సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం కమలదళం వదులుకోవట్లేదు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక సమీకరణాలపై దృష్టిపెట్టేందుకు పెద్ద ఎత్తున చేసిన కసరత్తు కారణంగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నిశాద్ పార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు.
తప్పులు సరిదిద్దుకోవాల్సిందే
నిషాద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) వ్యవస్థాపకుడు సంజయ్ నిషాద్ తన కుమారుడు ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. కొన్ని సీట్లలో ప్రభావం చూపే అప్నా దళ్ అనుప్రియ పటేల్‌కు కేబినెట్‌లో చోటు దక్కించుకోగలిగితే, 160 సీట్లలో ప్రభావం చూపే ప్రవీణ్ నిషాద్‌ను మంత్రిమండలిలో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు ఇప్పటికే బీజేపీని వీడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ తన తప్పులను సరిదిద్దుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే ఉన్నానని, అయితే బీజేపీ అధిష్టానం ఈ విధంగా నిషాద్లను విస్మరిస్తూ ఉంటే, రాబోయే సమయంలో తన వ్యూహాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
18 శాతం నిషాద్‌లు మోసపోయారు
ప్రవీణ్ నిషాద్‌ను మంత్రివర్గంలో చేర్చకపోవడం నిషాద్ సమాజానికి జరిగిన ద్రోహం అని సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న నిషాద్ సమాజం మరోసారి మోసానికి గురైందని, కేవలం 4 నుంచి 5 శాతం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుప్రియా పటేల్‌ను ఉద్దేశించి విమర్శించారు. 2017లో జరిగిన గోరఖ్‌పూర్ ఉపఎన్నికలో సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ ఎస్పీ అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ కంచుకోటలో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి వెలుగులోకి వచ్చారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా ప్రవీణ్ నిషాద్ కాషాయ కండువా కప్పుకొని సంత్ కబీర్ నగర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ప్రవీణ్ నిషాద్ ప్రస్తుతం బిజెపి ఎంపిగా ఉండగా, అతని తండ్రి నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కేబినెట్‌లో చోటుదక్కలేదన్న కారణంతో ఒకవేళ పార్టీని వీడితే ఆయన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంజయ్ నిషాద్, బీజేపీతో కేవలం బెదిరింపు రాజకీయాలు నడుపుతున్నార న్న చర్చ మొదలైంది.
కేబినెట్‌లో సామాజిక సమీకరణాలు
వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భాను ప్రతాప్ సింగ్ వర్మను కేబినెట్‌లో చేర్చడం ద్వారా ఆయన షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా నూతన కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్నారు.
కేబినెట్ విస్తరణతో యూపీలో అసంతృప్తి షురూ
Published Fri, Jul 9 2021 6:38 AM | Last Updated on Fri, Jul 9 2021 6:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment