uttarpradesh minister
-
మంత్రి మిస్సింగ్.. సీఎంకు తలనొప్పి!
తన కేబినెట్ సహచరుడైన ఒక మంత్రి కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు తలనొప్పి తప్పడం లేదు. బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడైన గాయత్రీ ప్రజాపతి గత కొన్నాళ్లుగా కనపడకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో విమానాశ్రయాలన్నింటిలో ఎలర్ట్ ప్రకటించారు. వాళ్లు తన తల్లిని గట్టిగా పట్టుకుని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె అంతసేపూ తనను వదిలేయాలంటూ గట్టిగా ఏడుస్తూనే ఉందని చెప్పింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రస్తుత ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేస్తున్న గాయత్రీ ప్రజాపతి.. అరెస్టును తప్పించుకోడానికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని విమానాశ్రయాల్లో అతడిని పట్టుకోడానికి వీలుగా తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి కనపడకుండా అదృశ్యమైన ప్రజాపతి.. తాజాగా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి తలనొప్పి గాయత్రీ ప్రజాపతి వ్యవహారం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తలకు చుట్టుకుంది. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అఖిలేష్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా మంత్రికి నోటీసులిచ్చిందని, దీనిపై తాను చెప్పడానికి ఏముందని అఖిలేష్ అంటున్నారు. ప్రభుత్వం అన్నిరకాలుగా చట్టానికి సహకరిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందని, ఇదీ అలాగే జరిగిందని.. పార్టీని స్వచ్ఛంగా ఉంచేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. వాస్తవానికి అవినీతి ఆరోపణల కారణంగా గత సంవత్సరమే గాయత్రీ ప్రజాపతిని అఖిలేష్ తన మంత్రివర్గం నుంచి తప్పించినా.. ములాయం, శివపాల్ బలవంతం కారణంగా మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది. -
మంత్రి హెలికాప్టర్.. అత్యవసర ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆజంఖాన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జహంగీరాబాద్ సమీపంలోని కరండ్ గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య కారణంగా దీన్ని అక్కడ దించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. లక్నో నుంచి బహ్రైచ్ వెళ్లాల్సిన ఈ హెలికాప్టర్లో ఏ రకమైన సాంకేతిక సమస్య వచ్చిందో మాత్రం తెలియలేదు. అయితే ఖాన్ వెళ్తున్న దీన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి రావడంతో ఏమవుతుందోనని అంతా ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు గ్రామంలోనే అయినా సురక్షితంగా కిందకు దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్లో ఉన్నవాళ్లంతా సురక్షితంగానే ఉన్నారని, అది కిందకు దిగిన తర్వాత ఆజం ఖాన్‌ను రోడ్డు మార్గంలో లక్నో పంపామని పోలీసు సూపరింటెండెంట్ రాజాబాబు తెలిపారు. -
మంత్రిపేరుతో ఫేస్బుక్ కామెంట్.. కుర్రోడు జైలుపాలు
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత శక్తిమంతమైన మంత్రి ఆజంఖాన్ పేరుతో ఫేస్బుక్లో కామెంట్ పోస్టు చేసినందుకు ఓ టీనేజి విద్యార్థి జైలు పాలయ్యాడు. బరేలిలోని ఓ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిపై పోలీసులు సెక్షన్ 66 ఎ కింద కేసు పెట్టారు. శాంతిభద్రతలకు భంగం కలిగించారన్నది అతడిపై చేసిన ఆరోపణ. ఈ కుర్రాడి ఫేస్బుక్ పోస్టింగ్‌పై ఆజంఖాన్ అనుచరుడు ఫసాహన్ అలీఖాన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు వెంటనే అతడిని అరెస్టుచేసి, కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లాజైలుకు పంపారు. ఆజంఖాన్ పేరుతో అసత్య ప్రచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, అవి హిందూ ముస్లింలిద్దరి మనోభావాలను దెబ్బతీశాయని, ఆజం ఖాన్ పరువుకు కూడా భంగం వాటిల్లిందని అలీఖాన్ చెప్పారు. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు కుర్రాడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. -
పార్టీ కార్యకర్తను కొట్టిన యూపీ మంత్రి
ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అంటేనే రౌడీలు, గూండాలకు ప్రసిద్ధి అంటారు. ఓ మంత్రిగారు ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. పార్టీ కార్యకర్త ఒకరిని చెంపమీద కొట్టి, పిడిగుద్దులు కురిపించారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగిపోతోందని చెప్పడమే అతడు చేసుకున్న పాపం. రాష్ట్ర పీడబ్ల్యుడీ శాఖ మంత్రి సురేంద్ర పటేల్ అందరూ చూస్తుండగా వారణాసిలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా ఇలా కార్యకర్తను కొట్టారు. పార్టీ మద్దతుదారులు తమ సమస్యలు చెప్పుకొంటుండగా, కొంతమంది పార్టీ సభ్యులే గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆ కార్యకర్త చెప్పారు. వెంటనే మంత్రిగారు అతగాడివైపు దూకి, చెంపమీద కొట్టారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు కురిపించారు. మరోమంత్రి శివపాల్ సింగ్ యాదవ్ అనుచరుడైన పటేల్.. కార్యకర్తను తీవ్రంగా హెచ్చరించడంతో అతడు రెండుచేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. ఇదంతా టీవీ కెమెరాలకు ఎంచక్కా చిక్కింది. సొంత పార్టీ కార్యకర్తలనే మంత్రులు ఇలా కొడుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు. -
మా మంత్రిపై రేప్ కేసు ఎత్తేయండి
అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని ఓ మంత్రిగారి మీద ఉన్న అత్యాచారం కేసును ఎత్తేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు బిజ్నోర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆ రాష్ట్ర హోం శాఖ ఓ లేఖ రాసింది. ఈ కేసును జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి మనోజ్ కుమార్ పారస్పై మోపిన అభియోగాలు అన్నీ అవాస్తవమని తేలినట్లు ప్రభుత్వం తెలిపింది. అందువల్ల పరస్‌కు కోర్టులో తగిన న్యాయ సాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నాగినా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై, సమాజ్‌వాదీ పార్టీ మంత్రిగా ఉన్న పరస్, అతడి అనుచరులు తనపై 2006 సంవత్సరంలో అత్యాచారం చేశారని ఓ దళిత మహిళ ఆరోపించింది. తనకు రేషన్ దుకాణం ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఇంటికి రప్పించుకుని మరీ అత్యాచారం చేశారంది. పోలీసులు ఎంతకూ పట్టించుకోకపోవడంతో ఆమె చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 2007 జనవరి 15న మంత్రి, ఇతరులపై కేసు నమోదు చేశారు. మంత్రి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశించినా, ఆయన మాత్రం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మంత్రిగారికి ప్రభుత్వం వత్తాసు పలికి, ఆరోపణలు అవాస్తవమని చెబుతోంది.