జురాసిక్ పార్క్ సినిమా గుర్తుందా...?
ఎన్నడో అంతరించిపోయిన రాక్షస బల్లులు మళ్లీ పుట్టుకొస్తాయి దీంట్లో!
చెట్ల జిగురులో ఇరుక్కుపోయిన అవశేషాల నుంచి డీఎన్‌ఏను వేరు చేయడం..
దాన్నుంచి పూర్తిస్థాయి జంతువును సృష్టించడం చిత్రం ఇతివృత్తం!
సినిమా.. అందులోని కాల్పనిక టెక్నాలజీ విషయాలన్నీ కాసేపు పక్కనపెడితే...
ఆ జిగురు కథ మాత్రం ఎంతో ఆసక్తికరం.. ఇప్పుడదో లాభసాటి వ్యాపారం..
అంతేనా... కానేకాదు.. మన పొరుగుదేశం మయన్మార్‌లో బోలెడంత ఘర్షణకూ ఇదే కారణమవుతోంది!
చిన్నప్పుడు మీ పుస్తకాలకు అట్టలేసుకునేందుకు జిగురు వాడారా? ఇప్పుడైతే ఫెవికాల్ లాంటివి వచ్చేశాయి గానీ.. ఓ మూడు దశాబ్దాల క్రితమైతే.. చెట్ల వెంబడి పడి.. సొంతంగా జిగురు సేకరించుకోవాల్సిందే. వేపచెట్టు జిగురు కంటే తుమ్మ బంక చాలా గట్టిదన్న నమ్మకం.. తుమ్మచెట్టు ఎక్కడుందో వెతుక్కోవడం.. కాండం, కొమ్మలపై గాట్లు పెట్టి జిగురు వచ్చేందుకు వేచి ఉండటం.. ఆపై దాన్ని మురిపెంగా సేకరించుకొచ్చి.. దాచుకుని కొంచెం కొంచెం వాడుకోవడం.. ఇదీ పాతకాలపు అనుభవాలు. పొరుగుదేశం మయన్మార్‌లో కొంతమంది ఇప్పటికీ ఇలాగే జిగురు సేకరిస్తున్నారు. కాకపోతే అది ఇప్పుడున్న చెట్లకు కాసింది కాదు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అన్ని పరిస్థితులనూ తట్టుకుని గడ్డకట్టిపోయినవి. ఇంగ్లిష్ పేరు ఆంబర్. ముదురు పసుపు రంగులో లేదంటే కొంచెం ఎరుపు రంగులో గాజు మాదిరిగా పారదర్శకంగా ఉండే ఈ ఆంబర్‌ను సేకరించడం లాభసాటి వ్యాపారమే. జిగురు మాత్రమే ఉంటే నగల్లో వాడతారు. అందులో ఏవైనా ఇతర పదార్థాలు కలసి ఉన్నా.. క్రిమి, కీటక, జంతు అవశేషాలున్నా.. ధర ఎక్కువవుతుంది. రాక్షస బల్లుల అవశేషాల్లాంటివి ఉంటే ఒక్కో ఆంబర్ ముక్క లక్ష డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలు ఖరీదు చేసినా ఆశ్చర్యం లేదు.
కొత్త కేంద్రం మయన్మార్...
ఆంబర్ చరిత్ర ఘనమైందే. ఒకప్పుడు చైనా పాలకులు దీన్ని నగల్లో విరివిగా వాడేవారు. గ్రీస్‌తోపాటు కొన్ని ఇతర యూరోపియన్ దేశాల్లోని కొన్ని చర్చిల్లోనూ విస్తృతస్థాయిలో దీన్ని వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే తాజాగా మయన్మార్ ప్రాంతంలో బయటపడుతున్న ఆంబర్ మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న కచిన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బయటపడుతూండటం ఒక విశేషమైతే.. ఇటీవలే అక్కడ రాక్షస బల్లి రెక్క అవశేషం పూర్తిస్థాయిలో ఉన్న ఓ ముక్క వెలుగుచూడటం ఇంకో విశేషం. సుమారు పదికోట్ల ఏళ్ల క్రితం నాటి ఆంబర్‌లు కచిన్‌కు కొంచెం దూరంలో ఉన్న మయిట్‌కైనా ప్రాంతంలో బయటపడుతున్నాయని.. కొన్నింటిలో క్రిమికీటకాలు పూర్తిస్థాయిలో నిక్షిప్తమై ఉండటం పురాతత్వ శాస్త్రవేత్తలను విపరీతంగా ఆకర్షిస్తోందని అంటున్నారు చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్త లిడా జింగ్. మూడేళ్ల క్రితం రాక్షస బల్లి తోకతో కూడిన ఆంబర్‌ను మయన్మార్ నుంచి చైనాకు తీసుకొచ్చింది ఈయనే.
అంతర్యుద్ధంతో శాస్త్రవేత్తల అధ్యయనానికి ఇబ్బందులు
కోట్ల ఏళ్లక్రితం నాటి జీవజాతుల గురించి అధ్యయనం చేసే పాలియో ఎంటాలజిస్ట్‌లకు ఆంబర్‌లోని అవశేషాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ప్రపంచం మొత్తమ్మీద వాణిజ్యస్థాయిలో ఆంబర్‌ను వెలికితీస్తున్న ఏకైక ప్రాంతం కచిన్ కావడం.. స్థానికులు కచిన్ స్వాతంత్య్రం కోసం సైన్యంతో పోరాడుతూండటం వీరికి సమస్యలు సృష్టిస్తోంది. ఆంబర్‌ను అమ్ముకుని తమ ఉద్యమానికి ఆర్థిక దన్ను సమకూర్చుకోవాలన్నది తిరుగుబాటుదారుల ఉద్దేశం. ఇది సైన్యానికి సుతరామూ ఇష్టం లేదు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్ష మందికి పైగా సామాన్యులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోగా.. ఆంబర్ గనుల పరిసరాల్లోని వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదని సైన్యం ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాలకు వెళ్లడం, ఆంబర్ గనుల్లో భూగర్భ ప్రాంతాలను పరిశీలించడం సాధ్యం కావడం లేదని పరిశోధకులు అంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని రాక్షస బల్లుల అవశేషాల కోసం అక్బర్‌ఖాన్ లాంటివారు కొందరు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి అరుదైన ఆంబర్ వేటకు మించిన థ్రిల్ ఇంకోటి లేదని అక్బర్‌ఖాన్ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment