వాషింగ్ఘన్: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన 'జురాసిక్ పార్క్-4' హాలివుడ్ చిత్రంపై పురాజీవ శాస్త్రవేత్తలు (నశించిపోయిన జంతువులపై ఆధ్యయనం చేసే శాస్త్రవేత్తలు) మండిపడుతున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాబోదని, జురాసిక్ కాలంనాటి డైనోసార్ల గురించి సినిమాలో చూపించిందంతా ఒట్టి బూటకమని విమర్శిస్తున్నారు. ఆకారంలో భారీగావున్నప్పటికీ సాధు జీవులైన డైనోసార్లను మనుషులను పీక్కుతినే రాక్షస జంతువులుగా చిత్రీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఇది ప్రకృతి విరుద్ధంగా జంతుజాలాన్ని కాఠిన్యంగా చూపించడమే అవుతోందని వారు వాదిస్తున్నారు.
సినిమాలో చూపించినంత పెద్దగా అవి ఉండవని, 40 అడుగులకు మించిన డైనోసార్ కళేబరం తమ పరిశోధనల్లో ఎక్కడా దొరకలేదని వారు చెబుతున్నారు. ఎప్పుడు చూడని మనిషిని చూస్తే అవి గుర్తించలేవని, కదలక, మెదలక నిలబడితే ఏ మనిషినైనా గుర్తించే మెదడు నైపుణ్యంగానీ దృష్టిగానీ వాటికి లేవని అన్నారు. డైనోసార్లలో శాకాహార, మాంసాహారులనే రెండు రకాలు ఉన్నప్పటికీ....మాంసాహారులు చిన్న చిన్న జంతువులను తింటాయే తప్ప, మనుషులను వెంటాడి తినే ప్రసక్తే లేదని అంటున్నారు. సహజంగా మెతక వైఖరిని ప్రదర్శించే శాకాహార డైనోసార్లకు తోకతోని మనుషులనే కాదు, తోటి జంతువులను వేటాడే లక్షణాలు కూడా ఉండవని, డైనోసార్లలో కొన్ని రకాల డైనోసార్లకు రెక్కలు ఉన్నట్టు తమ పరిశోధనల్లో తేలినప్పటికీ వాటికి ఎగిరే శక్తినిచ్చే రెక్కలు మాత్రం లేవని వారు చెబుతున్నారు.
ఏ రకం డైనోసార్‌కైనా తలుపులను తెరిచే జ్ఞానం మాత్రం ఉండదని, పైగా సినిమాలో చూపించినట్టుగా వాటి చర్మం గట్టిగా గరకుతేలినట్టు ఉండదని, మెత్తగా ఉంటుందని వారంటున్నారు. సినిమాలో వాస్తవ లక్షణాలకు విరుద్దంగా డైనోసార్లను చూపించడం ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోప పట్టించడమే అవుతుందని ఇప్పటివరకు 20 డైనోసార్ల కళేబరాలను కనుగొన్న పురాజీవ శాస్త్రవేత్త జేమ్స్ కిర్క్‌లాండ్ (సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం), టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జూలియా క్లేర్క్, రేమండ్ అల్ఫ్ మ్యూజియం ఆప్ పాలియోంటోలజిలో పనిచేస్తున్న నిపుణుడు, శాస్త్రవేత్త ఆండ్రివ్ ఫార్కే ఆరోపిస్తున్నారు. సినిమాల ద్వారా ఔత్సాహిక పరిశోధకుల్లో, విద్యార్థుల్లో డైనోసార్ల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిస్తున్నందుకు థాంక్స్ అని వారు చెప్పడం కొసమెరపు.
వీరి వాదనలతో జురాసిక్ పార్క్ చిత్ర నిర్మాణం వెనుక నిలిచిన శాస్త్రవేత్త జాక్ హార్నర్ విభేదిస్తున్నారు. ఇవన్ని వారి అభిప్రాయాలేగాని, వాస్తవాలు కాదని, స్పీల్‌బర్గ్ దర్వకత్వంలో వెలువడిన తొలి జురాసిక్ పార్క్ సినిమా నుంచి వారు ఇలాంటి విమర్శలే చేస్తున్నారంటూ ఆయన ఎదురు దాడికి దిగారు. అయినా తాము తీసింది సైన్స్ ఫిక్షన్‌గానీ డాక్యుమెంటరీ కాదని చెప్పారు. పైగా డీఎన్‌ఏ ఆధారంగా డైనోసార్లను అభివృద్ధి చేసినట్టు చూపాం కనుక గతించిన డైనోసార్లకు, పునర్ సృష్టించిన డైనోసార్లకు ఎంతైనా తేడా ఉండవచ్చని ఆయన లాజిక్ తీశారు.
డైనోసార్లు మనుషులను తినేస్తాయా?
Published Sat, Jun 13 2015 2:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement