రాజుగారి పెద్ద భార్యదే పైచేయి
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అమేథి అసెంబ్లీ ఎన్నికల్లో రేపిస్టు మంత్రి గాయత్రి ప్రజాపతిని, తోటికోడలు అమితా సింగ్‌ను కూడా వెనక్కి నెట్టి.. పెద్ద భార్య గరిమాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలే గరిమా సింగ్, అమితా సింగ్. వీళ్లలో అమితాసింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమేథి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, తన మంత్రివర్గంలో సభ్యుడైన గాయత్రి ప్రజాపతికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన పేరును అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక గరిమా సింగ్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె సంజయ్‌సింగ్ నుంచి ఎప్పుడో విడిపోయారు.
ఇక అమేథిలో మూడు సార్లు గెలిచిన అమితాసింగ్.. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ హవాకు తోడు తోటికోడలు కూడా కావడం, మరోవైపు బలమైన మంత్రి గాయత్రి ప్రజాపతి పోటీలో ఉండటంతో ఓట్లు బాగా చీలిపోయాయి. ఒక దశలో గాయత్రి ప్రజాపతి ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ గరిమాసింగ్ పుంజుకుని ముందుకొచ్చారు. అత్యాచారం కేసులో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటి నుంచి గాయత్రి ప్రజాపతి పరారీలో ఉన్నారు. ఆయన లక్నోలోని తన సొంతింట్లో గానీ, అమేథీలో గానీ ఎక్కడా కనిపించలేదని పోలీసులు చెప్పారు.