హైబ్రిడ్ రాకాసి బల్లి వచ్చేస్తోంది!
అదో రాకాసి బల్లి. దానికి ప్రత్యేకంగా తిక్క రేగాల్సిన అవసరం లేదు. ఫుల్ టైమ్ తిక్క ఆన్‌లోనే ఉంటుంది. అందుకే, కంటికి కనిపించిన మనిషిని కసకసా కొరికి తినేస్తుంది. ఇది చదువుతోంటే ‘జురాసిక్ పార్క్’ గుర్తొస్తోంది కదూ. పిల్లలూ, పెద్దలూ ఆ రాకాసి బల్లిని కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూశారు.
ఇప్పుడు అంతకు రెట్టింపు రాకాసి రాబోతోంది. ఇది హైబ్రిడ్ డైనోసార్. ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి నాలుగో భాగంగా రూపొందిన ‘జురాసిక్ వరల్డ్’లో ఈ హైబ్రిడ్ రాకాసి బల్లి చేసే విధ్వంసం చూడ్డానికి రెండు కళ్లూ చాలవట. మునుపటి భాగాల్లో కన్నా ఇందులోని బల్లి వెన్నులో వణుకు పుట్టించేలా ఉండాలని చిత్రబృందం అనుకున్నారట.
దాంతో 50 అడుగుల పొడవు, 18 అడుగుల ఎత్తు ఉన్న రాకాసి బల్లిని తయారు చేశారు. జురాసిక్ వరల్డ్ పార్క్‌లోకి సందర్శకుల ప్రవేశం తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నిర్మాతగా, కొలిన్ ట్రెవ్రో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ జూన్ 12న.