ఎస్పీ-కాంగ్రెస్ కూటమి పుట్టి మునిగిందిలా..
మధుర/లక్నో/ఎతావా
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీ కూటమి ఓటమికి అంతర్గత విభేదాలు, వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేయకపోవడమే కారణమా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రదీప్ మాధుర్. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష మాజీ అధ్యక్షుడైన ప్రదీప్ ఆదివారం మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అరెస్టు చేసి ఉన్నట్టయితే తమ కూటమి మరిన్ని స్థానాలను గెలుచుకుని ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాపతి అరెస్టుకు అవసరమైన చర్యలను నిబద్ధతతో తీసుకుని ఉండాల్సిందన్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అధికార సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఇది కొంత ప్రభావం చూపి ఉండొచ్చంటున్నారు. నోట్ల రద్దు నిర్ణయం కూడా బీజేపీ విజయానికి దారితీసి ఉండొచ్చన్నారు. దీనికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు మద్దతు పలికారని ఆయన పేర్కొన్నారు. దీనికితోడు ఉజ్వల పథకం, ట్రిపుల్ తలాక్ బీజేపీ విజయానికి తోడయ్యాయన్నారు. మీడియా నిర్వహణ కూడా వారికి కలిసొచ్చిందన్నారు. 403 నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 312 స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేయడం తెలిసిందే.
143 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన వారిలో చాలామంది కోటీశ్వరులేనట. మొత్తం 322 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని నేషనల్ ఎన్నికల వాచ్ రిపోర్టు వెల్లడించింది. కల్నల్ ల్‌గంజ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి బీజేపీ అభ్యర్ధి అజయ్ ప్రతాప్ సింగ్ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాను వ్యవసాయదారుడని, తన ఆస్తుల విలువ రూ.49 కోట్లని వెల్లడించారు. వీరిలో 143 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది.ఇంకా 60 కిలోల బంగారం, ఏడు వాహనాలు, ఆరు తుపాకులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో 107 మంది తీవ్రమైన హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరొక రాజకీయ నాయకుడిగా మారిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారి బీఎస్పీ నుంచి పోటీ చేయడం తెలిసిందే.
ప్రజలకు చేరువకండి: అఖిలేశ్
ప్రజలకు చేరువ కావాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆదివారం ములాయంసింగ్, యాదవ్‌తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు ఇది. ఒక భావజాలం మన పోరాటం కొనసాగుతుంది.’ అని పేర్కొన్నారు. ఓటమి కారణాలను విశ్లేషించాలన్నారు
మళ్లీ పోరాడతాం: శివ్‌పాల్
విజయసాధన కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత శివ్‌పాల్ యాదవ్ ఆదివారం విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు. సదరు వీడియోలో అఖిలేశ్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్‌లతో భేటీ అయిన దృశ్యాలున్నాయి. జస్వంత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన శివ్‌పాల్,...తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మనీశ్ యాదవ్‌ను 52,616 ఓట్ల తేడాతో ఓడించడం తెలిసిందే.
ఏ ఒక్కరినీ బాధ్యుల్ని చేయలేం
ఎన్నికల్లో ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యులం చేయలేమని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఆయన తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను వెనకేసుకొచ్చారు. ‘ పార్టీ ఓటమికి ఏ ఒక్కరో కారణం కాదు. అందరూ బాధ్యులే. ప్రజలను మనవైపు తిప్పుకోలేకపోయాం. బీజేపీ వాగ్దానాలను ప్రజలు విశ్వసించారు. అయితే వాటిల్లో ఎన్నింటిని నిలబెట్టుకుంటుందో చూద్దాం’ అని అన్నారు.