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
24 గంటల్లో పరిహారం
మానవులు–ఏనుగుల మధ్య సంఘర్షణ నివారణకు ఇప్పటివరకు 14 రాష్ట్రాల్లో 33 ఎలిఫెంట్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏనుగుల కదలికల పర్యవేక్షణకు స్థానిక సంఘాలతో జంతు ట్రాకర్‌లను ఏర్పాటు చేయడంతో పాటు మానవులకు నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఏనుగులపై ప్రతీకార హత్యల నివారణకు గాను ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి 24 గంటల్లో పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాల పాలైతే రెండు లక్షలు, చిన్న గాయాల చికిత్సలకు 25 వేలు చెల్లిస్తున్నట్లు వివరించింది.
మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్‌లను గుర్తించడంతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా çసూచించినట్లు వెల్లడించింది. అడవి జంతువులకు రుచించని పంటలు వేయాల్సిందిగా సూచనలిచి్చంది. çపొలాల్లో ఏనుగులు, వణ్యప్రాణులు ప్రవేశించకుండా ముళ్ల కంచె, బయో ఫెన్సింగ్, భౌతిక అడ్డంకులను ఏర్పాటు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment