మాది ప్రజాకూటమి
- మోదీకి, సంఘ్ విద్వేషకారులకు గట్టి సమాధానమిస్తాం
- సంయుక్త మీడియా సమావేశంలో రాహుల్- అఖిలేశ్
లక్నో: ‘ప్రోగ్రెస్(అభివృద్ధి), ప్రాస్పరిటీ(శ్రేయస్సు), పీస్(శాంతి).. ‘3పీ’ అజెండాగా మా కూటమి ఏర్పడింది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోన్న బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లను నిలువరించడానికే మేం జట్టుకట్టాం’అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, 3పీకి పీపుల్స్(ప్రజా) అనే మరో పదాన్ని జోడించిన అఖిలేశ యాదవ్.. తమది ‘ప్రజాకూటమి’అని తేల్చిచెప్పారు. తప్పుడు నిర్ణయాలతో దేశాన్ని క్యూలైన్లో నిలబెట్టిన మోదీకి ప్రజాకూటమి గట్టి సమాధానం చెబుతుందని ఉద్ఘాటించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్- సమాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన కీలక నేతలిద్దరూ కలిసి ఆదివారం తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. లక్నోలో జరిగిన ఈ ప్రెస్‌మీట్‌లో రాహుల్, అఖిలేశ్ పోటాపోటీగా ఛలోక్తులు విసిరారు.
అఖిలేశ్ మంచివాడే కానీ..
సంయుక్త సమావేశంలో మొదట మాట్లాడిన రాహుల్ గాంధీ.. అఖిలేశ్‌ను ఉద్దేశించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘అఖిలేశ్ మంచి యువకుడని మొదటి నుంచీ మా పార్టీ వాళ్లతో అంటూనేఉంటా. కానీ అతని చుట్టూ చేరినవాళ్లవల్ల అతను సరిగా పనిచేయలేకపోయాడు. ఇప్పుడా ఇబ్బందుల నుంచి బయటపడటం సంతోషకరం’అని రాహుల్ అన్నారు. యూపీలో గంగా-యమున సంగమంలాగే కాంగ్రెస్- సమాజ్‌వాదీ పార్టీలు కలిశాయని, ఇదొక చరిత్రాత్మక కూటమి అని, విద్వేషకారులకు బుద్ధిచెబుతామని రాహుల్ అన్నారు. ఎస్పీతో పొత్తు విషయంలో ప్రియాంకా గాంధీది కీలక పాత్రఅని, అయితే ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనేది, లేనిది ఆమె నిర్ణయానికే వదిలేశామని రాహుల్ తెలిపారు.
ఎన్నోకాలాలు చూశాం..
రాహుల్ తర్వాత మైక్ అందుకున్న అఖిలేశ్.. మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘వర్షాకాలాన్ని చూశాం, తర్వాత చలికాలం, ఆపై ఎండాకాలం.. ఇలా ఎన్నో కాలాలు ఎదురుచూశాం.. కానీ మోదీ వాగ్ధానమిచ్చిన మంచికాలం(అచ్ఛేదిన్) మాత్రం చూడలేకపోయాం. మాటతప్పిందేకాక దేశాన్ని క్యూలైన్లో నిలబెట్టిన ఆయనకు.. ప్రజాకూటమి విజయం ద్వారా గట్టి సమాధానం చెబుతాం’అని అఖిలేశ్ అన్నారు. రాహుల్ గాంధీది, తనదీ ఒకే ఈడు అని, అభివృద్ధి ఆకాంక్షలు కూడా సమానస్థాయిలోనే ఉంటాయని, ఎన్నికల్లో తమ జోడీ అద్భుత ఫలితాలు సాధిస్తుందని అఖిలేశ్ చమత్కరించారు.