అశ్వథ బిజు
నిన్న మొన్నటి చరిత్ర అంటేనే ఈ కాలపు యువతకు ఆసక్తి లేదు. కాని వేలయేళ్ల ప్రకృతి రహస్యాలను నిక్షిప్తం చేసుకుని ఉండే శిలాజాల అన్వేషణకు ఎవరైనా పూనుకుంటారా? చెన్నైకి చెందిన అశ్వథ బిజు 9 ఏళ్ల వయసు నుంచే ‘పాలియోంటాలజిస్ట్’గా మారింది. అందుకే ఇటీవల ప్రధానమంత్రి బాలపురస్కార్‌ని అందుకుంది. 14 ఏళ్ల అశ్వథకు ఈ పని పట్ల ఎందుకు ఆసక్తి? ఆమె తెలుసుకున్నది ఏమిటి?
‘పాలియోంటాలజిస్ట్’ అనే మాట మనకు ఏ స్పీల్‌బర్గ్ తీసే హాలీవుడ్ సినిమాలోనో వినిపించవచ్చు. కాని చెన్నైకి చెందిన 14 ఏళ్ల అశ్వథ తన విశిష్ట కృషితో ఇవాళ వేలమంది విద్యార్థులకు ఆ మాటను తెలియ చేసింది. పాలియోంటాలజిస్ట్ అంటే శిలాజాల పరిశోధకుడు అని అర్థం. పాలియోంటాలజీ అంటే శిలాజాల అధ్యయన శాస్త్రం.
శిలాజం అంటే?
భూఆవరణంలో లక్షల ఏళ్లుగా ఎన్నో జీవులు, జీవరాశులు పుట్టాయి. గిట్టాయి. కాని కొన్ని మరణించి తమ జీవ అవశేషాన్ని భూపొరలతో కలుపుకొని వాతావరణ పీడనం వల్ల రాయిలా మారతాయి. అంటే ఆ రాతి లో జీవచిహ్నం అలాగే ఉండిపోతుందన్న మాట. ఇలాంటి రాళ్లనే శిలాజం (ఫాజిల్) అంటారు. ఆ శిలాజాన్ని పరిశీలించినప్పుడు అది ఏ జీవిది ఏ కాలానికి ఆ కాలంలో ఆ జీవి ఉనికి ఎలా ఉండేది అని తెలుసుకోవచ్చు. జంతు శిలాజాలు, వృక్ష శిలాజాలు ఎన్నో భూమిపై జీవుల ఉనికి ఏ విధంగా ఉండేదో తెలియ చేస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఉండి ఆ తర్వాత అంతరించిపోయిన డైనోసార్లు, డోడో పక్షుల వంటివి ఈ శిలాజాల అన్వేషణ వల్లే వాటి పూర్వ రూపం గుర్తించడానికి వీలయ్యాయి. ఇరవై లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ శిలాజాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.
చెన్నై అమ్మాయి అశ్వథ
చెన్నైలో పుట్టి పెరుగుతున్న అశ్వథను తల్లిదండ్రులు చిన్నప్పుడు బీచ్‌కు తీసుకెళితే ఉత్సాహంగా గవ్వలు ఏరేది. ఐదేళ్లప్పుడు తండ్రి ఎన్‌సైక్లోపిడియాను బహూకరిస్తే ఆ పుస్తకంలో మొదటిసారి శిలాజాల గురించి తెలుసుకుంది. సముద్ర గవ్వల్లో కూడా కొన్ని శిలాజాలుగా మారి ఉంటాయని తెలుసుకున్నాక ఆమెకు శిలాజాల గురించి తెలుసుకోవాలనిపించింది. అశ్వథ ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తల్లి చిన్నారి అశ్వథను ఎగ్మూర్‌లోని గవర్నమెంట్ మ్యూజియంకు తీసుకెళ్లింది.
‘అక్కడ నేను మొదటిసారి అమ్మొనైట్ ఫాజిల్‌ను చూశాను. చేతితో తాకాను. థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాంటివి అన్వేషించి సేకరించవచ్చు అని తెలుసుకున్నాను. నాకూ సేకరించాలనిపించింది’ అంటుంది అశ్వథ. చెన్నైలోని ఒక టెక్నో స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న అశ్వథ ఇప్పటికి 136 శిలాజాలను సేకరించింది. ఆ విధంగా భారతదేశంలో చిన్న వయసు పాలియోంటాలజిస్ట్‌గా గుర్తింపు పొందింది. అందుకే భారత ప్రభుత్వం అశ్వథ కృషికి మెచ్చి మొన్న ‘ప్రధానమంత్రి బాలపురస్కార్’ను బహూకరించింది.
విశేష ప్రచారం
అశ్వథకు పదేళ్లు ఉన్నప్పుడు పెరియార్ యూనివర్సిటీలో పని చేస్తున్న జియోలజీ ప్రొఫెసర్ ఎం.యు.రాంకుమార్‌ను కలిసింది. ఆయన శిలాజాల గురించి ఆ అమ్మాయికి ఉన్న ఆసక్తి గమనించి మార్గనిర్దేశనం చేశాడు. ఆ తర్వాతి నాలుగేళ్లలో అశ్వథ తమిళనాడులోని అరియలూరు, గుండు పెరుంబేడు లలో, మహారాష్ట్రలోని శిరోంచాలో శిలాజాల అన్వేషణ సాగించింది. స్కూలు సెలవుల్లో తల్లిదండ్రుల సహాయంతో అశ్వథ ఈ పని చేయగలిగింది. విశేషం ఏమిటంటే ఆమెకు డైనోసార్ల ఎముకలు కూడా దొరికాయి. ‘కాని శిలాజాల అధ్యయనం పట్ల మన స్కూళ్లలో ఎలాంటి పాఠాలు లేవు. అవగాహన లేదు.
అందుకే నేను చెన్నైలోని అనేక స్కూళ్లను కలిసి అక్కడ శిలాజాల గురించి చెప్పడం మొదలెట్టాను. కొద్ది రోజుల్లోనే నాకు గుర్తింపు వచ్చి అన్ని స్కూళ్లు పిలవడం మొదలెట్టాయి. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా విద్యార్థుల కోసం వెబినార్లు నిర్వహిస్తున్నాను. పాలియోంటాలజీ ఇప్పుడు యూనివర్సిటీలలో అడిషినల్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఉంది. నేను పెద్దయ్యే సమయానికి అది మెయిన్ కోర్సు అవుతుందని ఆశిస్తున్నాను. నేను పెద్దయ్యి మాలిక్యులర్ పాలియోంటాలజిస్ట్ అవుదామనుకుంటున్నాను’ అంటుంది అశ్వథ.
అశ్వథ కృషి కొనసాగాలని కోరుకుందాం.
శిలాజాల అధ్యయనం పట్ల మన స్కూళ్లలో ఎలాంటి పాఠాలు లేవు. అవగాహన లేదు. యూనివర్సిటీలలో కూడా అడిషినల్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఉంది. నేను పెద్దయ్యే సమయానికి అది మెయిన్ కోర్సు అవుతుందని ఆశిస్తున్నాను. నేను పెద్దయ్యి మాలిక్యులర్ పాలియోంటాలజిస్ట్ అవుదామనుకుంటున్నాను.
– అశ్వథ బిజు
Comments
Please login to add a commentAdd a comment