అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య | second wife of amethi maharaj to take on his first wife | Sakshi
Sakshi News home page

అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య

Published Tue, Jan 24 2017 5:02 PM | Last Updated on Sat, Aug 18 2018 3:37 PM

అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య - Sakshi

అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు రసవత్తర పోటీ జరుగనుంది. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేస్తారని ముందుగా రాజకీయవర్గాలు భావించాయి. అయితే ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌–సమాజ్‌వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన  గాయత్రి ప్రజాపతి పోటీచేస్తారని అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించారు. దీంతో తాను తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ ప్రకటించారు.
 
గాయత్రి ప్రజాపతి సిట్టింగ్‌ సభ్యుడే కాకుండా అఖిలేష్‌ క్యాబినెట్‌లో మంత్రి కూడా. ఇక అమితా సింగ్ అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌కు రెండో భార్య. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గరిమా సింగ్‌ను ఎంపిక చేసింది. ఆమె సంజయ్‌ సింగ్ నుంచి విడిపోయిన మొదటి భార్య కావడం విశేషం. అమేథి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే అమేథి, సమీపంలోని రాయ్‌బరేలి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని పదేసి స్థానాలను చెరిసగం పంచుకోవాలని రాహుల్, అఖిలేష్‌ నిర్ణయించడంతో అమితా సింగ్‌కు అభ్యర్థిత్వం దక్కలేదు.
 
‘అమేథి నా కుటుంబం, నా ఇల్లు, దీన్ని నేను వదిలిపెట్టలేను. ఈ నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను’ అని అమితా సింగ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ సీనియర్‌ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఒకవేళ టిక్కెట్‌ లభించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ సీటు నుంచి మూడు సార్లు గెలిచిన ఆమె ఓ సారి మంత్రిగా కూడా పనిచేశారు. తన భర్త మాజీ భార్య అయిన గరిమా సింగ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఆమె ఎవరో తెలియదని, వారు కనీసం ఆమెను చూసి కూడా ఉండరని, ప్రజాజీవితంతో ఎలాంటి సంబంధం లేని ఆమెను ఎంపిక చేయడమేమిటని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement