కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి.. కోట్ల ఏళ్లనాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ డేంజరే. ఒకదాని ఆనవాళ్లను ఇప్పుడే కొత్తగా కనుగొనగా.. మరోటి ఎప్పట్నుంచో మన మధ్యే ఉన్నా దానికి సంబంధించిన కొత్త సంగతులు ఇప్పుడే బయటపడ్డాయి. ఇందులో ఒకటి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అనే రాక్షసబల్లికాగా.. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే పక్షి. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?
రెండు కొత్త డైనోసార్లు
ఖడ్గమృగం లాంటి కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు.. ఓ భయంకరమైన కొత్త డైనోసార్ రూపమిది. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఇంగ్లండ్ పరిధిలోని ‘ఐసిల్ ఆఫ్ వెయిట్’ ద్వీపంలో దీని శిలాజాలను గుర్తించారు. దానికి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అని పేరుపెట్టారు. దీనికితోడుగా కనిపెట్టిన మరో కొత్త డైనోసార్‌కు ‘రిపరోవెనటార్ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. 12.5 కోట్ల ఏళ్ల కింద ఇవి తిరుగాయని.. వీటిలో సెరాటోసుచోప్స్ భయంకరమైనదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ బార్కర్ తెలిపారు. వీటి పొడవు 29 అడుగుల వరకు ఉంటుందని, అందులో తల పొడవే 3 అడుగుల (మీటర్) వరకు ఉంటుందని వివరించారు. హెరోన్‌గా పిలిచే ఓ కొంగ వంటి పక్షి తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడి ఉంటాయని తెలిపారు.
ఈ ‘ఐసిల్’లో ఎన్నో వింతలు
ఇంగ్లండ్ పరిధిలోని ఐసిల్ ఆఫ్ వెయిట్ ద్వీపం ఎన్నో పురాతన శిలాజాలకు, వింతలకు నిలయం. ఇక్కడ కోట్ల ఏళ్లనాటి శిలాజాలను ఎన్నింటినో గుర్తించారు. మనం చెరువుల్లో, నదుల్లో నత్తలను చూస్తుం టాం. వాటి పరిమాణం మహా అయితే నాలుగైదు అంగుళాల వరకు ఉంటుంది. కానీ ఐసిల్ ద్వీపంలో కోట్ల ఏళ్లనాటి భారీ అమ్మోనైట్ (నత్త గుల్ల వంటి జీవి) శిలాజాన్ని 2020లో గుర్తించారు. 20 అంగుళాలు ఉన్న ఈ శిలాజం 95 కిలోలకుపైగా బరువు ఉండటం గమనార్హం.
ఈ ద్వీపంలో నీయోవెనటర్, టెరోసార్ వంటి డైనోసార్లు, సూపర్‌టెరోసార్‌గా పిలిచే భారీ డైనోసార్ పక్షి, కాకి అంత పరిమాణంలో ఉండే మరో చిన్న డైనోసార్ పక్షి, కోట్ల ఏళ్ల నాటి మొసళ్లు, ఇతర జీవుల శిలాజాలను ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు.
డైనోసార్లను మరిపించేలా..
డైనోసార్లకు ఉండేలా తలపై పెద్ద ముట్టె.. పొడవైన ముక్కు.. రెండు కాళ్లకు కత్తుల్లాంటి పొడవాటి పదునైన గోళ్లు.. చూడగానే కాస్త డైనోసార్ల పోలికలు.. ‘కాస్సోవరీ’గా పిలిచే ఈ పక్షిని అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులు మొదట్లో పెంచుకున్నది కోళ్లు, బాతులను కాదు.. ఈ ‘కాస్సోవరీ’ పక్షులనేనట. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.
ఆది మానవుల నివాస ప్రాంతాలపై అధ్యయనం చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకు కొన్ని రకాల గుడ్ల పెంకులు, పక్షుల ఎముకలు లభించాయి. వాటిపై లేజర్ మైక్రోస్కొపీ, ఇతర పద్ధతుల్లో అధ్యయనం చేసి.. కాస్సోవరీ పక్షులకు చెందినవిగా గుర్తించారు. కొన్ని గుడ్లను కాల్చుకుని తిన్నట్టుగా, మరికొన్ని పొదిగి పిల్లలు బయటికి వచి్చనట్టుగా తేల్చారు. సుమారు 18 వేల ఏళ్ల కింద ఆది మానవులు వీటిని మాంసం, ఈకలు, గుడ్ల కోసం పెంచుకుని ఉంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ తెలిపారు.
గోళ్లతో చీల్చేస్తుంది..!
ఏకంగా ఆరు అడుగుల ఎత్తు, 59 కిలోల బరువు వరకు పెరిగే ఈ కాస్సోవరీ పక్షులు ప్రస్తుతం భూమ్మీద ఆస్ట్రిచ్‌ల తర్వాత అతిపెద్ద పక్షిజాతిగా చెప్పవచ్చని డగ్లస్ పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన పక్షి అని.. ఇతర పక్షులు, జంతువులతోపాటు మనుషులను కూడా గోళ్లతో చీల్చేసే సామర్థ్యం వీటికి ఉంటుందని తెలిపారు. ఆ్రస్టేలియాలోని న్యూగినియాలో స్థానికులు ఇప్పటికీ ఈ కాస్సోవరీ పక్షుల మాంసం తినడం గమనార్హం.
యజమానిని చంపేసింది
2019లో అమెరికాలోని ఫ్లారిడాలో ఒక కాస్సోవరీ పక్షి.. తనను పెంచుకుంటున్న మార్విన్ హజోస్ అనే వ్యక్తిని గోళ్లతో చీల్చి చంపేసింది. విషయం ఏమిటంటే ఆయన ఓ పర్యావరణ ప్రేమికుడు. ఈ పక్షి ఒక్కదాన్నే కాదు.. ఇలాంటి చిత్రమైన మరో వంద రకాల పక్షులు, జంతువులను తన ఎస్టేట్‌లో పెంచేవాడు. ఆయన చనిపోయాక వాటన్నింటినీ వేలం వేశారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment