డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. జంతువులేంటి.. వాటికి సంపదేంటి అనుకుంటున్నారా! అవేమీ కంపెనీలు పెట్టి ధనం కూడబెట్టలేదండీ! వాటి యజమానులు ప్రేమతో ఇచ్చిన సంపదతో ఈ పెంపుడు జంతువులకు డబ్బు చేసింది. అయితే వీటిలో కొన్ని స్వయంకృషి జంతువులు కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లో, టీవీల్లో నటించడం ద్వారా ఇవి బోలెడు సంపద ఆర్జించాయన్నమాట! ఇలా ఈ జాబితాలో చేరిన జంతువుల ఆస్తుల వివరాల్లో కొన్ని అతిశయోక్తులున్నాయని తర్వాత తెలిసింది. ప్రస్తుతం
► జిగో అనే కోడి పెట్టను టెక్ట్స్ బుక్ రచయిత మైల్స్ బ్లాక్‌వెల్ పెంచుకున్నారు. తన తదనంతరం సదరు పెట్టగారికి బ్లాక్వెల్ 1.5 కోట్ల డాలర్లు రాసిచ్చారు.
► ఇటలీకి చెందిన రియల్టీ వ్యాపారి మారియా అసుంటా బజార్లో ఒక పిల్లిని చూసి జాలిపడి తెచ్చుకొని టొమసో అని పేరు పెట్టి పెంచుకున్నారు. 94ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె విల్లు ప్రకారం టొమసోకు 1.3 కోట్ల డాలర్ల ఆస్తి దక్కింది.
► 2018 వరకు బ్లాకీ అనే పిల్లి 1.25 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్న పిల్లిగా పేరుగాంచింది.
► గైల్ పోస్నర్ అనే ఆమె తన పెంపుడు కుక్క కొంచిటాకు 30 లక్షల డాలర్ల ధనంతో పాటు దా దాపు 80 లక్షల విలువైన భవంతిని ఇచ్చేసింది.
► లియోనా హెల్మ్‌స్లే అనే ఆమె తన మనవళ్లపై కోపంతో తనకున్న 1.2 కోట్ల డాలర్లను ట్రబుల్ అనే కుక్కకు రాసింది. అయితే తర్వాత కోర్టులో జడ్జిగారు కుక్కకు 20 లక్షలు చాలని తీర్పిచ్చారు.
► అగ్ని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తమను రక్షించిందన్న కృతజ్ఞతతో ఫ్లాసీ అనే పెంపుడు కుక్కకు డ్రీ బారీమోర్ దంపతులు 13లక్షల డాలర్ల ఇంటిని ముద్దుగా ఇచ్చేసింది.
► టింకర్ అనే పిల్లికి దాని యజమాని ద్వారా దాదాపు 8లక్షల డాలర్ల ఇల్లు, 2.26 లక్షల డాలర్ల సంపద ముట్టాయి.
► ఫాషన్ మేనేజర్ కార్ల్ పెంచుకునే చుపెట్టే అనే పిల్లికి 20 కోట్ల డాలర్ల ఆస్తి దక్కినట్లు వార్తలు వచ్చాయి, కానీ నిర్ధారణ జరగలేదు.
► ఇక పిల్లుల్లో మహారాజా పిల్లి అంటే గ్రుంపీ క్యాట్‌నే చెప్పుకోవాలి. అనేక షోలు, సినిమాల్లో నటించి ఈ పిల్లి దాదాపు 10 కోట్ల డాలర్లు సంపాదించింది.
► ఒలివియా బెన్సన్ అనే పిల్లి సుమారు 9.7 కోట్ల డాలర్లను వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదించింది.
► గుంతర్6 అనే కుక్కకు కోట్ల డాలర్ల ఆస్తి దక్కిందని అనేక వార్తలు వచ్చినా అదంతా ప్రాంక్ అని తర్వాత తెలిసింది. డబ్బున్నవారు ఏక్షణం ఏం చేస్తారో తెలియదు కాబట్టి, ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది.
చట్టబద్దత ఉందా?
జంతువులు న్యాయ పరిభాషలో లీగల్ పర్సన్స్ కావు కనుక వీటి పేరుమీద సొంత ఆస్తులు, ధనం ఉండదు. పెంపుడు జంతువంటేనే ఒక ఆస్తి, అందువల్ల మరో ఆస్తిని ఈ ఆస్తికి కట్టబెట్టేందుకు చట్టాలు అంగీకరించవు. అందుకే ఆయా జంతువుల యజమానులు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఈ జంతువుల ఆస్తుల నిర్వహణ చేస్తుంటాయి. ఈ సొమ్మును కేవలం సదరు జీవి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిఉంటుంది. సదరు జంతువు మరణిస్తే ట్రస్టు నిబంధనల ప్రకారం మిగిలిన సొత్తును వినియోగిస్తారు.
– నేషనల్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment