మంత్రి మిస్సింగ్.. సీఎంకు తలనొప్పి!
తన కేబినెట్ సహచరుడైన ఒక మంత్రి కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు తలనొప్పి తప్పడం లేదు. బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడైన గాయత్రీ ప్రజాపతి గత కొన్నాళ్లుగా కనపడకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో విమానాశ్రయాలన్నింటిలో ఎలర్ట్ ప్రకటించారు. వాళ్లు తన తల్లిని గట్టిగా పట్టుకుని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె అంతసేపూ తనను వదిలేయాలంటూ గట్టిగా ఏడుస్తూనే ఉందని చెప్పింది.
సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రస్తుత ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేస్తున్న గాయత్రీ ప్రజాపతి.. అరెస్టును తప్పించుకోడానికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని విమానాశ్రయాల్లో అతడిని పట్టుకోడానికి వీలుగా తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి కనపడకుండా అదృశ్యమైన ప్రజాపతి.. తాజాగా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రికి తలనొప్పి
గాయత్రీ ప్రజాపతి వ్యవహారం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తలకు చుట్టుకుంది. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అఖిలేష్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా మంత్రికి నోటీసులిచ్చిందని, దీనిపై తాను చెప్పడానికి ఏముందని అఖిలేష్ అంటున్నారు. ప్రభుత్వం అన్నిరకాలుగా చట్టానికి సహకరిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందని, ఇదీ అలాగే జరిగిందని.. పార్టీని స్వచ్ఛంగా ఉంచేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. వాస్తవానికి అవినీతి ఆరోపణల కారణంగా గత సంవత్సరమే గాయత్రీ ప్రజాపతిని అఖిలేష్ తన మంత్రివర్గం నుంచి తప్పించినా.. ములాయం, శివపాల్ బలవంతం కారణంగా మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది.