అందుకే మోదీ అబద్ధాలు చెబుతున్నారు..
కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని, తానేమి చెప్పినా ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కలసి రాహుల్ పాల్గొన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. స్కాం (SCAM) అంటే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, అఖిలేష్, మాయావతి అంటూ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తిప్పికొట్టారు. తనకు స్కాం అంటే సేవ (సర్వీస్), సాహసం (కరేజ్), సామర్థ్యం (ఎబిలిటీ), సచ్ఛీలత (మాడెస్టి) అని రాహుల్ అభివర్ణించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీ కూటమిని గెలిపించాలని రాహుల్ ప్రజలను కోరారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత మోదీ ఆ రాష్ట్రం గురించి మాట్లాడటం మానేశారని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన ఎప్పుడూ ఈ రాష్ట్రం గురించి మాట్లాడరని విమర్శించారు. ఈ ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. కాన్పూరులో మెట్రో రైళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.