ప్రజాపతి సరే.. ఆ 107 మంది మాటేంటి?
గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు, గత 17 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న గాయత్రీ ప్రజాపతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యను అందరూ అభినందించారు. అయితే.. యూపీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో మరో 107 మంది... తీవ్రమైన నేరాలు చేసి కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ల సంగతి ఏంటని.. ఆ నేరాల మీద విచారణ ఎప్పటికి పూర్తవుతుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సభ్యులలో 26% మంది మీద ఈ తరహా కేసులున్నాయన్నమాట. మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు కొత్తగా యూపీ అసెంబ్లీకి ఎన్నికైతే, వాళ్లలో 107 మంది మీద హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులున్నాయి. అంతేకాదు.. 143 మంది ఎమ్మెల్యేల మీద ఓ మాదిరి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఏదైనా నేరానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడి, అది నాన్ బెయిలబుల్ నేరం అయితే అది తీవ్రమైన నేరం అవుతుంది. వీటిలో హత్య, కిడ్నాప్, అత్యాచారం లాంటివి ఉంటాయి. అయితే.. తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లంతా కచ్చితంగా జైళ్లలోనే ఉండాలని కూడా ఏమీ లేదు. వాళ్లు అరెస్టయిన తర్వాత బెయిల్ తీసుకుని ఉండొచ్చు, లేదా అసలు వాళ్లను అరెస్టు చేయాలని పోలీసులు భావించి ఉండకపోవచ్చు. అలాగే ఆ వ్యక్తికి ఆ నేరంలో శిక్ష పడి ఉండొచ్చు లేదా నిర్దోషిగా విడుదల చేసి కూడా ఉండొచ్చు.
తమ మీద హత్యాయత్నం కేసులు నమోదైనట్లు 34 మంది ఎమ్మెల్యేలు చెప్పగా, హత్య కేసులు ఉన్నాయని 8 మంది చెప్పారు. ఒక ఎమ్మెల్యేపై.. మహిళల మీద జరిగిన నేరానికి సంబంధించిన కేసు ఉంది. పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీ తరఫున ఎన్నికైన 312 మందికి గాను 83 మంది మీద కేసులున్నాయి. అలాగే సమాజ్‌వాదీలోని 46 మందిలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే బీఎస్పీకి చెందిన నలుగురు, కాంగ్రెస్ సభ్యుడొకరి మీద సైతం వివిధ కేసులు ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో వాళ్లు దాఖలు చేసిన అఫిడవిట్లలోని సమాచారం ఆధారంగా ఈ లెక్కలు తెలిసినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది.