ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ఆర్థిక వృద్ధికి ప్రయివేటీకరణ సరైన మార్గమని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టుంది. ఆ అభిప్రాయం సరైందికాదు. అంతకు ముందున్న లైసెన్స్ రాజ్ దేశం లోని వృద్ధిని మందగింపజేస్తే, సరళీకరణ తర్వాత పరిణామాలు వృద్ధిని కొద్దిమంది చేతిలో బందీని చేశాయి. దేశానికి సొంత వనరుల్ని వాడుకుంటూ సృష్టించిన సంపద అతికొద్దిమంది చేతికే చెంది, అత్యధిక మందిని పేదలుగా ఉంచింది. దేశంలోని పెరిగే సంపదలో 70 శాతం కేవలం పది శాతంమంది దగ్గర పోగుపడడం, అసమానతల్ని పెంచే విధానాల్ని చెబుతోంది.
కాబట్టి ఇప్పుడు దేశానికి కావాల్సింది సంపదల సరైన పంపిణీ. ఆర్థిక అసమానతల్ని, వీటికి మూలంగా నిల్చిన సామాజిక అసమానతల్ని రూపుమాపే కార్యక్రమం. సంపద సృష్టికి దోహదపడే వనరుల సృష్టి, వినియోగం. విలువైన మానవ వనరులు ఏర్పడేలా అందరికీ ఉచిత విద్యావకాశాలు, ఉచిత లేదా చవకైన ఆరోగ్య సేవలు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం అన్నవి దీర్ఘకాలికంగా దేశానికి లాభం చేకూర్చేవి.
అన్ని ప్రభుత్వ సంస్థలూ అసమర్థమైనవి కావు, అన్ని ప్రయివేటు సంస్థలూ గొప్పవి కావు. నిర్వహణ బట్టీ ఫలితం. నిర్వహణలో లోపాల్ని సరిదిద్దితే గాడిన పడతాయి. ప్రైవేటు సంస్థ చెయ్యగలిగింది ప్రభుత్వం చెయ్యలేదంటే లాజిక్ లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థ వల్ల ఉపాధి, ఉద్యోగాలు. వాటి ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమం సాధ్యపడుతుంది. ప్రయివేటులో యాజమాన్యానికి లాభం ముఖ్యమై, మిగతా విషయాల పట్టింపు ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు వ్యాపారం చెయ్యకూడదు అన్నది సరైంది కాదు. అది ప్రజల ధనంతో ప్రజలందరికీ న్యాయం, లాభం చేకూర్చగల మార్గం. గాంధీజీ దృష్టిలోనైనా వ్యాపారం తప్పు కాదు.. నైతికత లేని వ్యాపారమే పాపం. అదైతే ఎవ్వరూ చెయ్యగూడదు.. చెయ్యనివ్వగూడదు.
– డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
మొబైల్ : 94408 36931
Comments
Please login to add a commentAdd a comment