ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 నవంబర్ 12న ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను జాతికి అంకితం చేశారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధమని తేల్చిచెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే గతంలో జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ప్రభుత్వ పరిశ్రమల భవిష్యత్తు గురించీ, ప్రభుత్వం అవలంబించే కార్యాచరణను కూడా ప్రకటిస్తూ... ప్రభుత్వ పరిశ్రమలను అమ్మివేస్తామని లేదా బంద్ పెడతామని కరాఖండిగా తెలిపారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణ చర్యలు వేగిరమైనాయి.
పార్లమెంట్ ఉభయ సభల్లో 2015 మార్చిలో ‘బొగ్గు గనుల నిబంధనల ప్రత్యేక చట్టం 2015’ను ఆమోదింపజేసి అక్టోబర్ 21 (బ్యాక్ డేట్) నుండి అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలైన ‘కోల్ ఇండియా లిమిటెడ్’ (సీఐఎల్), ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ (ఎస్‌సీసీఎల్)లకు అండగా ఉన్న ‘1973 బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం’ను 2018 జనవరి 8న రద్దు చేశారు. 2019 ఫిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఏ) పెద్ద, మధ్య, చిన్న స్థాయి బొగ్గుగనులను ప్రైవేటుకు ఇవ్వడానికి అనుమతించింది.
2019 ఆగస్ట్ 28న కేంద్ర క్యాబినెట్ బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది. 2019 సెప్టెంబర్ 13న రెవెన్యూ, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ పాల్గొన్న సమావేశం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించే సంస్కరణలను సిఫారసు చేసింది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది. ప్రధాని అసత్యం మాట్లాడారనే కదా! ఆయన అన్నట్టుగానే సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు అనుకూలంగా తెచ్చిన కొత్త చట్టాలను రద్దుచేసి ‘బొగ్గుగనుల జాతీ యీకరణ చట్టం 1973’ను యధాతథంగా కొనసాగించాలి. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?)
– మేరుగు రాజయ్య, గోదావరిఖని
Comments
Please login to add a commentAdd a comment