మోధీర | Massive victory to Modi and BJP in Uttarpradesh and Uttarakhand | Sakshi
Sakshi News home page

మోధీర

Published Sun, Mar 12 2017 3:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Massive victory to Modi and BJP in Uttarpradesh and Uttarakhand

- అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అఖండ విజయం
- మిత్రపక్షాలతో కలసి 325 సీట్లు కైవసం
- యూపీలో 14 ఏళ్ల తర్వాత అధికార పీఠం సొంతం
- ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి కకావికలం.. 54 సీట్లకే పరిమితం
- 19 స్థానాలతో మూడోస్థానానికి  పడిపోయిన బీఎస్పీ
- ఉత్తరాఖండ్‌లోనూ వికసించిన కమలం.. 57 స్థానాలు కైవసం
- కాంగ్రెస్‌ చేతికి పంజాబ్‌.. మూడో స్థానానికి అధికార అకాలీ–బీజేపీ
- గోవా, మణిపూర్‌లో హంగ్‌.. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌
- ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, బీజేపీ ధీమా
- ఫలితాలపై బీజేపీలో హర్షాతిరేకాలు


లక్నో/చండీగఢ్‌/న్యూఢిల్లీ

రామ జన్మభూమిలో మోదీ నాదం మార్మోగింది..! 14 ఏళ్ల వనవాసం తర్వాత ఉత్తరప్రదేశ్‌ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడింది..! ప్రభంజనంలా దూసుకొచ్చిన మోదీ సునామీ యూపీని ఓ ఊపు ఊపేసింది.. కూటములను కుమ్మేస్తూ.. రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త చరిత్రను లిఖిస్తూ.. ‘సెమీ ఫైనల్‌’ పోరులో అఖండ విజయాన్ని నమోదుచేసింది!! ఎగ్జిట్‌పోల్స్, రాజకీయ పండితుల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ 403 స్థానాలకుగాను ఏకంగా 325 సీట్లను నెగ్గి యూపీలో సర్కారును ఏర్పాటు చేయబోతోంది. సొంతంగా 312 స్థానాల్లో నెగ్గిన బీజేపీ బలం.. మిత్రపక్షాలైన అప్నాదళ్, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) సీట్లతో కలుపుకుంటే 325కు చేరింది. మొత్తంగా 40 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. 1991లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో యూపీ(అవిభాజ్య)లో బీజేపీ అత్యధికంగా 425 సీట్లకుగాను 221 సీట్లు గెల్చుకుంది. 1977లో జనతాపార్టీ అత్యధికంగా 352 సీట్లను గెల్చుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు.. శనివారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఆ స్థాయిలో సీట్లు గెల్చుకోవడంతో విపక్షాల అడ్రస్‌ గల్లంతైంది. బీజేపీ దూకుడు ముందు సమాజ్‌వాదీ–కాంగ్రెస్‌ కూటమి, బహుజన్‌ సమాజ్‌వాదీ(బీఎస్పీ) బొక్కబోర్లా పడ్డాయి. ఎస్పీ–కాంగ్రెస్‌ 54, బీఎస్పీ 19 స్థానాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీలో 224 స్థానాలున్న అధికార ఎస్పీ సొంతంగా 47 సీట్లు మాత్రమే గెల్చుకోగా.. 21 స్థానాలున్న కాంగ్రెస్‌ ఏడు సీట్లకే పరిమితమైంది. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఓటమిని అంగీకరిస్తూ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. ఆదివారం జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు, పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు.

ఉత్తరాఖండ్‌లో కమల వికాసం
దేవభూమి ఉత్తరాఖండ్‌లోనూ కమలం వికసించింది. అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించి విజయదుందుబి మోగించింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలకుగాను 56 స్థానాలను కైవసం చేసుకుంది. గత 16 ఏళ్లలో ఒక పార్టీ ఇన్ని సీట్లను కైవసం చేసుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇక అధికార కాంగ్రెస్‌ 11 సీట్లతో సరిపెట్టుకుంది. సీఎం హరీశ్‌ రావత్‌ రెండు చోట్ల పోటీ చేయగా ఆ రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. బీజేపీ ఘన విజయం సాధించినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ ఓటమి పాలవడం పార్టీ శ్రేణుల్ని నిరాశలో ముంచింది.

పంజాబ్‌ ‘హస్త’గతం
ఉత్తరప్రదేశ్‌లో భంగపడ్డ కాంగ్రెస్‌.. పంజాబ్‌లో మాత్రం బీజేపీకి చుక్కలు చూపించింది. అధికార అకాలీదళ్‌–బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి జయకేతనం ఎగురవేసింది. 117 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 77 చోట్ల విజయఢంకా మోగించింది. అకాలీ–బీజేపీ కూటమిని 18 స్థానాలతో మూడోస్థానానికి పరిమితం చేసింది. పంజాబ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తొలిసారి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి నిరాశే ఎదురైంది. 22 సీట్లను మాత్రమే గెల్చుకొని రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ శనివారమే 75వ పడిలోకి అడుగుపెట్టారు. తమ అభిమాన నేతకు ఈ విజయాన్ని కానుకగా ఇస్తున్నామంటూ కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

గోవా, మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌
పర్యాటకుల స్వర్గధామం గోవా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కాంగ్రెస్‌ దూకుడును ప్రదర్శించింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని రెండోస్థానానికి నెట్టేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే చిన్నపార్టీలు, ఇతరులతో కలిసి ఈ రెండుచోట్ల కూడా తామే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది. గోవాలో 40 స్థానాలకుగాను కాంగ్రెస్‌ కూటమి 18 సీట్లను గెల్చుకొని మ్యాజిక్‌ ఫిగర్‌కు 3 సీట్ల దూరంలో ఆగిపోయింది. అధికార బీజేపీ కూటమి 14 సీట్లను నెగ్గింది. ఇతరులు 8 చోట్ల గెలిచారు. మండ్రెమ్‌ నుంచి పోటీ చేసిన గోవా సీఎం లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ సహా ఆయన కేబినెట్‌లోని ఆరుగురు మంత్రులు పరాజయాన్ని మూటగట్టుకోవడం గమనార్హం. ఆప్‌ ఖాతా కూడా తెరవలేకపోయింది.

మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా.. అధికార కాంగ్రెస్‌ 28 సీట్లు(34.7 శాతం ఓట్లు) గెల్చుకొని మ్యాజిక్‌ ఫిగర్‌కు 3 సీట్ల దూరంలో ఆగింది. బీజేపీ 21 (36 శాతం ఓట్లు), ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు. ముఖ్యమంత్రి ఒక్రమ్‌ ఇబోబీ సింగ్‌ తౌబల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపై 10 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. ఇక పీఆర్‌జేఏ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగిన ఉక్కుమహిళ ఇరోమ్‌ చాను షర్మిలకు కేవలం 90 ఓట్లు మాత్రమే దక్కాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులే కీలకం కానున్నారు.

బీజేపీలో హర్షాతిరేకాలు
నోట్ల రద్దు తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత కీలకమైన యూపీతోపాటు ఉత్తరాఖండ్‌లో ఘన విజయం సాధించడంతో బీజేపీలో సంబరాలు మిన్నంటాయి. నోట్ల రద్దుకు ప్రజామోదం ఉందని ఈ ఫలితాలతో నిరూపితమైందని, మోదీ చరిష్మా, సుపరిపాలన, పేదల అనుకూల విధానాలే తమకు ఘన విజయాన్ని కట్టబెట్టాయంటూ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలో పార్టీ కార్యాలయాల వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఇది మోదీ సునామీ అని అభివర్ణించారు. ‘ఈ విజయం మోదీపై పేద ప్రజలకున్న నమ్మకాన్ని చూపుతోంది. అవినీతి రహిత పాలన, పేదల అనుకూల విధానాలు సాధించిన విజయం ఇది’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement