ప్రధాని మోదీకి దీటుగా కౌంటర్ ఇచ్చిన సీఎం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీటుగా తిప్పికొట్టారు. శనివారం మీరట్ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. స్కాం (scam) అంటే సమాజ్‌వాదీ పార్టీ (s), కాంగ్రెస్ పార్టీ (c), అఖిలేష్ యాదవ్ (a), మాయావతి (m) అంటూ వ్యాఖ్యానించగా, కాసేపటి తర్వాత ఔరయ్యా ఎన్నికల సభలో అఖిలేష్ స్పందిస్తూ.. స్కాం (scam)లో a అంటే అమిత్ షా అని, m అంటే మోదీ అని కౌంటర్ ఇచ్చారు. మోదీ, అమిత్ షాల నుంచి దేశాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
యూపీలో బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మీరట్ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యూపీ అభివృద్ది చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అధికార సమాజ్‌వాదీ పార్టీపై పలు ఆరోపణలు చేయడంతో పాటు ప్రజలకు పలు హామీలు ఇచ్చారు.