బిహార్ గుర్తుందా.. ఇప్పుడూ మేమే: రాహుల్
బిహార్ ఎన్నికల సమయంలో కూడా తాము గెలుస్తామని ఎవరూ ఊహించలేదని.. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్‌లో అదే జరగబోతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అప్పట్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. మహాకూటమి 178 స్థానాలు సాధించగా, బీజేపీ కూటమికి 58 వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో తాము విజయం సాధించడం ఖాయమన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ - సమాజ్‌వాదీ పార్టీ కూటమి రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. బిహార్ ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయని, యూపీలో తాము అధికారం చేపట్టడం తథ్యమని రాహుల్ చెప్పారు.
అఖిలేష్ యూటర్న్
నిన్న మొన్నటి వరకు అవసవరమైతే బీఎస్పీతోనైనా చేతులు కలుపుతాము తప్ప బీజేపీని అధికారం చేపట్టనిచ్చేది లేదన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట మార్చారు. హంగ్ అసెంబ్లీ వస్తే అప్పుడు చూసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలని కూడా ఎవరూ కోరుకోవడం లేదని, బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన చేయాలని చూస్తోందని ఆయన చెప్పారు. యూపీలో తాము ప్రచారం ముమ్మరంగా చేశామని, అందువల్ల మరోసారి అధికారం చేపట్టే విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా అన్నారు.