gayatri prajapathi
-
ప్రజాపతి సరే.. ఆ 107 మంది మాటేంటి?
గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు, గత 17 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న గాయత్రీ ప్రజాపతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యను అందరూ అభినందించారు. అయితే.. యూపీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో మరో 107 మంది... తీవ్రమైన నేరాలు చేసి కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ల సంగతి ఏంటని.. ఆ నేరాల మీద విచారణ ఎప్పటికి పూర్తవుతుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సభ్యులలో 26% మంది మీద ఈ తరహా కేసులున్నాయన్నమాట. మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు కొత్తగా యూపీ అసెంబ్లీకి ఎన్నికైతే, వాళ్లలో 107 మంది మీద హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులున్నాయి. అంతేకాదు.. 143 మంది ఎమ్మెల్యేల మీద ఓ మాదిరి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఏదైనా నేరానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడి, అది నాన్ బెయిలబుల్ నేరం అయితే అది తీవ్రమైన నేరం అవుతుంది. వీటిలో హత్య, కిడ్నాప్, అత్యాచారం లాంటివి ఉంటాయి. అయితే.. తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లంతా కచ్చితంగా జైళ్లలోనే ఉండాలని కూడా ఏమీ లేదు. వాళ్లు అరెస్టయిన తర్వాత బెయిల్ తీసుకుని ఉండొచ్చు, లేదా అసలు వాళ్లను అరెస్టు చేయాలని పోలీసులు భావించి ఉండకపోవచ్చు. అలాగే ఆ వ్యక్తికి ఆ నేరంలో శిక్ష పడి ఉండొచ్చు లేదా నిర్దోషిగా విడుదల చేసి కూడా ఉండొచ్చు. తమ మీద హత్యాయత్నం కేసులు నమోదైనట్లు 34 మంది ఎమ్మెల్యేలు చెప్పగా, హత్య కేసులు ఉన్నాయని 8 మంది చెప్పారు. ఒక ఎమ్మెల్యేపై.. మహిళల మీద జరిగిన నేరానికి సంబంధించిన కేసు ఉంది. పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీ తరఫున ఎన్నికైన 312 మందికి గాను 83 మంది మీద కేసులున్నాయి. అలాగే సమాజ్వాదీలోని 46 మందిలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే బీఎస్పీకి చెందిన నలుగురు, కాంగ్రెస్ సభ్యుడొకరి మీద సైతం వివిధ కేసులు ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో వాళ్లు దాఖలు చేసిన అఫిడవిట్లలోని సమాచారం ఆధారంగా ఈ లెక్కలు తెలిసినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. -
రాజుగారి పెద్ద భార్యదే పైచేయి
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అమేథి అసెంబ్లీ ఎన్నికల్లో రేపిస్టు మంత్రి గాయత్రి ప్రజాపతిని, తోటికోడలు అమితా సింగ్‌ను కూడా వెనక్కి నెట్టి.. పెద్ద భార్య గరిమాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలే గరిమా సింగ్, అమితా సింగ్. వీళ్లలో అమితాసింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమేథి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, తన మంత్రివర్గంలో సభ్యుడైన గాయత్రి ప్రజాపతికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన పేరును అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక గరిమా సింగ్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె సంజయ్‌సింగ్ నుంచి ఎప్పుడో విడిపోయారు. ఇక అమేథిలో మూడు సార్లు గెలిచిన అమితాసింగ్.. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ హవాకు తోడు తోటికోడలు కూడా కావడం, మరోవైపు బలమైన మంత్రి గాయత్రి ప్రజాపతి పోటీలో ఉండటంతో ఓట్లు బాగా చీలిపోయాయి. ఒక దశలో గాయత్రి ప్రజాపతి ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ గరిమాసింగ్ పుంజుకుని ముందుకొచ్చారు. అత్యాచారం కేసులో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటి నుంచి గాయత్రి ప్రజాపతి పరారీలో ఉన్నారు. ఆయన లక్నోలోని తన సొంతింట్లో గానీ, అమేథీలో గానీ ఎక్కడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. -
మంత్రి మిస్సింగ్.. సీఎంకు తలనొప్పి!
తన కేబినెట్ సహచరుడైన ఒక మంత్రి కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు తలనొప్పి తప్పడం లేదు. బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడైన గాయత్రీ ప్రజాపతి గత కొన్నాళ్లుగా కనపడకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో విమానాశ్రయాలన్నింటిలో ఎలర్ట్ ప్రకటించారు. వాళ్లు తన తల్లిని గట్టిగా పట్టుకుని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె అంతసేపూ తనను వదిలేయాలంటూ గట్టిగా ఏడుస్తూనే ఉందని చెప్పింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రస్తుత ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేస్తున్న గాయత్రీ ప్రజాపతి.. అరెస్టును తప్పించుకోడానికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని విమానాశ్రయాల్లో అతడిని పట్టుకోడానికి వీలుగా తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి కనపడకుండా అదృశ్యమైన ప్రజాపతి.. తాజాగా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి తలనొప్పి గాయత్రీ ప్రజాపతి వ్యవహారం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తలకు చుట్టుకుంది. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అఖిలేష్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా మంత్రికి నోటీసులిచ్చిందని, దీనిపై తాను చెప్పడానికి ఏముందని అఖిలేష్ అంటున్నారు. ప్రభుత్వం అన్నిరకాలుగా చట్టానికి సహకరిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందని, ఇదీ అలాగే జరిగిందని.. పార్టీని స్వచ్ఛంగా ఉంచేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. వాస్తవానికి అవినీతి ఆరోపణల కారణంగా గత సంవత్సరమే గాయత్రీ ప్రజాపతిని అఖిలేష్ తన మంత్రివర్గం నుంచి తప్పించినా.. ములాయం, శివపాల్ బలవంతం కారణంగా మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది.