మాజీ భార్య తన భార్యను ఓడిస్తుందని బెంగతో..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు విచిత్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా సింగ్, ప్రస్తుతం ఉన్న భార్య అమితా సింగ్ మధ్య రసవత్తర పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేయగా బీజేపీ తరుపున సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా బరిలోకి దిగింది. తొలుత మాజీ భార్యతో పరోక్షంగా సంప్రదింపులు జరపాలనే యోచన చేసినప్పటికీ ఆ పనిని విరమించుకున్న సంజయ్ సింగ్ తానే స్వయంగా ఎన్నికల ప్రచార భారాన్ని మీద వేసుకున్నారంట.
ఎట్టి పరిస్థితుల్లో తన ఇల్లాలిని ఓడిపోనివ్వకూడదని, సరిగ్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మాదిరిగానే ప్రతి ఇల్లు తిరిగి తలుపుకొట్టి మరి ప్రచారం చేసి ఓట్లు అడిగారంట. ఓ పక్క మాజీ భార్య, తన ప్రస్తుత భార్య మధ్య రాయల్ కుటుంబానికి చెందిన ఆయన పరిస్థితి చూసి ఓట్లర్లంతా అయ్యోపాపం అనుకున్నారట. ప్రచారంలో ఎంతసేపటికి బీజేపీపైనే విమర్శలు చేసిన ఆయన తన మాజీ భార్యపై దురుసుగా ఒక్క కామెంట్ కూడా చేయలేదని, కేవలం తన ప్రస్తుత భార్యకు ఓటు వేయాలని మాత్రమే కోరారని తెలుస్తోంది.
అయితే, ఈ నియోజకవర్గానికి సోమవారం ఎన్నికలు ముగిశాయి. దీంతో ప్రస్తుతం గెలుపు ఓటములపై సమానమైన ఆలోచనను కలిగి ఉన్నారంట. ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారని సంజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘నేను నా వైపు గెలవాలని కోరుకుంటున్నాను.. ఒక వేళ ఏం జరిగినా సరే నన్ను నేను సముదాయించుకుంటాను’ అంటూ ఆయన వేదాంత ధోరణిలో సమాధానం ఇవ్వడం చూసి విలేకర్లు కూడా అహా.. అని అంటున్నారు.
సంబంధిత మరిన్ని వార్తా కథనాలకూ చదవండి
అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య