సాక్షి, న్యూఢిల్లీ: 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు... సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కమలదళం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కీలక నాయకులు, ముఖ్యమైన కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం, పార్టీ భవిష్యత్తు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, తమ బలాలు, బలహీనతలు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయావకాశాలు, లోపాలు తదితర అంశాలపై చర్చించన విషయం తెలిసిందే. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో శనివారం కీలక సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టిసారించి సమీక్ష నిర్వహించారు. వీటిలో పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ బీజేపీ పాలనలో ఉన్నాయి.
సెమీఫైనల్స్‌కు ప్రణాళికలు రెడీ
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండటంతో, కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాని కైనా నిర్ణయాత్మకశక్తిగా ఉంటుంది. అందువల్లే యూపీ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్స్‌గా భావిస్తుంటారు. ఈ కారణంగా మరొకసారి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డే పనిలో కమలదళం తలమునకలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, పథకాల అమలు, వివిధ శాఖల నిధుల కేటాయింపుల వంటి వాటిని ప్రజల్లోకి ఏరకంగా తీసుకెళ్లాలనే అంశాలపై శనివారం చర్చించినట్లు తెలిసింది. యూపీలో పార్టీ బలోపేతంతో పాటు, నాయకుల మధ్య ఉన్న విబేధాలు, అంతర్గత సమస్యలను తొలగించేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సైతం కమలదళం ప్రణాళికలను సిద్ధం చేసుకుందని సమాచారం. ఒకవైపు ధరల పెరుగుదల, ఆర్థిక మాం ద్యం, ద్రవ్యోల్బణం కారణంగా సహజంగా ప్రజల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను ఏవిధంగా తగ్గించుకోవాలనే అంశంపై దృష్టిపెట్టారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ప్రతికూలంగా మారకుండా ఉండేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై వ్యూహ రచన చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment