యూపీ ‘వికాస్’ మా లక్ష్యం..
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అధికారం ఇవ్వండి..
► విద్యుత్, శాంతిభద్రతలు(కానూన్ ), రోడ్లు(సడక్) అందిస్తాం
► బీజేపీ తుపాన్ ను అడ్డుకోవడానికే కాంగ్రెస్–ఎస్‌పీ దోస్తీ
► రూ.40 వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడగలిగాం.. అలీగఢ్‌లో మోదీ
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు వికాస్ (విద్యుత్), కానూన్ (శాంతి, భద్రతలు), సడక్(రోడ్లు)) అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుపాన్ ను అడ్డుకోలేమనే ఉద్దేశంతోనే సీఎం అఖిలేశ్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారం అలీగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ్‌వాదీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆరోపించారు. ప్రస్తుతం యూపీ ప్రజలు మార్పును, న్యాయాన్ని కోరుకుంటున్నారని, దీనిని గుర్తించే బీజేపీ తుపాన్ కొట్టుకుపోతాననే అఖిలేశ్ వణుకుతున్నారన్నారు.
ప్రజల డబ్బును కాపాడేందుకే..
ప్రజల డబ్బును కాపాడేందుకు తాము కఠిన నిబంధనలను అనుసరించి పనిచేస్తున్నామని, దీంతో ప్రతిపక్షాలకు కోపం వస్తోందన్నారు. అందుకే వారంతా తనను ఓడించేందుకు ఏకమయ్యారని, రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ దక్కకూడదనే చేతులు కలిపారని ప్రధాని ఆరోపించారు. తాము తీసుకున్న కఠిన చర్యలు దొంగలు, దోపిడీదారులు, అవినీతిపరులకు సహాయం అందకుండా చేస్తున్నాయని, ఇది ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నాయన్నారు. నల్లధనం దాచుకున్న వారికి గుణపాఠం చెప్పాలని తాను భావిస్తున్నానని చెప్పారు. ఎస్‌పీ సర్కారు అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోయిందని, ఆ పార్టీ బంధుప్రీతి, కులతత్వంతో పనిచేయడంతో అభివృద్ధి జరగలేదని.. కనీసం చెరకు రైతుల బకాయిలనూ చెల్లించలేకపోయిందన్నారు.
ఉద్యోగాల కోసం యువత లంచాలు..
యూపీలో యువత ఉద్యోగాల కోసం లంచాలు చెల్లిస్తున్నారని, వారిని ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటర్వూ్యలు చేస్తున్నారని మోదీ విమర్శించారు. దీంతో పేదలు నాయకులకు లంచాలు ఇచ్చేందుకు ఇళ్లు, స్థలాలు తాకట్టు పెడుతున్నారని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ఇలాంటి అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా తినకుండా ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం ద్వారా రూ.40 వేల కోట్ల ప్రజాధనాన్ని రక్షించగలిగామని తెలిపారు. యూపీలో చీకటిపడిన తర్వాత మహిళలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారని, గూండాయిజానికి అడ్డుకట్ట పడాలంటే వచ్చే ఎన్నికల్లో నేరస్తులకు రక్షణ కల్పించే నాయకులను ఓడించాలని సూచించారు.
అఖిలేశ్, మాయా ఒకరిని మించి ఒకరు..
యూపీలో నేరాలను ప్రోత్సహించడంలో అఖిలేశ్, మాయావతి పోటీపడుతున్నారని మోదీ ఆరోపించారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు ప్రధానమైన నేరాల్లో యూపీ దేశంలో మొదటి స్థానంలో ఉండేదని, అఖిలేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నేరాల్లో యూపీ ముందుందని చెప్పారు. యూపీలో ఒక్క రోజులో 7,650 నేరాలు, 24 అత్యాచారాలు, 21 అత్యాచార యత్నాలు, 13 హత్యలు, 33 కిడ్నాప్‌లు, 19 ఘర్షణలు, 136 దొంగతనాలు జరుగుతున్నాయని లెక్కలతో పాటు వివరించారు.
వారి మాటకు విలువెక్కువ
న్యూఢిల్లీ: సాధువులు, మత సంస్థలు స్వచ్ఛ భారత్ వంటి సంఘ సంస్కరణ అంశాలను లేవనెత్తడంతో ముందుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రభుత్వం చెప్పే మాటలకంటే సాధుసంతుల మాటల ప్రభావమే ఎక్కువగా ఉంటుందన్నారు. కర్ణాటక ఉడిపీలో జరుగుతున్న మధ్వాచార్యుల 700వ జయంతి వేడుకను ఉద్దేశించి ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. భక్తి ఉద్యమ కాలం నుంచి సాధువులు దురాచారాలకు పరిష్కారం కనుగొనేలా సమాజాన్ని ప్రోత్సహించారని అన్నారు. ‘మానవత్వానికి మించిన మతం లేదన్న అవగాహన కల్పించడానికి అలాంటి జ్ఞానులు సమాజాన్ని ప్రోత్సహించారు. నేను చెప్పిందే సరైందన్న ఛాందసవాదానికి ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న భావన విరుగుడు’ అని పేర్కొన్నారు.