రాత్రికి రాత్రే రాహుల్ గాంధీ ఔట్!
ఉత్తరప్రదేశ్‌లో తాము మళ్లీ అధికారంలోకి రావడం కష్టమన్న విషయం అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం కలగలేదని ఆలస్యంగా అర్థమైంది. దాంతో నిన్నమొన్నటి వరకు సైకిల్ వెనకసీటు మీద కూర్చోబెట్టుకున్న రాహుల్ గాంధీని సమాజ్‌వాదీ పార్టీ తోసిపారేసింది. రాత్రికి రాత్రే లక్నోలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న భారీ కటౌట్‌ను తొలగించారు. లక్నోలోని సమాజ్‌వాదీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల లైఫ్ సైజ్ కటౌట్లు ఉండేవి. కానీ, శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి అక్కడున్న రాహుల్ గాంధీ కటౌట్ తీసేసి.. ఆ స్థానంలో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ ఇద్దరూ ఉన్న కొత్త కటౌట్ పెట్టారు. ములాయం ఫొటో పెద్దగాను, ఆయన ముందు అఖిలేష్ కొంత చిన్నగాను ఉన్న కటౌట్‌ను ఎప్పుడు సిద్ధం చేయించారో గానీ, దాన్ని పెట్టేశారు.
దాంతో తమకు ఎన్నికల్లో ఏమాత్రం ఉపయోపడని కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండటం దండగన్న పద్ధతిలో సమాజ్‌వాదీ పార్టీ తీరు కనిపించింది. ఎన్నికల ప్రచారాల్లో చాలావరకు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ కలిసే కనిపించారు. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసికట్టుగా ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. సైకిల్ ముందుకే వెళ్తుందని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలదన్ని.. బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. దాంతో అక్కడ కమలవికాసం తప్పదని సైకిల్ పార్టీ నేతలకు అర్థమైంది. ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్, ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ లాంటి పెద్ద స్థాయి అభ్యర్థులు కూడా ఓటమి అంచుల్లోనే కనపడుతున్నారు.