Nishad Party
-
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: ఆ పార్టీలతోనే బీజేపీ పొత్తు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలతో పొత్తు ఖరారు చేసుకుంది. అప్నాదళ్, నిషాద్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు వెనుబడిన వర్గాల నుంచి మద్దతు ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని నడ్డా విలేకరుల సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతలు, పెట్టుబడులు, సామాజిక అభ్యున్నతిలో మంచి పనితీరుని కనబరుస్తోందని చెప్పారు. త్వరలోనే సీట్లసర్దుబాటు పూర్తవుతుం దని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అప్నాదళ్ చీఫ్ అనుప్రియ పటేల్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్‌లు మోదీ ప్రభుత్వం ఒబిసిల ప్ర యోజనాల కోసం పని చేస్తుందని కొనియాడారు. చదవండి: (పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) -
కేబినెట్ విస్తరణతో యూపీలో అసంతృప్తి షురూ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం కమలదళం వదులుకోవట్లేదు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక సమీకరణాలపై దృష్టిపెట్టేందుకు పెద్ద ఎత్తున చేసిన కసరత్తు కారణంగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నిశాద్ పార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోవాల్సిందే నిషాద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) వ్యవస్థాపకుడు సంజయ్ నిషాద్ తన కుమారుడు ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. కొన్ని సీట్లలో ప్రభావం చూపే అప్నా దళ్ అనుప్రియ పటేల్‌కు కేబినెట్లో చోటు దక్కించుకోగలిగితే, 160 సీట్లలో ప్రభావం చూపే ప్రవీణ్ నిషాద్‌ను మంత్రిమండలిలో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు ఇప్పటికే బీజేపీని వీడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ తన తప్పులను సరిదిద్దుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే ఉన్నానని, అయితే బీజేపీ అధిష్టానం ఈ విధంగా నిషాద్లను విస్మరిస్తూ ఉంటే, రాబోయే సమయంలో తన వ్యూహాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. 18 శాతం నిషాద్‌లు మోసపోయారు ప్రవీణ్ నిషాద్‌ను మంత్రివర్గంలో చేర్చకపోవడం నిషాద్ సమాజానికి జరిగిన ద్రోహం అని సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న నిషాద్ సమాజం మరోసారి మోసానికి గురైందని, కేవలం 4 నుంచి 5 శాతం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుప్రియా పటేల్‌ను ఉద్దేశించి విమర్శించారు. 2017లో జరిగిన గోరఖ్‌పూర్ ఉపఎన్నికలో సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ ఎస్పీ అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ కంచుకోటలో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి వెలుగులోకి వచ్చారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా ప్రవీణ్ నిషాద్ కాషాయ కండువా కప్పుకొని సంత్ కబీర్ నగర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ప్రవీణ్ నిషాద్ ప్రస్తుతం బిజెపి ఎంపిగా ఉండగా, అతని తండ్రి నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కేబినెట్లో చోటుదక్కలేదన్న కారణంతో ఒకవేళ పార్టీని వీడితే ఆయన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంజయ్ నిషాద్, బీజేపీతో కేవలం బెదిరింపు రాజకీయాలు నడుపుతున్నార న్న చర్చ మొదలైంది. కేబినెట్లో సామాజిక సమీకరణాలు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భాను ప్రతాప్ సింగ్ వర్మను కేబినెట్లో చేర్చడం ద్వారా ఆయన షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా నూతన కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. -
ఎస్పీ-బీఎస్పీ కూటమిలో బీటలు
లక్నో(ఉత్తర్ ప్రదేశ్): ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన ‘గట్బంధన్’ నుంచి నిశాద్ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నంపై పోటీచేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమిలో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్(నిర్బల్ ఇండియన్ షోషిట్ హమారా ఆమ్ దళ్) పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్‌గంజ్ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తుపై పోటీ చేయాలని సంజయ్ నిశాద్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నిశాద్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్, ఆయన కుమారుడు ప్రవీణ్ నిశాద్(ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి) శుక్రవారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కలిశారు. ఈ పరిణామాలతో నిశాద్ పార్టీ బీజేపీ కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మూడు దశాబాద్దాలుగా గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ హవానే సాగింది. వరసగా ఏడుసార్లు బీజేపీ అధ్యర్థులే విజయం సాధించారు. ఐదుసార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యానాథే గెలిచారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో 2018లో గోరఖ్‌పూర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా నిశాద్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్ కుమారుడు ప్రవీణ్ నిశాద్ బరిలోకి దిగారు. నిశాద్ పార్టీ సహకారంతో ఎస్పీ ఈ స్థానం గెలుచుకోగలిగింది. ఈ విజయంలో నిశాద్‌పార్టీ కీలకపాత్ర పోషించింది. ఈ విజయం తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీ పార్టీలు కూటమిగా ఏర్పడటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. కొత్తగా బీజేపీ, నిశాద్ పార్టీ మధ్య ఏర్పడిన మైత్రిపై ఎస్పీ గోరఖ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ యాదవ్ స్పందించారు. బీజేపీ, నిశాద్‌పార్టీ కలిసి పోటీ చేసినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం గెలిచామే కానీ నిశాద్ పార్టీ నాయకత్వంలో కాదని వ్యాఖ్యానించారు. -
చిన్న పార్టీలతో ఫలితం తారుమారు!
యూపీ ఎన్నికల బరిలో అనేక చిన్నా చితకా పార్టీలు ► అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం ► కుల ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్న పార్టీలు లక్నో: ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చిన్నా చితకా పార్టీలు అదృ ష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడమే కాక, అభ్యర్థుల విజయావకాశాల్ని కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలో కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా మరికొన్ని ప్రధాన పార్టీలకు మద్దతు ప్రకటించాయి. వివిధ కులాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. పీస్ పార్టీ, నిషాద్ పార్టీ, మహాన్ దళ్‌కు కొన్ని కులాల్లో మంచి పట్టుంది. రాష్ట్ర ఓటర్లలో 4.5 శాతం ఓట్లున్న మలాహ్ కులం (మత్స్యకారులు, పడవ నడిపేవారు) ఓట్లపై నిషాద్ పార్టీ ఎక్కువగా ఆధారపడింది. యూపీలోని నదీ తీర ప్రాంతాల్లో ఉన్న 125 నియోజకవర్గాల్లో ఈ కులం ఓట్లు కీలకం కానున్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి రాజ్‌భర్ కులంలో మంచి పట్టుంది. అలాగే బదౌనీ, ఇటావా, బరేలీ, షాజహాన్ పూర్, ఫర్రుఖాబాద్ ప్రాంతాలపై మహాన్ దళ్ ఆశలు పెట్టుకోగా... శాక్య, మౌర్య, కుశ్వాహ, సైనీ వర్గాల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంది. అందుకే ఇటీవల బీఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మరో నేత కేశవ్ ప్రసాద్మౌర్యను రాష్ట్ర విభాగం అధ్యక్షుడ్ని చేసింది. ముస్లింల్లో పీస్ పార్టీకి పట్టు ఇక ముస్లింల్లో మంచి పట్టున్న పీస్ పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ముస్లిం ఓట్లు తమకే పడతాయని పీస్ పార్టీ ధీమాగా చెబుతోంది. ఇంతవరకూ ప్రధాన పార్టీలు లేవనెత్తని అంశాల్ని తెరపైకి తీసుకొస్తూ... పశ్చిమ ఉత్తరప్రదేశ్ వికాస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ నేతృత్వంలోని యూపీఏ మిత్రపక్షం అప్నాదళ్ పశ్చిమ యూపీలోని 10 స్థానాలకు అభ్యర్థుల్ని నిలబెట్టింది. మహిళలు, రైతుల సంక్షేమం కోసం మరికొన్ని: మహిళల భద్రత పశ్చిమ యూపీ ఎన్నికల ప్రచారంలో ఎజెండా కావడంతో.. మహిళా శక్తికరణ్ పార్టీ ఆ అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు ప్రయత్ని స్తోంది. బ్రిజ్ క్రాంతిదళ్ నేతలు బ్రిజ్ ప్రాంత చరిత్రను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మధుర, జలేసర్, భరత్పూర్ తదితర ప్రాంతాలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కాగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) వంటి పార్టీలు ఎన్నికల బరిలో లేకపోయినా పెద్ద పార్టీలకు ఓట్ల సాయం చేస్తున్నాయి. సమాజంలో వెనకబడ్డ వర్గాల సమస్యల్ని ప్రస్తావిస్తూ భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ, భారతీయ కర్యస్థ సేన, కిసాన్ మజ్దూర్ సురక్ష పార్టీ, భారతీయ భాయ్చరలు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత తెరపైకి వచ్చినవే. మత సామరస్యత కోసం తమకు ఓటేయమని అభ్యర్థిస్తున్నాయి. కానరాని ప్రముఖులు ఈ సారి యూపీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రముఖుల సందడి తగ్గింది. మొదటి రెండు దశల ఎన్నికల ప్రచారానికి ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలు దూరంగా ఉన్నారు. కావాలనే ములాయం ప్రచారానికి దూరం కాగా... అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనలేదు. తన కుమారుడికి రాంనగర్ సీటు ఇవ్వకపోవడంతో మరో సీనియర్ నేత బేణీ ప్రసాద్ వర్మ కూడా ప్రచారాన్ని విరమించుకున్నారు. బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా ఈసారి ప్రచారానికి దూరమయ్యారు.