
లక్నో: ఇతర పార్టీలతో పోలిస్తే తమ పార్టీకి సరైన నిర్ణయాలు తీసుకొనే నేతతో పాటు లక్ష్యం కూడా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. శుక్రవారం లక్నోలో జరిగిన బూత్ ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్‌కు ఆయన హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా ప్రసంగించారు. ఇతర పార్టీల్లో వారసత్వాలు కొనసాగుతున్నాయని, అవి లేని పార్టీ కేవలం తమది మాత్రమే అని చెప్పారు. ఇతర పార్టీల్లోని కార్యకర్తలంతా కేవలం కార్యకర్తలుగానే ఉండిపోతారని, కానీ తమ పార్టీలోని కార్యకర్తలు ఏకంగా ప్రధానమంత్రి, రక్షణమంత్రి, హోంమంత్రులు కాగలరని పేర్కొన్నారు. ‘మన పార్టీకి నేత, లక్ష్యం, విధానం, కార్యకర్తలు, కార్యక్రమాలు ఉన్నాయి. మనం దేని కోసం ఆగాల్సిన పని లేదు’ అని పలికారు.
వ్యూహాత్మక లాక్‌డౌన్ వల్లే..
కోవిడ్–19 గురించి చెబుతూ జేపీ నడ్డా అమెరికా ప్రస్తావన తీసుకొచ్చారు. ఎకానమీ, ఆరోగ్యం అనే అంశాల్లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియని పరిస్థితి వల్ల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీలు మన ఆరోగ్య వ్యవస్థ కంటే ఉత్తమమైన ఆరోగ్య వ్యవస్థలు కలిగి ఉన్నాయని, కానీ కరోనా వల్ల అత్యధిక మరణాలు అక్కడే సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సరైన సమయంలో తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం వల్ల కరోనా మన దేశంలో అదుపులో ఉందని అన్నారు.
(చదవండి: ఇదేనా బెంగాల్ సంస్కృతి?)
150 టెస్టుల నుంచి 10 లక్షలకు..
లాక్‌డౌన్ విధించిన సమయానికి మన దేశంలో రోజుకు 150 కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రమే చేయగల పరిస్థితి ఉందని, కానీ నేడు రోజుకు 10 లక్షల పరీక్షలు చేయగల స్థాయికి దేశం ఎదిగిందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ నాటికి మన దేశం పీపీఈ కిట్లను దిగుమతి చేసుకుంటుండగా, నేడు రోజుకు 5లక్షలకు పైగా పీపీఈ కిట్లు స్వదేశంలోనే తయారువుతున్నాయని పేర్కొన్నారు. రోజురోజుకూ రికవరీ రేటు పెరుగుతోందని అన్నారు. స్వచ్ఛభారత అభియాన్ కింద టాయ్‌లెట్లను నిర్మించామని పేర్కొన్నారు. నిజానికది మహిళలను సాధికరత వైపు నడిపే పథకమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment