
యూపీ మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
గోరఖ్‌పూర్: హోలీ అంటే ఇష్టంలేనివారు, రంగులంటే పడనివారు దేశం విడిచి వెల్లాలని యూపీ మంత్రి, నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది హోలీ.. రంజాన్ మాసంలోని శుక్రవారం రోజే వచ్చింది. దీంతో హోలీ వేడుకలకు అసౌకర్యం కలగకుండా ముస్లింలు మధ్యాహ్నం వరకు ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వస్తే టార్పాలిన్‌తో కప్పుకోవాలని యూపీ, బీహార్‌లోని కొందరు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో హోలీ మిలన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిషాద్ మాట్లాడుతూ.. సమాజంలో విభేదాలు సృష్టించేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. హోలీ వేడుకలతో మతాన్ని ముడిపెట్టి ప్రజలన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారని, హøలీ ఆడేటప్పుడు కూడా అలాగే చేస్తారని చెప్పుకొచ్చారు.
రెండూ ఐక్యతకు సంబంధించిన పండుగలే అయినా కొందరు రాజకీయ నాయకులు ఈ ఐక్యతను కోరుకోవడం లేదని, ఒక వర్గానికి చెందిన ప్రజల మనస్సులను విషపూరితం చేస్తున్నారని ఆరోపించారు. వారు కూడా ఈ దేశం పౌరులేనని, రంగులతో సమస్యలుంటే వారు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు. రంగులు పూస్తే తమ విశ్వాసాలు దెబ్బతింటాయని భావిస్తారని, మరి రంగురంగుల దుస్తులు ఎలా ధరిస్తున్నారని ప్రశ్నించారు. రంగుల వ్యాపారులు సైతం ఆ సామాజిక వర్గానికి చెందినవారేనని వెల్లడించారు. పండుగలు ఆనందాన్ని పంచడానికి, ఐక్యతను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించినవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment