paleontologists
-
శిలాజాల అన్వేషి
నిన్న మొన్నటి చరిత్ర అంటేనే ఈ కాలపు యువతకు ఆసక్తి లేదు. కాని వేలయేళ్ల ప్రకృతి రహస్యాలను నిక్షిప్తం చేసుకుని ఉండే శిలాజాల అన్వేషణకు ఎవరైనా పూనుకుంటారా? చెన్నైకి చెందిన అశ్వథ బిజు 9 ఏళ్ల వయసు నుంచే ‘పాలియోంటాలజిస్ట్’గా మారింది. అందుకే ఇటీవల ప్రధానమంత్రి బాలపురస్కార్ని అందుకుంది. 14 ఏళ్ల అశ్వథకు ఈ పని పట్ల ఎందుకు ఆసక్తి? ఆమె తెలుసుకున్నది ఏమిటి? ‘పాలియోంటాలజిస్ట్’ అనే మాట మనకు ఏ స్పీల్బర్గ్ తీసే హాలీవుడ్ సినిమాలోనో వినిపించవచ్చు. కాని చెన్నైకి చెందిన 14 ఏళ్ల అశ్వథ తన విశిష్ట కృషితో ఇవాళ వేలమంది విద్యార్థులకు ఆ మాటను తెలియ చేసింది. పాలియోంటాలజిస్ట్ అంటే శిలాజాల పరిశోధకుడు అని అర్థం. పాలియోంటాలజీ అంటే శిలాజాల అధ్యయన శాస్త్రం. శిలాజం అంటే? భూఆవరణంలో లక్షల ఏళ్లుగా ఎన్నో జీవులు, జీవరాశులు పుట్టాయి. గిట్టాయి. కాని కొన్ని మరణించి తమ జీవ అవశేషాన్ని భూపొరలతో కలుపుకొని వాతావరణ పీడనం వల్ల రాయిలా మారతాయి. అంటే ఆ రాతి లో జీవచిహ్నం అలాగే ఉండిపోతుందన్న మాట. ఇలాంటి రాళ్లనే శిలాజం (ఫాజిల్) అంటారు. ఆ శిలాజాన్ని పరిశీలించినప్పుడు అది ఏ జీవిది ఏ కాలానికి ఆ కాలంలో ఆ జీవి ఉనికి ఎలా ఉండేది అని తెలుసుకోవచ్చు. జంతు శిలాజాలు, వృక్ష శిలాజాలు ఎన్నో భూమిపై జీవుల ఉనికి ఏ విధంగా ఉండేదో తెలియ చేస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఉండి ఆ తర్వాత అంతరించిపోయిన డైనోసార్లు, డోడో పక్షుల వంటివి ఈ శిలాజాల అన్వేషణ వల్లే వాటి పూర్వ రూపం గుర్తించడానికి వీలయ్యాయి. ఇరవై లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ శిలాజాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. చెన్నై అమ్మాయి అశ్వథ చెన్నైలో పుట్టి పెరుగుతున్న అశ్వథను తల్లిదండ్రులు చిన్నప్పుడు బీచ్‌కు తీసుకెళితే ఉత్సాహంగా గవ్వలు ఏరేది. ఐదేళ్లప్పుడు తండ్రి ఎన్‌సైక్లోపిడియాను బహూకరిస్తే ఆ పుస్తకంలో మొదటిసారి శిలాజాల గురించి తెలుసుకుంది. సముద్ర గవ్వల్లో కూడా కొన్ని శిలాజాలుగా మారి ఉంటాయని తెలుసుకున్నాక ఆమెకు శిలాజాల గురించి తెలుసుకోవాలనిపించింది. అశ్వథ ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తల్లి చిన్నారి అశ్వథను ఎగ్మూర్‌లోని గవర్నమెంట్ మ్యూజియంకు తీసుకెళ్లింది. ‘అక్కడ నేను మొదటిసారి అమ్మొనైట్ ఫాజిల్‌ను చూశాను. చేతితో తాకాను. థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాంటివి అన్వేషించి సేకరించవచ్చు అని తెలుసుకున్నాను. నాకూ సేకరించాలనిపించింది’ అంటుంది అశ్వథ. చెన్నైలోని ఒక టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న అశ్వథ ఇప్పటికి 136 శిలాజాలను సేకరించింది. ఆ విధంగా భారతదేశంలో చిన్న వయసు పాలియోంటాలజిస్ట్గా గుర్తింపు పొందింది. అందుకే భారత ప్రభుత్వం అశ్వథ కృషికి మెచ్చి మొన్న ‘ప్రధానమంత్రి బాలపురస్కార్’ను బహూకరించింది. విశేష ప్రచారం అశ్వథకు పదేళ్లు ఉన్నప్పుడు పెరియార్ యూనివర్సిటీలో పని చేస్తున్న జియోలజీ ప్రొఫెసర్ ఎం.యు.రాంకుమార్‌ను కలిసింది. ఆయన శిలాజాల గురించి ఆ అమ్మాయికి ఉన్న ఆసక్తి గమనించి మార్గనిర్దేశనం చేశాడు. ఆ తర్వాతి నాలుగేళ్లలో అశ్వథ తమిళనాడులోని అరియలూరు, గుండు పెరుంబేడు లలో, మహారాష్ట్రలోని శిరోంచాలో శిలాజాల అన్వేషణ సాగించింది. స్కూలు సెలవుల్లో తల్లిదండ్రుల సహాయంతో అశ్వథ ఈ పని చేయగలిగింది. విశేషం ఏమిటంటే ఆమెకు డైనోసార్ల ఎముకలు కూడా దొరికాయి. ‘కాని శిలాజాల అధ్యయనం పట్ల మన స్కూళ్లలో ఎలాంటి పాఠాలు లేవు. అవగాహన లేదు. అందుకే నేను చెన్నైలోని అనేక స్కూళ్లను కలిసి అక్కడ శిలాజాల గురించి చెప్పడం మొదలెట్టాను. కొద్ది రోజుల్లోనే నాకు గుర్తింపు వచ్చి అన్ని స్కూళ్లు పిలవడం మొదలెట్టాయి. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా విద్యార్థుల కోసం వెబినార్లు నిర్వహిస్తున్నాను. పాలియోంటాలజీ ఇప్పుడు యూనివర్సిటీలలో అడిషినల్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఉంది. నేను పెద్దయ్యే సమయానికి అది మెయిన్ కోర్సు అవుతుందని ఆశిస్తున్నాను. నేను పెద్దయ్యి మాలిక్యులర్ పాలియోంటాలజిస్ట్ అవుదామనుకుంటున్నాను’ అంటుంది అశ్వథ. అశ్వథ కృషి కొనసాగాలని కోరుకుందాం. శిలాజాల అధ్యయనం పట్ల మన స్కూళ్లలో ఎలాంటి పాఠాలు లేవు. అవగాహన లేదు. యూనివర్సిటీలలో కూడా అడిషినల్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఉంది. నేను పెద్దయ్యే సమయానికి అది మెయిన్ కోర్సు అవుతుందని ఆశిస్తున్నాను. నేను పెద్దయ్యి మాలిక్యులర్ పాలియోంటాలజిస్ట్ అవుదామనుకుంటున్నాను. – అశ్వథ బిజు -
మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా?
కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి.. కోట్ల ఏళ్లనాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ డేంజరే. ఒకదాని ఆనవాళ్లను ఇప్పుడే కొత్తగా కనుగొనగా.. మరోటి ఎప్పట్నుంచో మన మధ్యే ఉన్నా దానికి సంబంధించిన కొత్త సంగతులు ఇప్పుడే బయటపడ్డాయి. ఇందులో ఒకటి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అనే రాక్షసబల్లికాగా.. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే పక్షి. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? రెండు కొత్త డైనోసార్లు ఖడ్గమృగం లాంటి కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు.. ఓ భయంకరమైన కొత్త డైనోసార్ రూపమిది. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఇంగ్లండ్ పరిధిలోని ‘ఐసిల్ ఆఫ్ వెయిట్’ ద్వీపంలో దీని శిలాజాలను గుర్తించారు. దానికి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అని పేరుపెట్టారు. దీనికితోడుగా కనిపెట్టిన మరో కొత్త డైనోసార్‌కు ‘రిపరోవెనటార్ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. 12.5 కోట్ల ఏళ్ల కింద ఇవి తిరుగాయని.. వీటిలో సెరాటోసుచోప్స్ భయంకరమైనదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ బార్కర్ తెలిపారు. వీటి పొడవు 29 అడుగుల వరకు ఉంటుందని, అందులో తల పొడవే 3 అడుగుల (మీటర్) వరకు ఉంటుందని వివరించారు. హెరోన్గా పిలిచే ఓ కొంగ వంటి పక్షి తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడి ఉంటాయని తెలిపారు. ఈ ‘ఐసిల్’లో ఎన్నో వింతలు ఇంగ్లండ్ పరిధిలోని ఐసిల్ ఆఫ్ వెయిట్ ద్వీపం ఎన్నో పురాతన శిలాజాలకు, వింతలకు నిలయం. ఇక్కడ కోట్ల ఏళ్లనాటి శిలాజాలను ఎన్నింటినో గుర్తించారు. మనం చెరువుల్లో, నదుల్లో నత్తలను చూస్తుం టాం. వాటి పరిమాణం మహా అయితే నాలుగైదు అంగుళాల వరకు ఉంటుంది. కానీ ఐసిల్ ద్వీపంలో కోట్ల ఏళ్లనాటి భారీ అమ్మోనైట్ (నత్త గుల్ల వంటి జీవి) శిలాజాన్ని 2020లో గుర్తించారు. 20 అంగుళాలు ఉన్న ఈ శిలాజం 95 కిలోలకుపైగా బరువు ఉండటం గమనార్హం. ఈ ద్వీపంలో నీయోవెనటర్, టెరోసార్ వంటి డైనోసార్లు, సూపర్టెరోసార్గా పిలిచే భారీ డైనోసార్ పక్షి, కాకి అంత పరిమాణంలో ఉండే మరో చిన్న డైనోసార్ పక్షి, కోట్ల ఏళ్ల నాటి మొసళ్లు, ఇతర జీవుల శిలాజాలను ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. డైనోసార్లను మరిపించేలా.. డైనోసార్లకు ఉండేలా తలపై పెద్ద ముట్టె.. పొడవైన ముక్కు.. రెండు కాళ్లకు కత్తుల్లాంటి పొడవాటి పదునైన గోళ్లు.. చూడగానే కాస్త డైనోసార్ల పోలికలు.. ‘కాస్సోవరీ’గా పిలిచే ఈ పక్షిని అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులు మొదట్లో పెంచుకున్నది కోళ్లు, బాతులను కాదు.. ఈ ‘కాస్సోవరీ’ పక్షులనేనట. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ఆది మానవుల నివాస ప్రాంతాలపై అధ్యయనం చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకు కొన్ని రకాల గుడ్ల పెంకులు, పక్షుల ఎముకలు లభించాయి. వాటిపై లేజర్ మైక్రోస్కొపీ, ఇతర పద్ధతుల్లో అధ్యయనం చేసి.. కాస్సోవరీ పక్షులకు చెందినవిగా గుర్తించారు. కొన్ని గుడ్లను కాల్చుకుని తిన్నట్టుగా, మరికొన్ని పొదిగి పిల్లలు బయటికి వచి్చనట్టుగా తేల్చారు. సుమారు 18 వేల ఏళ్ల కింద ఆది మానవులు వీటిని మాంసం, ఈకలు, గుడ్ల కోసం పెంచుకుని ఉంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ తెలిపారు. గోళ్లతో చీల్చేస్తుంది..! ఏకంగా ఆరు అడుగుల ఎత్తు, 59 కిలోల బరువు వరకు పెరిగే ఈ కాస్సోవరీ పక్షులు ప్రస్తుతం భూమ్మీద ఆస్ట్రిచ్‌ల తర్వాత అతిపెద్ద పక్షిజాతిగా చెప్పవచ్చని డగ్లస్ పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన పక్షి అని.. ఇతర పక్షులు, జంతువులతోపాటు మనుషులను కూడా గోళ్లతో చీల్చేసే సామర్థ్యం వీటికి ఉంటుందని తెలిపారు. ఆ్రస్టేలియాలోని న్యూగినియాలో స్థానికులు ఇప్పటికీ ఈ కాస్సోవరీ పక్షుల మాంసం తినడం గమనార్హం. యజమానిని చంపేసింది 2019లో అమెరికాలోని ఫ్లారిడాలో ఒక కాస్సోవరీ పక్షి.. తనను పెంచుకుంటున్న మార్విన్ హజోస్ అనే వ్యక్తిని గోళ్లతో చీల్చి చంపేసింది. విషయం ఏమిటంటే ఆయన ఓ పర్యావరణ ప్రేమికుడు. ఈ పక్షి ఒక్కదాన్నే కాదు.. ఇలాంటి చిత్రమైన మరో వంద రకాల పక్షులు, జంతువులను తన ఎస్టేట్‌లో పెంచేవాడు. ఆయన చనిపోయాక వాటన్నింటినీ వేలం వేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అది.. డైనోసార్లను భయపెట్టింది..!
భారత దేశంలో అంతరించిపోయిన డైనోసార్లు తిరుగాడాయా? ఇక్కడే రాక్షసబల్లులు.. స్వేచ్ఛగా విహరించాయా? లక్షల సంవత్సరాల కిందటే పురాతన జంతువులు భారత్‌లో.. ఆవాసమేర్పరచుకున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 150 మిలియన్ ఏళ్ల చరిత్ర.. 1500 గంటల పురాతత్వ అధికారుల ప్రయత్నాలు సఫలమ్యాయి. గుజరాత్‌లోని లోడాయి ప్రాంతంలో డైనోసార్లు.. వాటికంటే పూర్వపు జంతువులు సంచరించాయన్న నమ్మకంతో శిలాజాలపై పరిశోధనలు చేసే అధికారులు, భారత పురాతత్వ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తవ్వకాల్లో భారీ సముద్ర సరీసృప శిలాజాల వెలుగు చూశాయి. ఈ శిలాజం 5 మీటర్లు పొడవు.. ఉంది. ఆధునిక తిమింగలాలు, డాల్ఫిన్లకు మాతృకలా ఇది కనిపించడం విశేషం. పొడవైన తోక, నాలుగు రెక్కలు కలిగిన ఈ సముద్ర జంతువు.. 152 నుంచి 157 మిలియన్ సంవత్సరా మధ్య జీవించి ఉండొచ్చని శిలాజ నిపుణులు అంచనా వేస్తున్నారు. డైనోసార్లు, ఇటువంటి సముద్ర సరీసృపాల మధ్య అప్పట్లో భీకరమైన పోరాటాలు జరిగి ఉండొచ్చని వారు అంటున్నారు. ఒక దశలో డైనాసర్లును సైతం ఇవి భయపెట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. డైనోసార్లను సైతం భయపెట్టే ఈ సముద్ర జంతువులు అప్పట్లో ప్రపంచమంతా ఎలా విస్తరించాయో తెలుసుకునేందుకు ఈ శిలాజాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సముద్ర జంతువుల శిలాజాలను గుర్తించే క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్‌కు చెందిన స్టీవ్ బ్రుస్టే కృషి వల్లే ఇది బయట పడిందని అధికారులు చెబుతున్నారు. -
డైనోసార్లు మనుషులను తినేస్తాయా?
వాషింగ్ఘన్: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన 'జురాసిక్ పార్క్-4' హాలివుడ్ చిత్రంపై పురాజీవ శాస్త్రవేత్తలు (నశించిపోయిన జంతువులపై ఆధ్యయనం చేసే శాస్త్రవేత్తలు) మండిపడుతున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాబోదని, జురాసిక్ కాలంనాటి డైనోసార్ల గురించి సినిమాలో చూపించిందంతా ఒట్టి బూటకమని విమర్శిస్తున్నారు. ఆకారంలో భారీగావున్నప్పటికీ సాధు జీవులైన డైనోసార్లను మనుషులను పీక్కుతినే రాక్షస జంతువులుగా చిత్రీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఇది ప్రకృతి విరుద్ధంగా జంతుజాలాన్ని కాఠిన్యంగా చూపించడమే అవుతోందని వారు వాదిస్తున్నారు. సినిమాలో చూపించినంత పెద్దగా అవి ఉండవని, 40 అడుగులకు మించిన డైనోసార్ కళేబరం తమ పరిశోధనల్లో ఎక్కడా దొరకలేదని వారు చెబుతున్నారు. ఎప్పుడు చూడని మనిషిని చూస్తే అవి గుర్తించలేవని, కదలక, మెదలక నిలబడితే ఏ మనిషినైనా గుర్తించే మెదడు నైపుణ్యంగానీ దృష్టిగానీ వాటికి లేవని అన్నారు. డైనోసార్లలో శాకాహార, మాంసాహారులనే రెండు రకాలు ఉన్నప్పటికీ....మాంసాహారులు చిన్న చిన్న జంతువులను తింటాయే తప్ప, మనుషులను వెంటాడి తినే ప్రసక్తే లేదని అంటున్నారు. సహజంగా మెతక వైఖరిని ప్రదర్శించే శాకాహార డైనోసార్లకు తోకతోని మనుషులనే కాదు, తోటి జంతువులను వేటాడే లక్షణాలు కూడా ఉండవని, డైనోసార్లలో కొన్ని రకాల డైనోసార్లకు రెక్కలు ఉన్నట్టు తమ పరిశోధనల్లో తేలినప్పటికీ వాటికి ఎగిరే శక్తినిచ్చే రెక్కలు మాత్రం లేవని వారు చెబుతున్నారు. ఏ రకం డైనోసార్కైనా తలుపులను తెరిచే జ్ఞానం మాత్రం ఉండదని, పైగా సినిమాలో చూపించినట్టుగా వాటి చర్మం గట్టిగా గరకుతేలినట్టు ఉండదని, మెత్తగా ఉంటుందని వారంటున్నారు. సినిమాలో వాస్తవ లక్షణాలకు విరుద్దంగా డైనోసార్లను చూపించడం ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోప పట్టించడమే అవుతుందని ఇప్పటివరకు 20 డైనోసార్ల కళేబరాలను కనుగొన్న పురాజీవ శాస్త్రవేత్త జేమ్స్ కిర్క్లాండ్ (సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం), టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జూలియా క్లేర్క్, రేమండ్ అల్ఫ్ మ్యూజియం ఆప్ పాలియోంటోలజిలో పనిచేస్తున్న నిపుణుడు, శాస్త్రవేత్త ఆండ్రివ్ ఫార్కే ఆరోపిస్తున్నారు. సినిమాల ద్వారా ఔత్సాహిక పరిశోధకుల్లో, విద్యార్థుల్లో డైనోసార్ల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిస్తున్నందుకు థాంక్స్ అని వారు చెప్పడం కొసమెరపు. వీరి వాదనలతో జురాసిక్ పార్క్ చిత్ర నిర్మాణం వెనుక నిలిచిన శాస్త్రవేత్త జాక్ హార్నర్ విభేదిస్తున్నారు. ఇవన్ని వారి అభిప్రాయాలేగాని, వాస్తవాలు కాదని, స్పీల్బర్గ్ దర్వకత్వంలో వెలువడిన తొలి జురాసిక్ పార్క్ సినిమా నుంచి వారు ఇలాంటి విమర్శలే చేస్తున్నారంటూ ఆయన ఎదురు దాడికి దిగారు. అయినా తాము తీసింది సైన్స్ ఫిక్షన్గానీ డాక్యుమెంటరీ కాదని చెప్పారు. పైగా డీఎన్ఏ ఆధారంగా డైనోసార్లను అభివృద్ధి చేసినట్టు చూపాం కనుక గతించిన డైనోసార్లకు, పునర్ సృష్టించిన డైనోసార్లకు ఎంతైనా తేడా ఉండవచ్చని ఆయన లాజిక్ తీశారు.