ఒరిస్సాలో కూడా నరేంద్ర మోదీ మ్యాజిక్..
న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలోని 15 రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ) తిష్ట వేసిన ఒడిశా అసెంబ్లీలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని అప్రతిహతంగా 17 ఏళ్లుగా పాలిస్తున్న నవీన్ పట్నాయక్‌ను ఎలాగైన రానున్న అసెంబ్లీలో మట్టి కరపించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బీజేపీ తన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలను ఒడిశాలో నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండేళ్ల ముందు నుంచి ఒడిశాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెల్సిందే. ఏ కేంద్ర పథకాన్ని ఒడిశాలో ప్రారంభించినా పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులను పార్టీ రాష్ట్రానికి పంపిస్తోంది.
సాక్షాత్తూ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి హోదాలో ఒడిశాను సందర్శించడం నాలుగోసారి. స్థానిక మీడియాలో గానీ, ప్రజల్లో గానీ పాలకపక్ష బిజూ జనతాదళ్, బీజేపీ తప్ప మరో పార్టీ కనిపించకూడదనే వ్యూహంతోనే బీజేపీ ముందుకెళుతోంది. అంటే రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనుమరుగుచేయడమే లక్ష్యం. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం అంటూ 2015 నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఒడిశాలో ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో నాలుగు లక్షలున్న పార్టీ సభ్యత్వాన్ని 40 లక్షలకు పెంచాలని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించిన దాని కన్నా, అంటే 297 జిల్లా పరిషత్‌లు వచ్చిన నేపథ్యంలో ఒడిశాలోనే జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని బీజేపి అధిష్టానం నిర్ణయించింది. అందుకనే మోదీ, అమిత్‌షాలు ఒడిశా జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
ఒడిశాలో మోదీ మ్యాజిక్ పని చేస్తోందని, ఆయన 'తూర్పు చూడు' అనే విధానం విజయవంతం అవుతోందని, అందుకు 297 జిల్లా పరిషత్ స్థానాలు రావడమే నిదర్శనమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీలో కేవలం 10 స్థానాలకు పరిమితమైన బీజేపీకి ఇన్ని జెడ్పీలు రావడం విశేషమే కావచ్చు. కానీ వింతకాదు. తరతరాలుగా బీజేపీ బలంగా ఉన్న పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లోనే ఈ సీట్లు వచ్చాయన్న విషయాన్ని కూడా గ్రహించాలి. మొత్తం 846 స్థానాల్లో 473, అంటే 50 శాతానికిపైగా స్థానాలను కైవసం చేసుకున్న బిజూ జనతాదళ్ ఇప్పటికీ బలంగానే ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది.
అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం గతంలో ఉన్న సంబంధాలను అప్పుడే వదులుకోకూడదనే ఉద్దేశంతో నవీన్ పట్నాయక్‌తో సన్నిహిత సంబంధాలను ఇప్పటికీ కొనసాగిస్తోంది. బీజేపీ జాతీయ నాయకులు ఒడిశా వచ్చినప్పుడల్లా నవీన్ పట్నాయక్‌ను కలుసుకోకుండా ఉండరు. గతంతో బీజేపీకి సంకీర్ణ భాగస్వామిగా బిజూ జనతాదళ్‌తో తొమ్మిదేళ్ల అనుబంధం ఉంది. 2000 సంవత్సరం నుంచి 2009 వరకు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగింది. క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కారణంగా బీజేపీతో బిజూ బంధం తెంపుకొంది. ఫలితంగా 2000 సంవత్సరంలో బీజేపీకి 38 సీట్లు ఉండగా, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. దేశవ్యాప్తంగా మోదీ పవనాలు వీస్తున్న సమయంలో, 2014లో లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం పది సీట్లకు మాత్రమే తన బలాన్ని పెంచుకోగలిగింది. మళ్లీ 2019లో కూడా లోక్‌సభతో పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న దృష్టిలో బీజేపీ ముందుకెళుతోంది.
ప్రజల మధ్యకు వెళ్లకుండా, ప్రచారానికి దూరంగా ఉండి పని చేసుకుపోయే నవీన్ పట్నాయక్, బీజేపీ వ్యూహాన్ని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఇటీవల చురుగ్గా ప్రజల్లోకి వెళుతున్నారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్టీల్ హబ్‌కు వ్యతిరేకంగా గతంలో గొడవలు జరిగిన కలింగనగర్ లాంటి ప్రాంతాలను కూడా సందర్శించి, బాధితులకు పునరావాసం కల్పిస్తున్నారు. 2019 నాటికి ఏ పార్టీ బలం ఎంత పెరుగుతుందనే అంశాన్ని బట్టే బీజేపీ, బిజూ దళ్‌లు విడివిడిగా పోటీ చేస్తాయా, కలసి పోటీ చేస్తాయా? అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.