సిద్దిపేటలో జురాసిక్‌ పార్క్‌ | Jurassic Park in Siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో జురాసిక్‌ పార్క్‌

Published Sun, Aug 13 2023 3:53 AM | Last Updated on Sun, Aug 13 2023 6:33 PM

Jurassic Park in Siddipet - Sakshi

వందల ఏళ్ల కిందట అంతరించిపోయిన డైనోసార్లకు హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ వెండితెరపై రూపం ఇచ్చి ప్రాణం పోశారు. 1993లో వచ్చి న జురాసిక్‌ పార్క్‌ క్రియేట్‌ చేసిన ట్రెండ్‌ అంతా ఇంతా కాదు. ఆ తరువాత కూడా ఆ చిత్రానికి కొనసాగింపుగా అనేక సినిమాలు వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి.

ప్రజలకు డైనోసార్లపై ఉన్న ఆసక్తిని గమనించి ఆ తర్వాత డైనోసార్‌ థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో పార్కులు వెలిశాయి. నూతన సాంకేతికతను ఉపయోగించి నిజంగా ప్రాణం పోసుకున్నాయా అన్నట్టుగా డైనోసార్లను తయారుచేసి ప్రదర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటైన రీతిలో ఇప్పుడు కొత్తగా డైనోపార్క్‌ మన తెలంగాణలోనూ అందుబాటులోకి రాబోతుంది. దానికి సిద్దిపేట వేదిక కాబోతుంది.  - సాక్షి, సిద్దిపేట

విదేశాల్లోని పార్కుల తరహాలో
డైనోపార్క్‌ అంటే ఏదో ఎగ్జిబిషన్‌లా బొమ్మలు, 3డీ యానిమేషన్‌ స్క్రీన్లు కాదు. అమెరికా, సింగపూర్‌లలోని యూనివర్సల్‌ వరల్డ్‌ స్టూడియోలో ఉన్న డైనోపార్క్‌ల తరహాలో కోమటిచెరువు సమీపంలో పార్క్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ పార్క్‌ పనులు ఏడాది కిందట మొదలు కాగా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వారంలో  ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

1.5 ఎకరాల విస్తీర్ణంలో.. 
డైనోసార్‌ పార్క్‌ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ డైనోపార్క్‌లో పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్‌ఫాల్స్‌ ఇలా మూడు వేల శతాబ్దాల కిందట భూమండలం మీద పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టుగా ఏర్పాటు చేస్తున్నారు.

పార్కులో వివిధ రకాల డైనోసార్‌లు, వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్‌ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి పార్కు ఆవరణలో అటూఇటూ కలియతిరుగుతూ భీకరంగా శబ్దాలు చేస్తూ సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు సిద్ధమవుతున్నాయి.  

వాకింగ్‌ డైనో.. 
ఈ డైనో థీమ్‌ పార్క్‌లో వాకింగ్‌ డైనోసార్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో చిన్నారులు కూర్చుంటే నడుచుకుంటూ వెళ్తుంది. ఒకేసారి ఆరుగురు చిన్నారులు కూర్చునే విధంగా రూపొందించారు. అలాగే లోపల గుహల్లో తిరుగుతున్న సమయంలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. డైనోసార్‌ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తుండగా సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది. పార్క్‌ను చూసేందుకు వస్తున్న పిల్లలను అలరించేందుకు డైనోసార్‌ సూట్‌ వేసుకుని ఇద్దరు తిరగనున్నారు. 

మినీ ట్రాక్‌.. ఓపెన్‌ ట్రైన్‌ 
డైనోసార్‌ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్‌ను నిర్మించారు. దీనిపై ఓపెన్‌ట్రైన్‌ నడుస్తుంది. ఈ ట్రైన్‌లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగు­రు కూర్చునే వీలుంది. ఈ ఓపెన్‌ ట్రైన్‌లో తిరుగుతు­న్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతి­ని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్‌లు మీదపడినట్టు, భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్‌ను డిజైన్‌ చేశారు.  

గుజరాత్‌ను మించేలా.. 
మన దేశంలో గుజరాత్‌లోని రయోలిలో డైనోసార్‌ గుడ్లు లభించాయి. దీంతో అక్కడ డైనోసార్‌ మ్యూజియం ఏర్పాటు చేశా­రు. ఈ మ్యూజియంలో నిలకడగా ఉండే డైనోసార్‌లను ప్రదర్శనకు ఉంచారు. డైనోసార్లలో ఒక్కటి మాత్రమే అరుస్తూ.. తోక ఊపుతుంది. కానీ సిద్దిపేటలో ప్రారంభంకాబోతున్న పార్క్‌లో కదిలే డైనోసార్లు 18 ఉన్నాయి. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేశారు. ఒక రకంగా దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్‌ పార్క్‌ అని అంటున్నారు.  

కొత్త అనుభూతి కలిగిస్తుంది 
కోమటి చెరువులో మరో మణిహారంగా డైనోసార్‌ పార్క్‌ ఏర్పా­టు కాబోతుంది. ఇప్పటికే రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్‌ పార్క్‌ల చెంతన వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్‌ పార్క్‌ అందుబాటులోకి రానుంది. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, మధురానుభూతిని కలిగించేలా డైనోసార్‌ పార్కు ఉంటుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్‌ ఉండబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement