అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని ఓ మంత్రిగారి మీద ఉన్న అత్యాచారం కేసును ఎత్తేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు బిజ్నోర్ జిల్లా మేజిస్ట్రేట్కు ఆ రాష్ట్ర హోం శాఖ ఓ లేఖ రాసింది. ఈ కేసును జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి మనోజ్ కుమార్ పారస్పై మోపిన అభియోగాలు అన్నీ అవాస్తవమని తేలినట్లు ప్రభుత్వం తెలిపింది. అందువల్ల పరస్కు కోర్టులో తగిన న్యాయ సాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
నాగినా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై, సమాజ్వాదీ పార్టీ మంత్రిగా ఉన్న పరస్, అతడి అనుచరులు తనపై 2006 సంవత్సరంలో అత్యాచారం చేశారని ఓ దళిత మహిళ ఆరోపించింది. తనకు రేషన్ దుకాణం ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఇంటికి రప్పించుకుని మరీ అత్యాచారం చేశారంది. పోలీసులు ఎంతకూ పట్టించుకోకపోవడంతో ఆమె చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 2007 జనవరి 15న మంత్రి, ఇతరులపై కేసు నమోదు చేశారు. మంత్రి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశించినా, ఆయన మాత్రం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మంత్రిగారికి ప్రభుత్వం వత్తాసు పలికి, ఆరోపణలు అవాస్తవమని చెబుతోంది.
మా మంత్రిపై రేప్ కేసు ఎత్తేయండి
Published Thu, Jan 9 2014 3:13 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement