సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
బెల్లంపల్లి/కాగజ్‌నగర్ టౌన్: సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటు సాక్షిగా నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తామని ప్రకటించడం.. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రధాన మంత్రి సింగరేణిపై మాట తప్పారని, బొగ్గు గనులు, విశాఖ ఉక్కుతోపాటు ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వేల వంటి ముఖ్యమైన సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోందని విమర్శించారు.
కాగా, కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ప్రారంభించనున్న వైద్య కళాశాలల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కానుందని చెప్పారు. గురువారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రం, కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉండాలని, ప్రభుత్వపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యులను నియమిస్తామని, వారంరోజుల్లోగా కాగజ్‌నగర్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
ఆసిఫాబాద్‌లో 340 పడకల ఆస్పత్రి నిర్మాణంతోపాటు వైద్య కళాశాల ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి సిర్పూర్ (టీ), ఆసిఫాబాద్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలోనే ఆ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment